
ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టాలి
వరంగల్ అర్బన్: డ్రెయినేజీలు నిర్మించిన తర్వాత రోడ్లు నిర్మించాలని, అప్రూవల్ తీసుకున్న ప్లాన్ ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆయా విభాగాల అధికారులను హెచ్చరించారు. గురువారం హనుమకొండలోని 4, 5, 6 డివిజన్ల పరిధి టైలర్ స్ట్రీట్, కుమార్‌పల్లి మార్కెట్, రెడ్డిపురం, పెగడపల్లి డబ్బాలు తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటేషన్ నిర్వహణను పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్.. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించి హాజరులో నమోదు చేసిన సిబ్బంది ఏరియాలో ఎక్కడ పని చేస్తున్నారో తనిఖీ చేశారు. జవాన్లకు కేటాయించిన ఏరియాలో ట్రేడ్ లైసెనన్స్ లేకుండా దుకాణాలు నడిపితే సంబంధిత జవాన్ పెనాల్టీ చెల్లించాలని కమిషనర్ అన్నారు. 53వ డివిజన్ సరస్వతీనగర్, సమ్మయ్య నగర్ ప్రాంతాల్లో కమిషనర్ సైట్ ఇన్‌స్పెక్షన్ చేశారు.
భవన నిర్మాణ అనుమతుల
జారీ కోసం పరిశీలన
శంభునిపేట రెడ్డిపురం విద్యుత్‌నగర్ గోపాల్‌పూర్ చింతగట్టు బ్రిడ్జి ప్రాంతంలో భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను కమిషనర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్‌రాడేకర్, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఏసీపీ రజిత, ఏర్షాద్, ఈఈ రవికుమార్, డీఈ రాజ్‌కుమార్, ఏఈ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనుల తనిఖీ