
‘కార్పొరేట్’కు ఊడిగానికే 4 లేబర్ కోడ్‌లు
హన్మకొండ అర్బన్ : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకొచ్చి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, లేబర్ కోడ్‌లు రద్దు అయ్యేంత వరకు ఉద్యమాలు ఆగవని సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శులు కర్రె భిక్షపతి, గాదె ప్రభాకర్ రెడ్డి, హంసరెడ్డి, సీపీఐ(ఎంఎల్), ఆర్‌ఎస్పీ జిల్లా నాయకులు గంగుల దయాకర్, కౌడగాని శివాజీలు అన్నారు. బుధవారం సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏకశిలా పార్కునుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్‌లు తీసుకువచ్చి ఎనిమిది గంటల పని విధానాన్ని ఎత్తివేసి, కార్మికుల సమ్మె హక్కును కాలరాస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు సిరబోయిన కరుణాకర్, అదరి శ్రీనివాస్, ఎన్‌ఎ స్టాలిన్, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, బొట్ల చక్రపాణి, ఎం. చుక్కయ్య, రాగుల రమేష్, గొడుగు వెంకట్, నున్నా అప్పారావు, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, జక్కు రాజ్ గౌడ్, బత్తిని సదానందం, నేదునూరి వెంకట్రాజం, కొట్టెపాక రవి, నేదునూరి రాజమౌళి, మునిగాల భిక్షపతి, వేల్పుల సారంగపాణి, ధర్ముల రాంమూర్తి, కార్మికులు పాల్గొన్నారు. కాగా, సమ్మెకు వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.
కదం తొక్కిన కార్మికులు
వరంగల్ అర్బన్ :కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న కార్మిక శ్రమ దోపిడీ విధానాలను నిరసిస్తూ బుధవారం నగరంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు, పలు యూనియన్ల నాయకులు కదం తొక్కారు. వివిధ యూనియన్ల నాయకులు కార్మికులతో కలిసి వ్యాపార, వాణిజ్య సంస్థలను బంద్ చేయించి, పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలో సీఐటీయూ ఆధ్వర్యంలోకార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. దీంతో నగర వ్యాప్తంగా చెత్త సేకరణ, వివిధ పనులు నిలిచిపోయాయి. కార్యక్రమంలో ఉప్పలయ్య, సింగారపు బాబు, జన్ను ప్రకాశ్, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. వరంగల్ పాత రామా టాకీస్‌నుంచి పాత బీట్ బజార్ మీదుగా వరంగల్ చౌరస్తా వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎండీ యాకూబ్ నాయకులు శంకర్, గొల్లపల్లి రమేష్ ,కోలా రాజ్ కుమార్, రమేష్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. వరంగల్ ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దరపు రమేష్ మాట్లాడారు. అదేవిధంగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, పండ్ల , కూరగాయాల మార్కెట్లలో సమ్మెలో వివిధ సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా

‘కార్పొరేట్’కు ఊడిగానికే 4 లేబర్ కోడ్‌లు