
అనధికారిక లేఔట్లపై కొరడా ఝుళిపించాలి
● మున్సిపల్ స్థలాలను పరిరక్షించాలి
● సమీక్షలో మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: నగరవ్యాప్తంగా ఉన్న అనధికారిక లేఔట్లను గుర్తించి కొరడా ఝుళించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బుధవారం వరంగల్ నర్సంపేట రోడ్డులోని స్తంభంపల్లి 467, 471 సర్వే నంబర్లలో అనధికారిక లేఔట్ హద్దులను బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. అనంతరం బల్దియా కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనధికారిక లేఔట్లు, ప్లాట్లను ప్రజలు కొనొద్దని, ప్రజల్లో చైతన్యం కల్గించడానికి టౌన్ ప్లానింగ్ విభాగం వివిధ సామాజిక మాధ్యమాలు కరపత్రాలు ఫ్లెక్సీల ద్వారా అవగాహన కలిగించాలన్నారు. మున్సిపాలిటీకి చెందిన ఓపెన్ ప్లాట్లు ప్రహరీ లేని మున్సిపల్ స్థలాలు పార్కులు, బల్దియాకు చెందిన ప్రాపర్టీలని సూచించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాకాలం వరదలను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు, ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ రవీందర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు శ్రీనివాస్‌రెడ్డి, రజిత, ఏర్షాద్, ప్రశాంత్, టీపీబీఎస్‌లు, టీపీఓలు తదితరులు పాల్గొన్నారు.