
● భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టండి ●
ఎస్‌ఎస్‌తాడ్వాయి:
మేడారంలో భక్తుల సౌకర్యార్థం శాశ్వత నిర్మాణాల కోసం రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ పక్కాగా ఉండాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ అన్నారు. గురువారం ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ గెస్ట్‌హౌస్ సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర టీఎస్, అడ్వయిజర్ గోవిందహరిలతో కలిసి ఆమె 2026లో నిర్వహించనున్న మహాజాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజారామయ్యర్ మాట్లాడుతూ మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల ఏర్పాటు కోసం స్టూడియో వన్ ఆర్కిటెక్ట్ డిజైనర్లు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలన, పూజారులు, అధికారులతో చర్చించేందుకు సమావేశ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పనుల మాస్టర్ ప్లాన్ నివేదికను కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి, పక్కా ప్రణాళికతో రూపొందించాలన్నారు. కోటిన్నరమంది భక్తులు హాజరయ్యే ఈ నాలుగు రోజుల మహాజాతరకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని, గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేష్, ఏపీఓ వసంతరావు, మేడారం ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు, అధికారులు పాల్గొన్నారు.
మాస్లర్‌ప్లాన్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలన..
మేడారంలో శాశ్వత నిర్మాణాలపై స్టూడియో వన్ అర్కిటెక్ట్ డిజైనర్ల బృందం రూపొందించిన మాస్ట ర్‌ప్లాన్‌పై ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎండోమెంట్ అడ్వయిజర్ గోవిందహరి, జిల్లా అధికారులతో కలిసి మేడారం పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జంపన్నవాగు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్ వైజంక్షన్ ప్రాంతాలను సందర్శించారు. ఈప్రాంతాల్లో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు అమెకు వివరించారు. గద్దెల విస్తీర్ణంపై పూజారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కమిటీ ఏర్పాటు చేసుకుని మార్పులు, చేర్పులపై వివరిస్తామని పూజారులు తెలిపారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని శైలజారామయ్యర్ సందర్శించి పరిశీలించారు. ముందుగా వారు సమ్మక్క– సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. శైలజారామయ్యర్‌కు జగ్గారావు బెల్లం ప్రసాదం అందజేశారు.