
స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు పూర్తి చేయండి
గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
భద్రకాళి బండ్ అభివృద్ధి పనుల పరిశీలన
వరంగల్ అర్బన్: స్మార్ట్‌సిటీ పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. శనివారం భద్రకాళి బండ్‌పై పూర్తయిన స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను, పెండింగ్ పనులను ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీలో భాగంగా భద్రకాళి బండ్‌పై ఏ, బీ, సీ, డీ జోన్ల వారీగా ఇప్పటికే పూర్తి చేసిన పనులను వాటి అంచనా వ్యయాలతో పాటు సమగ్ర వివరాలను కమిషనర్ ఇంజనీరింగ్ స్మార్ట్‌సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొంది వాగు నుంచి వచ్చే నాలతోపాటు పోతన జంక్షన్ ప్రాంతం నుంచి వచ్చే 12 మోరీల నాలలను కమిషనర్ పర్యవేక్షించారు. ఆయా జోన్లలో మిగిలిన ఎలక్ట్రికల్, సివిల్ పనులకు సంబంధించి కమిషనర్ పలు సూచనలిచ్చారు. మిగతా చిన్న చిన్న పనులు పూర్తి చేయాలి. స్కీంలో పెట్టుకునేందుకు అవకావం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఈఈలు శ్రీనివాస్, రవికుమార్, స్మార్ట్ సిటీ ప్రతినిధులు ఆనంద్ ఓలేటి, శ్రీనివాసరాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు స్ట్రీట్ వెండర్స్ ఫుడ్ ఫెస్టివల్
వరంగల్ బల్దియా మెప్మా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు స్థానిక స్ట్రీట్ వెండర్ల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. భద్రకాళీ బండ్, హంటర్ రోడ్డు, హనుమకొండలలో ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుందని, నగర ప్రజలు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు.