మౌలిక వసతుల సంగతేంటి? | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల సంగతేంటి?

Apr 8 2025 11:09 AM | Updated on Apr 8 2025 11:09 AM

మౌలిక వసతుల సంగతేంటి?

మౌలిక వసతుల సంగతేంటి?

వరంగల్‌ అర్బన్‌: ‘కాలనీల్లో చాలా సమస్యలున్నాయి. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. దోమలు విజృంభిస్తున్నాయి. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. భవన నిర్మాణాల అతిక్రమణలు, అనధికారిక కట్టడాలు, డ్రెయినేజీలు, సీసీ రోడ్లు తదితర మౌలిక వసతుల సంగతేంటి’ అని సోమవారం బల్దియా కార్యాలయంలో నిర్వహించిన గ్రేటర్‌ గ్రీవెన్స్‌లో ప్రజలు కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడేను ప్రశ్నించారు. మహా నగరంలోని పలు కాలనీల ప్రజలు సమస్యలపై గ్రేటర్‌ గ్రీవెన్స్‌లో గళమెత్తారు. గతంలో ఎన్నడూ రాని విధంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రజలు బారులుదీరడంతో కార్యాలయం ఆవరణంతా కిటకిటలాడింది. పలుమార్లు వినతులు ఇచ్చినా ఇంత వరకు సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని వాపోయారు. ట్రైసిటీతోపాటు శివారు ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్‌ హాల్‌లో గ్రీవెన్‌ సెల్‌కు 120 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో టౌన్‌ ప్లానింగ్‌కు అత్యధికంగా 60 వినతులు అందాయి. అంటే ఆ విభాగాధికారుల పనితీరు ఎలా ఉందో స్పష్టమవుతోంది. మౌలిక వసతుల కోసం ఇంజినీరింగ్‌ సెక్షన్‌కు 32, ప్రజారోగానికి 3, పన్నుల విధింపులో తేడాలు, ఫిర్యాదులపై 17, తాగునీటి సరఫరా కోసం 6 వినతులు అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలని బల్దియా కమిషనర్‌ డాక్టర్‌ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ప్రవీణ్‌ చంద్ర, డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, హెచ్‌ఓలు రమేశ్‌, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● హనుమకొండ రాజాజీనగర్‌ నుంచి డబ్బాల వరకు చేపట్టిన సీసీ రోడ్డు పనుల్లో అక్రమాల తొలగింపులో అవకతవకలు జరిగాయని చర్యలు తీసుకోవాలని కాలనీ సొసైటీ ప్రతినిధులు కోరారు.

● వరంగల్‌ విశ్వకర్మ వీధిలో 9–10–168 రోడ్డుపై ర్యాంపు నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

● గిర్మాజీపేట 8–7–67 రోడ్డు సెట్‌ బ్యాక్‌ లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

● హంటర్‌ రోడ్డు గాయత్రి దేవాలయం వద్ద భద్రకాళి ట్యాంక్‌ బండ్‌కు వెళ్లే రోడ్డుపై ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారని కాలనీలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని కాలనీవాసులు మూడుసార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

● హనుమకొండ అలంకార్‌ జంక్షన్‌లో సర్‌ అలామా ఇక్బాల్‌ స్మారకార్థం విగ్రహం నిర్మించాలని బీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు నయీమొద్దీన్‌ కోరారు.

● హంటర్‌ రోడ్డు దుర్గా కాలనీ త్రివీ స్కూల్‌ ఎదురుగా పార్కు స్థలాన్ని 14 ప్లాట్లు చేసి విక్రయించారని చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించారు.

● మడికొండ వెస్ట్‌ సిటీ చిల్డ్రన్స్‌ పార్కులో ఓపెన్‌ జిమ్‌, ఇతర పరికరాలు ఏర్పాటు చేయాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు.

● వరంగల్‌ 35వ డివిజన్‌ పుప్పాలగుట్టలో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీలను పూర్తి చేయాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

● హంటర్‌ రోడ్డు జేఎస్‌ఎం స్కూల్‌ నుంచి బ్లూ డైమాండ్‌ బార్‌ వరకు డ్రెయినేజీ సదుపాయం లేదని నిర్మించాలని దివాన్‌ చంద్రకాంత్‌ విన్నవించారు.

● మడికొండలో ఇళ్ల నడుమ స్క్రాప్‌ దుకాణాలు, వెల్డింగ్‌ పనులు చేస్తూ కాలనీవాసులకు అసౌకర్యానికి గురిచేస్తున్నారని చర్యలు తీసుకోవాలని పలుమార్లు కోరినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు.

● 31వ డివిజన్‌ న్యూశాయంపేట డాక్టర్స్‌ కాలనీలో తాగునీటి పైపులైన్లు నిర్మించాలని కాలనీవాసులు కోరారు.

● భీమారం సదానంద కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

● ఉర్సుగుట్టలో నా సొంత స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేస్తే తన పెంట్‌ హౌజ్‌ను కూల్చేస్తామని బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నోటీసు జారీ చేశారని, 16 సార్లు ఫిర్యాదు చేసినట్లు ఎం.సంధ్య ఫిర్యాదు చేశారు.

● న్యూ శాయంపేట 31వ డివిజన్‌ నుంచి రైల్వే గేట్‌ భట్టుపల్లి మీదుగా సీసీ రోడ్డు నిర్మించాలని పలు కాలనీల ప్రజలు గ్రీవెన్స్‌లో విన్నవించారు.

గ్రేటర్‌ గ్రీవెన్స్‌లో కమిషనర్‌ను

ప్రశ్నించిన నగరవాసులు

సగానికిపైగా ఆక్రమణలు,

అతిక్రమణలపై ఫిర్యాదులు

వెల్లువెత్తిన ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement