గుంటూరులో విధ్వంసం సృష్టించిన దుండగులు
అర్ధరాత్రి దుకాణాలు, ఇంటిపై దాడి పొక్లయిన్‌తో దుకాణాలు, ఇల్లు కూల్చివేసే ప్రయత్నం అడ్డువచ్చిన యువతిపై హత్యాయత్నం పోలీసుల రాకతో పరారైన దుండగులు
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని జేకేసీ కళాశాల రోడ్డులో గురువారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించారు. దుకాణాలతో పాటు ఇంటిని కూల్చేందుకు పొక్లయినర్‌తో వచ్చి దాడులకు తెగబడ్డారు. అడ్డుకోబోయిన యువతిపై హత్యాయత్నం చేశారు. జేకేసీ కళాశాల రోడ్డులోని కృష్ణా పౌల్ట్రీ ఫారం (చికెన్ షాప్)తో పాటు పక్కనే ఉన్న పాత ఇనుప సామాన్ల దుకాణం, అక్కడే పైఅంతస్తులో ఉన్న ఇంటిపై 30 మంది మూకుమ్మడిగా దాడి చేశారు. పొక్లయిన్‌తో వచ్చిన దుండగులు చికెన్‌షాప్ గ్రిల్ పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. కోడిగుడ్లతో ఉన్న 150 ట్రేలను విసిరిపారేసి, కౌంటర్‌లోని రూ.19వేల నగదు దొంగిలించారు. షాపులోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న పాత ఇనుప సామాన్ల కొట్టులోకి ప్రవేశించి, పై అంతస్తులోని ఇంట్లో నివసిస్తున్న దుకాణ యజమాని వెంకటేశ్వరరావు కుటుంబంపై దాడి చేశారు. ఇంటిలో ఉన్న రూ.1.50 లక్షల నగదును అపహరించారు. హఠాత్తుగా జరిగిన దాడికి భయకంపితులైన దుకాణదారుని కుటుంబం అరుపులు, కేకలు వేశారు. తలుపులపై విచ్చలవిడిగా కొడుతున్న వారిని వారించేందుకు ప్రయత్నించిన యువతి మీనాక్షి తలపై రాడ్డుతో దాడి చేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వచ్చిన పోలీసులను చూసిన దుండగులు పొక్లయినర్‌తో పాటు దానిని తెచ్చిన లారీని అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధితులు పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా అర్ధరాత్రి దాడి సమయంలో ఒక మహిళతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు శుక్రవారం వారిని విడిచిపెట్టినట్లు తెలిసింది. దాడి జరిపిన వ్యక్తులు ఎవరో తమకు తెలియదని, దాడికి ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని బాధితులు వాపోతున్నారు.


