
ఆక్రమణలోని ప్రభుత్వ భూములను గుర్తించాలి
గుంటూరు వెస్ట్: ఆక్రమణలలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారుల సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే నంబర్లవారీగా ఆక్రమణలు గుర్తించాలన్నారు. వాటి జాబితా రూపొందించాలని పేర్కొన్నారు. రెవెన్యూ, సర్వే శాఖల సిబ్బంది బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టాలని ఆదేశించారు. కోర్టు కేసులు ఉన్న స్థలాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు కోర్టు కేసులను పరిశీలించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీల పట్ల స్పష్టమైన విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలను సైతం సిద్ధం చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో పూర్తి సహకారం అందించాలన్నారు. ఎరువుల పంపిణీపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, ఆర్డీఓ శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్లు గంగ రాజు, విజయలక్ష్మి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఎస్‌ఆర్ శంకరన్ సేవలు స్ఫూర్తిదాయకం
తొలి తరం ఐఏఎస్ అధికారిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్‌ఆర్ శంకరన్ సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా కొనియాడారు. ఎస్‌ఆర్ శంకరన్ జయంతి వేడుకలను స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి అధికారులు, సిబ్బంది తదితరులు ఎస్‌ఆర్‌శంకరన్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శంకరన్ వ్యక్తిత్వం, సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కీర్తించారు.
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా