
పట్టుకోండి చూద్దాం
● పోలీసులకే సవాల్ విసురుతున్న మన్నవ సర్పంచిపై హత్యాయత్నం కేసు ● నిందితులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం ● జిల్లా టీడీపీ కార్యాలయంలో నిందితుల ప్రెస్‌మీట్ ● ప్రభుత్వ తీరుపై వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మండిపాటు
సాక్షి టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వం మనది.. అధికారం మనది.. ఏం చేసినా అడిగే వారుండరు.. ఎవరైనా అడిగితే మన బాస్ చూసుకుంటారులే.. ఇదీ ప్రస్తుతం టీడీపీ నాయకుల ఆలోచన తీరు. ఎంతటి ఘోరం చేసినా, నేరం చేసినా మనల్నెవడ్రా ఆపేది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పొన్నూరు టీడీపీ నాయకులు. హత్యాయత్నం కేసులో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు టీడీపీ నాయకులు ఏకంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చూసీచూడననట్లుగా ఉండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి పాలనలో ఎంతటి నేరం చేసిన వారైనా.. హత్యాయత్నం కేసులో ఉన్న ఏ4, ఏ5 నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నా పట్టించుకోకపోవడం పట్ల పోలీసులు టీడీపీకి కొమ్ముకాస్తున్నట్లు స్పష్టమవుతోందని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. ఏకంగా టీడీపీ కార్యాలయంలోనే పార్టీ ప్రతినిధులుగా నిందితులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. చిన్న చిన్న నేరాల్లో ఉన్న వారి కోసం వెతుకులాడే పోలీసులు అత్యంత ఘోరంగా దాడి చేసి హత్నాయత్నానికి పాల్పడిన వారిపట్ల ఉదాసీన వైఖరి ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు. ఈ నెల 3వ తేదీన గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని మన్నవ దళిత సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏ4, ఏ5లుగా ఉన్న బండ్లమూడి చింపిరయ్య, బండ్లమూడి బాబూరావులను టీడీపీ జిల్లా కార్యాలయంలో కూర్చొపెట్టి ప్రెస్ మీట్ పెట్టించడం చూస్తుంటే.... కూటమి ప్రభుత్వం ఏ విధంగా వారికి కొమ్ముకాస్తుందో అర్థమవుతోందని అన్నారు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలౌతుందో చెప్పడానికి, ఈ ప్రెస్ మీటే ఒక ఉదాహరణ అని దుయ్యబట్టారు. ఈ జిల్లాలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. పోలీసులంటే నిందితులకు లెక్క లేదా అని నిలదీశారు. హత్యాయత్నం కేసులో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏ1 గా చేర్చాలని, రెండు రోజుల క్రితం వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్పీని కలిసి ఇచ్చిన ఫిర్యాదు చేసినప్పటికీ ఏ4,ఏ5 నిందితులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, తమ ఎమ్మెల్యేకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. నిందితులు దర్జాగా తిరుగుతూ, మా టార్గెట్‌లో ఇంకా కొంతమంది ఉన్నారని, వారిని చంపేస్తామని హెచ్చరించడం చూస్తుంటే ప్రభుత్వం ఏ స్థాయిలో అండగా ఉందో తెలుస్తుందని మురళీకృష్ణ అన్నారు. నాగమల్లేశ్వరరావుపై కట్టుకథలు అల్లి, అతని క్యారెక్టర్ దిగజార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. బండ్లమూడి బాబూరావు దౌర్జన్యాలు,అక్రమాలు ఆధారాలతో త్వరలో తెలియజేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితులకు న్యాయం చేస్తామని మురళీకృష్ణ పేర్కొన్నారు.

పట్టుకోండి చూద్దాం