
గుంటూరు
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025
చీరాల: తీరం వద్ద ఘోరం జరిగింది. వాడరేవు సాగర తీరంలో స్నేహితులందరూ సరదాగా సేద తీరేందుకు ఉత్సాహంగా నవ్వుతూ, కేరింతలు కొడుతూ కారులో వచ్చారు. సాయంత్రం వరకు సరదాగా గడిపారు. తిరిగి ఏమైనా అల్పాహారం తినేందుకు చీరాల వస్తున్న వారి కారు టైరు పేలిపోవడంతో అదుపు తప్పిన ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా ఏమైందో తెలియదు. ప్రమాదం నుంచి తేరుకుని ఏమైందో తెలుసుకునే సరికి అప్పటి వరకు సరదాగా గడిపిన స్నేహితులు రక్తగాయాలతో చెల్లాచెదురుగా పడిపోయారు. హహాకారాలు, రోదనలతో వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు అంబులెన్స్‌లో క్షతగాత్రులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలంలో ఇద్దరు మృతిచెందగా మరొకరు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందారు. క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...చీరాల మండలం వాడరేవు–పిడుగురాళ్ల 167ఎ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నల్లపాడులోని ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కాలేజికి చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ఇన్నోవా కారులో గుంటూరు నుంచి చీరాల మండలం వాడరేవు బీచ్‌కు వచ్చారు. సాయంత్రం వరకు సరదాగా గడిపిన వీరు తిరిగి అల్పాహారం తీసుకునేందుకు చీరాల వస్తున్నారు. జాతీయ రహదారిపై వాడరేవు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు యూటర్న్ తీసుకునే క్రమంలో అదుపు తప్పి ఫల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన రోహిత్ నాయక్ (19), అజయ్ (18) సంఘటనా స్థలంలో మృతిచెందారు. స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కార్తీక్ (24) మృతిచెందాడు. మరో ఐదుగురు యవకులకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ ఎండి మోయిన్, రూరల్ ఎస్సై చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. అనంతరం ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చీరాల వచ్చిన వారిలో ఒకరిది తెనాలి కాగా మిగిలిన వారందరు గుంటూరుకు చెందిన వారే. గుంటూరుకు చెందిన వారిలో ముగ్గురు మృతిచెందారు. మృతుల కుటుంబ సభ్యులకు స్నేహితులు సమాచారం అందించారు. ప్రమాద ఘటనపై రూరల్ సీఐ శేషగిరిరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం నింపిన
విహారయాత్ర...
సరదాగా గడిపేందుకు స్నేహితులుతో విహార యాత్రకు వచ్చిన వారికి తీరని విషాదం మిగిలింది. అందరూ చిన్న వయస్సు వారే. పాలిటెక్నిక్ సీనియర్లు, జూనియర్లు అందరూ కలిసి సరదాగా గడుపుదామని కారులో చీరాల వాడరేవు బీచ్‌కు వచ్చారు. గుంటూరు నుంచి బాపట్ల వచ్చి అనంతరం చీరాల వచ్చారు. మధ్యాహ్నం తర్వాత చీరాల వచ్చిన వీరు సాయంత్రం వరకు బీచ్‌లో ఆనందంగా గడిపారు. ఇంటికి వెళ్లే క్రమంలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. కారు యూటర్న్ తీసుకునే క్రమంలో అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో రెప్పపాటులో స్నేహితులు విగతజీవులయ్యారు. కళ్లముందే స్నేహితులు రక్తపుమడుగులో ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తీవ్రగాయాలైన వారు రోదనలతో వైద్యశాల నిండిపోయింది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు గుండెలవిసేలా రోధిస్తున్నారు. అందరూ చిన్న వయస్సు వారు. తల్లిదండ్రులకు చేదోడువాదుడుగా ఉంటారని అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.
న్యూస్‌రీల్
టైరు పేలి పల్టీ కొట్టిన కారు గుంటూరు నుంచి వాడరేవుకు కారులో వచ్చిన 9 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు సంఘటనా స్థలంలో ఇద్దరు, వైద్యశాలలో ఒకరు మృతి క్షతగాత్రులకు ఏరియా వైద్యశాలలో చికిత్స

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు