
ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో కొలువై ఉన్న ఆదిదంపతుల దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. మరో వైపున తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద జరిగిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమం, గణపతి హోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ చేశారు. అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఘాట్‌రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. సర్వ దర్శనం, రూ.100, రూ. 300, రూ.500 టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానంతనం భక్తులకు దేవస్థానం ఉచిత ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలను అందించింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించడానికి అరగంట అన్ని దర్శనాలు నిలిపివేశారు. వీఐపీలు, సిఫార్సులపై వచ్చే భక్తులకు సైతం క్యూలైన్‌లోనే దర్శనానికి అనుమతించారు. సాయంత్రం అమ్మవారికి జరిగిన పంచహారతుల సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి