
ఫ్లోరోసిస్ భూతంపై యుద్ధం
గుంటూరు మెడికల్: వయస్సుతో సంబంధం లేకుండా నేడు పలువురు ఫ్లోరోసిస్‌తో అనారోగ్యానికి గురవుతున్నారు. సమస్యను నియంత్రణలో పెట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా జిల్లావ్యాప్తంగా వైద్య పరీక్షలు చేయిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక సిబ్బందితో వైద్య పరీక్షలు చేయిస్తోంది. మందులు కూడా ఉచితంగా అందజేస్తోంది. ఫ్లోరోసిస్ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను పూర్తిగా కట్టడి చేయవచ్చు. ఫ్లోరోసిస్ మహమ్మారిని కట్టడి చేయడమే ధ్యేయంగా జరుగుతున్న స్క్రీనింగ్ పరీక్షలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని, వ్యాధి బారిన పడకుండా మందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచి స్తున్నారు.
2013లో నివారణ కార్యక్రమం ప్రారంభం
ఫ్లోరోసిస్ బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫ్లోరోసిస్ నియంత్రణ, నివారణ కార్యక్రమాన్ని 2013లో ప్రారంభించింది. గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమం 2014 జూన్ నుండి అమల్లోకి వచ్చింది. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో 2014 నుంచి నేటి వరకు వైద్య సిబ్బంది పరీక్షలు చేసి బాధితులను గుర్తిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్ధులకు వైద్య పరీక్షలు చేసి దంత ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ చేశారు.
● ఫ్లోరైడ్‌తో కలుషితమైన నీటిని
తీసుకోకూడదు.
● అధికంగా ఉన్న ప్రదేశాల్లో పండిన కూరగాయలు, పాలు, టీ, మాంస ఉత్పత్తులు తీసుకోకూడదు.
● బ్లాక్ టీ, సుపారి, రాక్ సాల్ట్, పాన్‌పరాగ్, పొగాకు వాడకూడదు.
● ఫ్లోరైడ్ కల్గిన టూత్ పేస్టులు, మౌత్‌వాష్
వాడరాదు.
● అల్యూమినియం పాత్రలను వంట
చేసేందుకు వాడకూడదు.
● రక్షిత మంచినీటిని తాగాలి.
● పాలు, పెరుగు, జున్ను, బెల్లం, పచ్చటి ఆకుకూరలు,జీలకర్ర, మునగకాడలు, ఉసిరి, జామ, నిమ్మ, నారింజ, టమాటా, పప్పు ధాన్యాలు, చిరుదాన్యాలు, ఆకుకూరలు, వెల్లుల్లి, అల్లం, ఉల్లి తీసుకోవాలి.
● క్యారెట్, బొప్పాయి, చిలకడ దుంపలు ఫ్లోరోసిస్ నివారణ, నియంత్రణకు
దోహదపడతాయి
జిల్లావ్యాప్తంగా ఉచితంగా వైద్య పరీక్షలు ఏడాదిలో 490 గ్రామాల్లో సర్వేతో బాధితుల గుర్తింపు 825 పాఠశాలల్లో స్క్రీనింగ్ పరీక్షలు ఫ్లోరోసిస్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యుల సూచన
490 గ్రామాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 490 గ్రామాల ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధిబారిన పడి, అవస్థలు పడుతున్నారు.
జిల్లాలోని నూజెండ్ల, వినుకొండ, ఏనుగుపాలెం, కొచ్చర్ల, రెడ్డిపాలెం, రొంపిచర్ల, బొల్లాపల్లి, శావల్యాపురం, ఈపూరు, కోటప్పకొండ, అత్తలూరు, 75 త్యాళ్లూరు, క్రోసూరు, అచ్చంపేట, రాజుపాలెం, చండ్రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అత్యధిక సంఖ్యలో బాధితులు ఉన్నారు.
జిల్లాలో ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు 81 గ్రామాలు, పల్నాడు జిల్లాలో 409 గ్రామాలు కలిపి మొత్తం 490 గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించారు.
19,682 ఇళ్లను సర్వే చేశారు. 47,854 మందికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 2,370 మంది అనుమానిత డెంటల్ ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడినట్లు నిర్ధారించారు.
మెరుగైన వైద్య పరీక్షలు చేసి 509 మంది ఫ్లోరోసిస్ బారిన పడినట్లు తేల్చారు.
ఉమ్మడి గుంటూరుజిల్లా వ్యాప్తంగా 825 పాఠశాలల్లో 24,612 మంది విద్యార్థులను పరీక్షించారు. ఇందులో 1,783 మంది అనుమానిత దంత ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్య పరీక్షలు చేసి 974 మంది విద్యార్థులు ఫ్లోరిసిస్ బారిన పడినట్లు నిర్ధారించారు.
ఫ్లోరోసిస్ రాకుండా జాగ్రత్తలు ఇవి

ఫ్లోరోసిస్ భూతంపై యుద్ధం