
గుంటూరులో కార్డన్ సెర్చ్
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న రామిరెడ్డితోటలో మంగళవారం ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. రామిరెడ్డితోట ప్రాంతాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది 80 మంది కలసి జల్లెడపట్టారు. నేరస్తుల కదలిక, అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక పనులను నిరోధించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్‌లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని, స్టేషన్‌కు తరలించారు. మొబైల్ సెక్యూటీ చెక్ డివైజెస్ ద్వారా పలువురు అనుమానితుల వేలిముద్రలు సేకరించారు. అందులో విజయనగరానికి చెందిన ఒక సెల్‌ఫోన్ దొంగ పట్టుపడ్డాడు. అతనిని స్టేషన్‌కు తరలించారు. రౌడీషీటర్‌లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒక రౌడీషీటర్ జైలులో ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిరోధించేందుకు లాడ్జిలు, రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామన్నారు. పోలీసు గస్తీని ముమ్మరం చేసి, సీసీ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరిగే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గుంటూరు నగరంలోని అరండల్‌పేట, లాలాపేట, నగరంపాలెం, కొత్తపేట పోలీసుస్టేషన్‌ల పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించగా, తెనాలి, తుళ్లూరు, నార్త్, సౌత్ పోలీసు సబ్ డివిజన్‌ల పరిధిలో ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వాహనాలకు సంబంధించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకొచ్చిన వారికి వాహనాలు తిరిగి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొత్తపేట, లాలాపేట, పాతగుంటూరు సీఐలు వీరయ్య చౌదరి, శివప్రసాద్, వై.వీరసోమయ్య, ఎస్‌ఐలు రెహమాన్, ప్రసాద్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
రామిరెడ్డితోట ప్రాంతంలో జల్లెడ పట్టిన పోలీసులు స్వయంగా హాజరైన ఎస్పీ సతీష్‌కుమార్ 80 మంది సిబ్బంది, అధికారులు హాజరు 64 వాహనాలు స్వాధీనం అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు