
కార్డులు జారీ చేయకుండా ‘సుఖీభవ’ ఎలా?
లక్ష్మీపురం: గుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏలా అమలు చేస్తారని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రశ్నించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కౌలురైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని చెప్పటం నమ్మదగ్గ విషయం కాదన్నారు. గత సంవత్సరం జారీ చేసిన గుర్తింపు కార్డులకు కాల పరిమితి ముగిసిందనీ, ఈ ఏడాది కొత్తగా కౌలుగుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంజుల రెడ్డి, పీవీ జగన్నాథం మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ మాట్లాడుతూ అప్పుల బాధతో చనిపోయిన కౌలురైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్‌తేజకు వినతిపత్రం అందజేశారు. కౌలు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారిని ఆదుకోవడానికి అన్ని చర్యలు చేపడతామని జిల్లా జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, నగర అధ్యక్షుడు రావుల అంజిబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు కంచుమాటి అజయ్, కౌలురైతుల సంఘం నాయకులు బి.రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.
కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా.. జేసీకి వినతిపత్రం