
ప్రజల ఫిర్యాదులకు తక్షణం స్పందించాలి
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. బాధితుల నుంచి అర్జీలను జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ స్వీకరించారు. ఫిర్యాదిదారుల మొరను అలకించారు. జిల్లాలోని ఆయా సబ్ డివిజన్లలోని పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడారు. డీపీఓలో ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించాలని సూచించారు. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే సంబంధిత బాధితులకు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీలు జి.వి. రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), శివాజీరాజు (సీసీఎస్) కూడా ఫిర్యాదులు స్వీకరించారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ బెదిరింపులు
ఈ ఏడాది మార్చిలో ఆక్షన్ ద్వారా ఆర్.అగ్రహారంలోని 150 చదరపు గజాల స్థలాన్ని రూ.32.52 లక్షలకు కొనుగోలు చేశా. గత నెలలో గుంటూరు కార్యాలయంలో రిజిస్టర్ చేశారు. అయితే, గతంలో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైనాన్స్ సంస్థ వద్ద అప్పు తీసుకుని డీఫాల్టర్ అయ్యారు. వారిద్దరి మధ్య లావాదేవీలు ముగిశాకనే ఆస్తిని కొనుగోలు చేశాం. ఇంటిని పునః నిర్మించాలనే ఉద్దేశంతో వెళితే కానిస్టేబుల్, అతని భార్య ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లో ఉండేందుకు వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. తమపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరిస్తున్నారు. కానిస్టేబుల్‌తోపాటు ఇంటికి ఎదురుగా ఉంటున్న ఓ ఇద్దరు కూడా వారికి మద్దతుగా ఉంటున్నారు. కానిస్టేబుల్‌ను పిలిచి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకుంటున్నా.
– ఓ మహిళ, చర్లగుడిపాడు గ్రామం, గురజాల మండలం, పల్నాడు జిల్లా
భార్య దౌర్జన్యం
చిన్నతనంలోనే పోలియో సోకింది. నడిచేందుకు కష్టపడాలి. ఓ ప్రైవేటు ఆయిల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నా. 2018లో ఓ మహిళను ప్రేమ పెళ్లి చేసుకున్నా. ఐదేళ్లు బాబు ఉన్నాడు. కొన్నాళ్లు కాపురం సజావుగా జరిగింది. 2023 నవంబర్‌లో కుమారుడ్ని తీసుకుని భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసిన ఆచూకీ తెలియలేదు. ఇటీవల ఆమె గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలో ఉంటోందని తెలిసింది. దీంతో అక్కడికెళ్తే నాపై భార్యతోపాటు పలువురు దాడికి పాల్పడ్డారు. బంధువులతో చంపేందుకు కుట్ర ప్రయత్నాలు చేసింది. అయితే, వారి నుంచి తప్పించుకుని బయటపడ్డాను. భార్య, దాడికి పాల్పడిన వారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. న్యాయం జరగలేదు. ఐదేళ్ల కుమారుడు జీవించి ఉన్నాడా.. లేదా తెలియడం లేదు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు రూ.16 లక్షలు, లక్షలు ఖరీదు చేసే బంగారం, వెండి వస్తువులు, ఇంటి పత్రాలతో ఉడాయించింది. ప్రస్తుతం దివ్యాంగ ఫించన్ సైతం నిలిపివేశారు. బతికేందుకు కష్టంగా ఉంది. న్యాయం చేయగలరు.
– సీహెచ్.మహేంద్ర, రామకృష్ణనగర్, వైఎస్‌ఆర్ కడప జిల్లా.
పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆదేశం పీజీఆర్‌ఎస్‌లో బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ

ప్రజల ఫిర్యాదులకు తక్షణం స్పందించాలి