
ఘనంగా బగళాముఖి జయంతి పూజలు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారి జయంతి పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలోని 108 కళాశాలలో మహిళలు సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చి సామూహిక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి నిజరూప బగళాముఖి అలంకారం చేసి, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు సమర్పించిన స్వర్ణవర్ణపు సింహం విగ్రహాలను అమ్మవారి విగ్రహం ముందు ఇరువైపులా ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీక్షీరభావన్నారాయణస్వామి
బాపట్ల: శ్రీక్షీరభావన్నారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభ వాహనంపై స్వామి ఊరేగింపు జరిగింది. నవాహ్నిక దీక్ష పూర్వక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఊరేగింపు చేపట్టారు. భక్తులు టెంకాయలుకొట్టి పూజలు చేశారు.
జీజీహెచ్ సిబ్బందికి మెమోలు
అడిషనల్ డీఎంఈ ఆకస్మిక తనిఖీలు
గుంటూరు జీజీహెచ్: గుంటూరు జీజీహెచ్‌లో సోమవారం అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత గతంలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఆషా సజనీపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించారు. అనంతరం ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్‌లో తనిఖీలు చేశారు. ఆపరేషన్ థియేటర్‌లో సక్రమంగా ఓటీ డ్రస్సులు ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వైద్య సిబ్బంది, వైద్యులకు మెమోలు జారీ చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను ఆదేశించారు. మార్చురీ విభాగంలో తనిఖీలు చేశారు. లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మనోజ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వహిస్తుండటంతో అతనిని అక్కడి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య విద్యార్థులకు మార్చురీ విభాగంలో క్లినికల్ తరగతులు నిర్వహించేందుకు వసతులు పరిశీలించారు. నాట్కో క్యాన్సర్ సెంటర్ విభాగంలో వైద్యులు, వైద్య అధికారులతో సమావేశం నిర్వహించి ఆసుపత్రి అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, నర్సింగ్ రిజిస్ట్రారు సుశీల తదితరులు ఉన్నారు.
చైల్డ్ హోమ్‌కు పసికందు
పొన్నూరు: మండలంలోని పచ్చల తాడిపర్రు గ్రామంలోని పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన పసికందుకు నిడుబ్రోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో సోమవారం మగ శిశువును వైద్యశాల డాక్టర్ ఫిరోజ్ ఖాన్ గుంటూరు చైల్డ్ హోమ్ నిర్వాహకులకు సీడీపీఓ వెంకట రమణ ఆధ్వర్యంలో అందజేశారు.
తిరుపతమ్మ ఆలయానికి ట్రాక్టర్ ట్రక్కు బహూకరణ
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయానికి సోమవారం గ్రామానికే చెందిన కర్ల భాస్కరరావు, పద్మావతి దంపతుల కుమారులు కర్ల రామకృష్ణారావు, వసుంధర దంపతులు, కర్ల శ్రీనివాసరావు, పద్మావతి దంపతులు రూ.2.50లక్షల విలువైన ట్రాక్టర్ ట్రక్కును బహూకరించారు. గతంలో వీరు ఆలయానికి రూ.10 లక్షల విలువైన ట్రాక్టర్‌ను కూడా అందించారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలతో సత్కరించారు.

ఘనంగా బగళాముఖి జయంతి పూజలు

ఘనంగా బగళాముఖి జయంతి పూజలు