
జానపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే
పిడుగురాళ్ల: జానపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే కోర్టును ఆశ్రయిస్తామని, నిర్మాణం చేపట్టే వరకు పోరాటాలు ఆగవని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్ర ప్రభుత్వం రూ. 52 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. గత ఎన్నికల ముందు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంత వరకు ప్రారంభించలేదని అన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని అధికార పార్టీకి అల్టిమెంట్ చేశామని, అయినా అధికార పార్టీ నాయకులు మొద్దు నిద్ర వీడలేదని విమర్శించారు. అందుకే జానపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం గత వైఎస్సార్ సీపీ హయాంలో మంజూరు చేసిన బ్రిడ్జిని ఎందుకు నిర్మించరూ, పూర్తి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయించినా, ఎందుకు నిర్మించటం లేదని కోర్టులో ఫిల్ దాఖలు చేయటం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు చేస్తాం, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు వంటివి చేపడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ చింతా వెంకట రామారావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యులు విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్, రాష్ట్ర మాజీ ఆర్టీఐ మాజీ కమిషనర్ రేపాల శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు వీరభద్రుని రామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చింతా సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కత్తెరపు వాసుదేవరెడ్డి, కాండ్రగుంట శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కాసు మహేష్‌రెడ్డి
గురజాల నియోజకవర్గ
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి