
అన్నయ్య అని పిలుస్తూనే వివాహేతర సంబంధం
అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య
తెనాలిరూరల్: కూలి పనులకు వెళ్లినప్పుడు పరిచయమైన వ్యక్తిని అందరి ముందు అన్నయ్య అని పిలుస్తూనే అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో పథకం ప్రకారం భర్తను హత్య చేయించింది. త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్ బాబు గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహాల్లోని ఆటో డ్రైవర్ గండికోట వెంకట మణి పృధ్విరాజ్ గత నెల 27 రాత్రి మల్లెపాడు ఎలగ్గుంట చెరువులో హత్యకు గురయ్యాడు. మృతుని తండ్రి అంకమ్మరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం బొల్లాపల్లికి చెందిన గోవిందు కోటేశ్వరరావు అలియాస్ కత్తి, మృతుడి భార్య గండికోట వెంకటలక్ష్మి అలియాస్ బుజ్జి, వెంగళాయపాలెంకు చెందిన గోవిందు ఉదయ కిరణ్, మరో 15 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. పృధ్విరాజ్‌కు ఐదేళ్ల కిందట వెంకటలక్ష్మితో వివాహమైంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో దంపతులిద్దరు తాపీ పని నిమిత్తం బెంగళూరు వెళ్లగా అక్కడ బొల్లాపల్లికి చెందిన గోవిందు కోటేశ్వరరావుతో వెంకటలక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకు అనుమానం రాకుండా కోటేశ్వరరావును అన్నయ్య అంటూ అందరి ముందు మాట్లాడేది. వెంకటలక్ష్మికి వివాహేతర సంబంధం ఉందని గమనించిన పృధ్వీరాజ్ భార్యను నిలదీశాడు. దీంతో అతనిని అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం గత నెల 27న కోటేశ్వరరావును తెనాలి పిలిపించింది. కోటేశ్వరరావు, అతని బాబాయి కొడుకు ఉదయ్ కిరణ్, మరో బాలుడు ముగ్గురు కలిసి పృధ్విరాజ్‌కు మద్యం తాగేందుకుకని ఫోన్ చేశారు. అతని ఆటోలోనే ముగ్గురు వెళ్లి మల్లెపాడులో మద్యం తాగారు. అనంతరం పృధ్విరాజ్‌పై కత్తి, రాళ్లతో దాడి చేసి హతమార్చి, అదే ఆటో తీసుకుని పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని గుర్తించిన అంకమ్మరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేయడంలో కానిస్టేబుళ్లు మురళి, బాబురావు, జయకర్ సహకరించినట్లు సీఐ వెల్లడించారు. హత్య కేసును త్వరితగతిన ఛేదించినందుకు జిల్లా ఎస్పీసతీష్‌కుమార్, డీఎస్పీ బి.జనార్ధనరావు తమను అభినందించినట్లు సీఐ తెలిపారు.