
పత్తి కట్టెల కింద నాగాభరణం
గుడిలో అపహరణకు గురై.. పొలంలో ప్రత్యక్షం
ప్రత్తిపాడు: గుడిలో అపహరణకు గురైన స్వామివారి నాగాభరణం.. పత్తి పొలంలో పత్తి కట్టెల కింద ప్రత్యక్షమయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 3వ తేదీన ప్రత్తిపాడు మండలం పెద గొట్టిపాడులోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. ఆలయ తలుపులకు వేసి ఉన్న ఇనుప కడ్డీలు వంచి గుడిలో ఉన్న నాలుగు కేజీల కాశీవిశ్వేశ్వరుని వెండి నాగాభరణంతో పాటు సుమారు నలభై గ్రాముల అమ్మవారి బంగారు తాళి బొట్టుతాడు, తాళిబొట్లు రెండు, ముక్కెర, బంగారు బొట్టు బిళ్ల, ఉత్సవమూర్తుల వెండి వస్తువులను దుండగులు అపహరించుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనూహ్యంగా గుడిలో చోరీకి గురైన నాగాభరణం ఓ పొలంలో దర్శనమిచ్చింది. గ్రామ శివారులోని ఓ పొలంలో గుట్టగా ఉన్న పత్తి కట్టెకు బుధవారం సాయంత్రం వ్యవసాయ పనుల్లో భాగంగా నిప్పు పెట్టారు. గురువారం ఉదయం రైతు పొలానికి వెళ్లి చూడగా పత్తి కట్టెల బూడిద మధ్య స్వామివారి నాగాభరణం కనిపించింది. షాక్‌కు గురైన రైతు విషయాన్ని గ్రామస్తులకు సమాచారమిచ్చారు. గ్రామస్తులు నాగాభరణాన్ని పరిశీలించి స్వామివారిదిగా గుర్తించి, ఆభరణాన్ని ఆలయానికి చేర్చారు. రెండు నెలల కిందట గుడిలో దొంగతనానికి పాల్పడిన ఆగంతకుడు నాగాభరణాన్ని దొంగిలించిన తరువాత పత్తి కట్టెల మధ్య దాచి ఉంచి పరారై ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.