గుంటూరు ఎడ్యుకేషన్: ఎంఈఓ–2 పోస్టులను ఎంఈఓ అకడమిక్‌గా మార్పు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎంఈఓ–2 సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీవీ రామకృష్ణ, రాయల సుబ్బారావు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజుతోపాటు విజయవాడలో సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె.రవీంద్రనాథ్‌రెడ్డిని వారి కార్యాలయాల్లో కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఎంఈఓ–1, 2 పోస్టుల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు ఆయా పోస్టులను భర్తీ చేసే సమయంలో అదే మండలంలో పని చేస్తున్న ఎంఈఓలకు ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. మండల పరిధిలో సీనియర్ ఎంఈఓకు డీడీఓ అధికారాలను అప్పగించడంతోపాటు సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులుగా ఎంఈఓ–2, గ్రేడ్–2 హెచ్‌ఎంలకు అవకాశం కల్పించాలన్నారు. అధికారులను కలిసిన వారిలో ఎంఈఓ–2లు అలీం, శంకర్‌రాజు, శ్రీనివాసరెడ్డి, జయంతి బాబు, నాగేంద్రమ్మ, లీలారాణి, జాకబ్, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.