ఇసుక అక్రమ తవ్వకాలపై కొరడా | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ తవ్వకాలపై కొరడా

May 21 2024 9:20 AM | Updated on May 21 2024 9:20 AM

ఇసుక అక్రమ తవ్వకాలపై కొరడా

ఇసుక అక్రమ తవ్వకాలపై కొరడా

తెనాలి: నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో ఇసుక తవ్వకాలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనలు మీరితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. ఆయన సోమవారం ఎస్పీ తుషార్‌ డూడీ, జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, తెనాలి సబ్‌కలెక్టర్‌ ప్రఖర్‌జైన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ (ట్రైనీ) పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌తో కలిసి కొల్లిపర మండలంలోని ఇసుక రీచ్‌లను తనిఖీ చేశారు. మండలంలోని బొమ్మువానిపాలెం 14, 15 ఇసుక రీచ్‌లు, మున్నంగిలోని ఇసుక రీచ్‌లను అధికారులు పరిశీలించారు. తాడేపల్లి మండలంలోని గుండెమెడ ఇసుక రీచ్‌నూ తనిఖీ చేశారు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో తవ్వకాలు జరపరాదని, అనుమతులు పొందిన ప్రాంతంలోనే మనుషులతో తవ్వకాలు జరపాలని ఆదేశించారు. మైనింగ్‌ శాఖ అధికారులతోపాటు పోలీస్‌, రెవిన్యూ, శాండ్‌ కమిటీలోని ఇతర శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. దీనికోసం రెండు షిఫ్టులుగా బృందాలను నియమించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నట్టు గుర్తించిన వెంటనే పోలీస్‌ అధికారులు కేసులు నమోదుచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు.

కలెక్టరేట్‌లో ఇసుక కమిటీతో సమావేశం

అంతకుముందు కలెక్టరేట్‌లోని ఏసీ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ, జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, తెనాలి సబ్‌కలెక్టర్‌ ప్రఖర్‌జైన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ (ట్రైనీ) పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ సమావేశమయ్యారు. జిల్లాస్థాయి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కమిటీ ఏర్పాటైందని, ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతివారం రీచ్‌లను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పారు. కమిటీలోని శాఖలు క్షేత్రస్థాయిలో అధికారులతో ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్‌ బృందాలను ఏర్పాటుచేయాలని సూచించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై జిల్లాస్థాయిలో కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 0863–2234301తోపాటు ఈ–మెయిల్‌ dismc2024@gmail.comకు కూడా ఫిర్యాదులను పంపవచ్చని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా, గుంటూరు రెవెన్యూ డివిజన్‌ అధికారి శ్రీకర్‌, తనిఖీల్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ కన్వీనర్‌, మైనింగ్‌ శాఖ డీడీ చంద్రశేఖర్‌, జిల్లా ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ ఎల్‌.రంగారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి, భూగర్భ జలవనరులశాఖ డెప్యూటీ డైరెక్టర్‌ వందనం, ఎన్విరాన్మెంట్‌ ఇంజినీరు నారాయణ, జిల్లా ఉప రవాణా కమిషనర్‌ కరీం, ఆర్‌డబ్ల్యుస్‌ ఈఈ కళ్యాణ చక్రవర్తి, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

తనిఖీలకు రెండు షిప్టులుగా బృందాలు అక్రమ తవ్వకాలు జరిగితే బాధ్యులపై కేసులు కొల్లిపర మండలంలో ఇసుక రీచ్‌లను తనిఖీ చేసిన కలెక్టర్‌, ఎస్పీ ఫిర్యాదులకు కంట్రోల్‌ రూం నంబర్‌ 0863–2234301

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement