
మూల్పూరు దళితవాడ సెంటరులో పోలీసు పికెట్ ఏర్పాటు చేసిన ఎస్‌ఐ సురేష్
అమర్తలూరు(వేమూరు): మూల్పూరు గ్రామానికి చెందిన గంటా సాయి, ఎల్లో సురేష్, ఆవుల సుబ్బయ్య, ఆవుల శివ కృష్ణ ఇతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఈ నెల 8వ తేదీన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రైతుల పరామర్శకు అమర్తలూరు మండలంలో కూచిపూడి గ్రామానికి రానుండగా.. మూల్పూరు గ్రామానికి చెందిన గంటా సాయి కూచిపూడి లాకుల సెంటర్‌లో ద్విచక్ర వాహనం, ట్రాక్టర్‌తో హల్‌చల్ చేయసాగాడు. అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకే చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు ఐమళ్ల మార్తమ్మ కుమారుడు ప్రమోద్ కుమార్ సెంటర్‌లో ట్రాక్టర్‌తో ఈ విధంగా చేయడం తగదని, హల్‌చల్ చేయవద్దని సాయికి సూచించాడు. దీంతో ఘంటా సాయి కాలితో ప్రమోద్‌ను తన్నాడు. దీంతో ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో గంటా సాయి, మరో పది మందితో కలిసి వచ్చి, గొడవ పెట్టుకున్నారు. కులం పేరుతో దూషిస్తూ ప్రమోద్‌ను ఇష్టానుసారంగా కొట్టారు. కాలువలో పడేసి చంపేందుకు యత్నించారు. దీంతో మువ్వ శ్రీను అడ్డుకొని ప్రమోద్ కుమార్‌ను బైక్‌పై ఎక్కించుకొని వెళుతుండగా, అడ్డం వచ్చి మళ్లీ కొడుతుండగా, అదే గ్రామానికి చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అడ్డుకున్నారు. ఆళ్లమూడి బసవయ్య, బి.కిషోర్, పాముల బాబురావు, నూతక్కి రమేష్‌లు ఎందుకు కొడుతున్నారని ప్రశ్నంచగా వారిపై కూడా దాడికి తెగించారు. శుక్రవారం రాత్రి 10 గంటకు మూల్పూరు గ్రామానికి చెందిన దళితులు సాయి తల్లిదండ్రుల ఇంటి వద్దకు వెళ్లి విషయం చెప్పారు. అయినప్పటికీ సాయి తల్లిదండ్రులు స్పందించ పోవడంతో రాత్రి 11 గంటల సమయంలో అమర్తలూరు పోలీసు స్టేషన్‌కు చేరుకుని గంటా సాయిపై ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. శనివారం రేపల్లె డీఎస్పీ, టి.మురళీ కృష్ణ, చుండూరు సీఐ మోహనరావు గ్రామంలోకి వచ్చి విచారించి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో శాంతి భద్రతల కోసం పోలీసు పికెట్ ఏర్పాటు చేశామని ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు మూల్పూరులో పోలీస్ ిపికెట్