
నరసరావుపేట ఈస్ట్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కలిగి ఉండాలని విక్టరీ డిగ్రీ కళాశాల డైరెక్టర్ మైనీడి శ్రీనివాసరావు తెలిపారు. కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పురుషుల ఖోఖో పోటీల్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడా స్ఫూర్తి అలవడిన విద్యార్థులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారని తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. కాగా వర్సిటీ పరిధిలోని కళాశాలల నుంచి ఎనిమిది జట్లు పోటీలో పాల్గొన్నాయి. నాకౌట్ కం లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీలో నరసరావుపేటకు చెందిన విక్టరీ, కృష్ణవేణి, వాగ్దేవి డిగ్రీ కళాశాలలతో పాటు ఇంకొల్లుకు చెందిన ఎస్‌డీసీ ఆర్‌ఎం డిగ్రీ కళాశాల లీగ్ దశకు చేరుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వి.సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ పి.వేణుగోపాల్, భవనా కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.కృష్ణంరాజు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ గౌరవాధ్యక్షుడిగా వెంకటరెడ్డి
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ) గౌరవాధ్యక్షుడిగా కె.వెంకటరెడ్డి (పమిడిమర్రు), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్.అబ్దుల్‌సత్తార్ (సంతగుడిపాడు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన యూనియన్ జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఈమేరకు ఎన్నుకున్నారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కె.శ్యామ్ మోజెస్ అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, అక్రమ సస్పెన్షన్‌లు రద్దు చేయాలని సమావేశంలో తీర్మానించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీవీఎస్ మణి, షేక్.ఖాజావలి, షేక్.రఫీ, జి.అనిల్, ఎస్.రవీంద్రబాబు పాల్గొన్నారు.
పరామర్శ పేరుతో బాబు రాజకీయ యాత్ర
పర్చూరు (చినగంజాం): మిచాంగ్ తుఫాన్ కారణంగా రైతులకు పరామర్శ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పర్యటనపై మాజీ ఎమ్మెల్యే, పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన రాజకీయ లబ్ధి కోసమే యాత్ర చేశారని ఎద్దేవా చేశారు. ఆదివారం పర్చూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబుకి వ్యవసాయంపై చిత్తశుద్ధి లేదన్నారు. ఇలాంటి విపత్తులు వస్తే తాను ఏం చేసేవాడో చెప్పకుండా అకారణంగా ప్రభుత్వంపై బురద జల్లడం మంచిది కాదన్నారు. ఒకే ప్రాంతంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే వరదలు రాకుండా ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ సామర్థ్యం 39 వేల క్యూసెక్కులు వర్షపు నీటి ప్రవాహం వచ్చిందని వివరించారు. ఇలాంటి సమయంలో ఎవరైనా ఏంచేయగలరని ప్రశ్నించారు. ఇది ప్రకృతి విపత్తు తప్ప మరేది కాదన్నారు. వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు ఏమైనా ఆకాశంలో కట్టలేశాడా అని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే అధిక పరిహారం చెల్లింపు..
చంద్రబాబు హయాంలో పంటల బీమా ఐదు సంవత్సరాలకు రూ.కోటి ఇస్తే జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.30 కోట్లు ఇచ్చిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులకు మూడు సంవత్సరాల తర్వాత నష్టపరిహారం చెల్లిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రెండు నెలల్లోనే పరిహారం అందించేటట్లు చర్యలు తీసుకుంటుందన్నారు. శవాలపై పేలాలు ఏరుకున్నట్లు తుఫాన్ రైతులను పరామర్శించకుండా చంద్రబాబు రాజకీయ ప్రసంగాలు చేశారని ఎద్దేవా చేశారు. పభుత్వం నుంచి తమకు నష్టం జరిగిందని చంద్రబాబుకి రైతులెవ్వరైనా ఫిర్యాదు చేశారా ? అని ప్రశ్నించారు.
రైతులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆమంచి ధ్వజం

ఖోఖో పోటీలను ప్రారంభిస్తున్న మైనీడి శ్రీనివాసరావు

నూతన కార్యవర్గ ప్రతినిధులను అభినందిస్తున్న యూనియన్ ప్రతినిధులు