
విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తున్న వీసీ ఆచార్య పి.రాజశేఖర్
ఏఎన్‌యూ: విద్యార్థులు చేసే నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన అకడమిక్ ఎగ్జిబిషన్‌లో ఉత్తమ ప్రదర్శనలు చేసిన ఏఎన్‌యూ ఇంజినీరింగ్ విద్యార్థులకు మంగళవారం నగదు బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ప్రసంగిస్తూ విద్యార్థుల్లో దాగిఉన్న మేధస్సు, నైపుణ్యాన్ని వెలికితీసి సమాజానికి అందించేందుకు యూనివర్సిటీ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అకడమిక్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు ఎంతో ఆలోచనాత్మకమైన నూతన ఆవిష్కరణలు చేశారని తెలిపారు. వారిని మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉత్తమ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలతో ముందుకొస్తే పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. నైపుణ్యం ఉన్న విద్యార్థులను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు వెలుగులోకి తేవాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ ప్రసంగిస్తూ అకడమిక్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు తమ నైపుణ్య ప్రదర్శనకు అంకితభావంతో కృషి చేశారన్నారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణలు ఇతర విద్యార్థులకు కూడా ఎంతో ప్రేరణను కలిగిస్తాయన్నారు. అకడమిక్ ఎగ్జిబిషన్ కో–ఆర్డినేటర్ ఆచార్య కె.మధుబాబు మాట్లాడుతూ విద్యార్థుల ప్రదర్శనలు సందర్శకులు, బయటి కళాశాలల విద్యార్థులను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సిద్దయ్య మాట్లాడుతూ విద్యార్థులు సమాజాభివృద్ధికి దోహదం చేసే ఎన్నో నూతన ఆవిష్కరణలు చేయడం అభినందనీయమని తెలిపారు. ఓఎస్‌డీ సునీత, పాలకమండలి సభ్యురాలు సరస్వతిరాజు అయ్యర్, ప్రిన్సిపాల్స్ స్వరూపరాణి, గంగాధరరావు, శ్రీనివాస రెడ్డి, ప్రమీలారాణి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డీన్ జాన్సన్, ఐఎస్‌సీ డైరెక్టర్ చెన్నారెడ్డి, అడ్మిషన్ల డైరెక్టర్ అనిత ప్రసంగించారు. నూతన ఆవిష్కరణలు చేసిన విద్యార్థులకు వీసీ నగదు బహుమతులు అందజేశారు. పలువురు అధికారులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.
ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ ఉత్తమ ఆవిష్కరణలకు బహుమతుల ప్రదానం