
మహత్తర పోషక విలువలకు చిరునామా రాగి.. తృణధాన్యాల్లోకెల్లా రారాజుగా నిలిచిన రాగితో చేసిన వంటలు ఆరోగ్యప్రదాతలు అని చెప్పడంలో సందేహం లేదు.. విద్యార్థులకు అదనపు శక్తి, ఆరోగ్యం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో నేటినుంచి రాగిజావను ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే విద్యార్థుల మెనూపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. వారికి పౌష్టికాహారం ఇస్తున్న ప్రభుత్వం, అదనపు శక్తి అందేందుకు, తద్వారా చదువుపై మరింత ఏకాగ్రత నిలిపేందుకు ఇకనుంచి ఈ బలవర్థక పానియాన్ని అందించనుంది.
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్న ప్రభుత్వం అందులో ఎప్పటికప్పుడు మార్పులను చేస్తూ మరింత బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తోంది. ఇకపై పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ముందుగా ప్రతి మంగళ, గురు, శనివారాల్లో రాగి (మాల్ట్) జావ అందించనున్నారు. సాదా, సీదాగా కడుపు నింపే ఆహార పదార్థాలకు బదులుగా బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా విద్యార్థులను చురుకుదనం, ఉత్సాహంతో కలగలసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనం మెనూలో రాగిజావను చేర్చారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు వ్యక్తిగత శ్రద్ధతో మధ్యాహ్న భోజన మెనూను రూపొందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు వారంలో మూడు రోజులపాటు రాగి మాల్ట్ (జావ) ఇచ్చేందుకు స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మంగళవారం విద్యార్థులకు రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
అదనపు శక్తి..
గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,094 పాఠశాలల్లో చదువుతున్న 1,19,922 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా రాగి జావ అందించనున్నారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని 17 మండలాల పరిధిలోని పాఠశాలలకు రాగి పిండి, బెల్లం సరఫరా చేశారు. వారంలో మూడు రోజుల పాటు పాఠశాలల్లోనే ప్రభుత్వం నిర్ధేశించిన పరిమాణంలో రాగి జావ తయారు చేసి విద్యార్థులకు అందించాల్సి ఉంది. ఫోర్టిఫైడ్ బియ్యం, కోడిగుడ్లు, చిక్కీలు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన బలవర్ధకమైన ఆహారాన్ని ప్రతి రోజూ తృప్తిగా ఆరగిస్తున్న విద్యార్థులకు అదనపు శక్తిని, ఉత్సాహాన్ని అందించేందుకు మహత్తరమైన పోషక విలువలు కలిగిన రాగ జావ సిద్ధమవుతోంది. బెల్లంతో కలిపి తయారు చేసే రాగిజావలో ఉన్న పోషక విలువలు శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు రక్తహీనతను నివారిస్తాయని వైద్యులు చెబుతున్నారు.