
తనిఖీలు నిర్వహిస్తున్న రవాణాశాఖ అధికారులు (ఫైల్)
● జిల్లా వ్యాప్తంగా 7760 వాహనాల గుర్తింపు.. రూ.185.74 కోట్ల బకాయిలు ● ఐదు త్రైమాసికాలు చెల్లించని వాహనాలపై ప్రత్యేక దృష్టి ● ఇప్పటికే నోటీసులు జారీ చేసిన రవాణా శాఖ ● తనిఖీలు మరింత ముమ్మరం చేస్తున్న ప్రత్యేక బృందాలు
పట్నంబజారు: జిల్లాలో పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై రవాణశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక బృందాలతో పేరుకుపోతున్న పన్నులు వసూలు చేసేందుకు విస్తృత తనిఖీలు నిర్వహించటంతో పాటు, వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపధ్యంలో స్పీడ్ మరింత పెంచారు.
మొత్తం 1,01,950 ట్రాన్స్‌పోర్టు వాహనాలు
జిల్లాలో మొత్తం 1,01,950 ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఉన్నాయి. వాటిలో 24,936 లారీలు, 1389 మ్యాక్సీ క్యాబ్‌లు, 6121 మెటార్ క్యాబ్‌లు, 16,179 ట్రాక్టర్లు, 28,390 ఆటోలు, 839 అంబులెన్స్‌లు, 2897 స్కూల్ బస్సుల తో పాటు ఇతరత్రా వాహనాలు కలుపుకొని మొత్తం లక్షకుపైగా ఉన్నాయి. ఈ క్రమంలో కాంట్రాక్ట్ వాహనాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి త్రైమాసిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దానిలో భాగంగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ 341.19కోట్లు రవాణాశాఖకు లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు రూ 220.41 కోట్లు వసూలయింది. త్రైమాసిక పన్నులకు సంబంధించి రూ 93.13 కోట్లు, లైఫ్ ట్యాక్స్ రూ.203.14 కోట్లు, ఫీజులు, లైన్స్‌లకు సంబంధించి రూ 27.67 కోట్లు, కేసుల నమోదులో రూ.9.12 కోట్లు వచ్చినట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. పన్నుల వసూళ్లలో 64.60శాతంతో జిల్లా రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో ఉండగా, కేసుల నమోదులో 133.78శాతంతో రెండో స్థానంలో నిలిచింది.
పన్నులు చెల్లించని వాహనాలు 7760..
జిల్లాలో పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న 7760 వాహనాలను అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి రూ.185.74 కోట్లు బకాయిలు వసూలు చేయాల్సి ఉంది. త్రైమాసికం ముగియక ముందే రానున్న నెలకు సంబంధించి సైతం ముందస్తుగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో చెల్లించాల్సిన వాహనాలు 559, రెండు త్రైమాసికాలు దాటినవి 33, మూడు త్రైమాసిక పన్నులు కట్టాల్సినవి 271, ఏడాదిపైగా కట్టనవి 393, ఐదు త్రైమాసికాలు దాటినా.. పన్నులు చెల్లించని వాహనాలు 5978 కలిసి మొత్తం 7760 వాహనాలు ఉన్నట్లు గుర్తించారు.
స్వయంగా చెల్లిస్తే 50శాతంతో సరి..
త్రైమాసిక పన్నులకు సంబంధించి చెల్లించాల్సిన వారు స్వయంగా చెల్లిస్తే పన్నుతో పాటు 50శాతం జరిమానాతో సరిపోతుంది. అధికారుల తనిఖీల్లో పట్టుబడితే మాత్రం పన్నుతో పాటు 200శాతం అధికంగా జరిమానా విధించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పన్నులు చెల్లించాల్సిన 7760 వాహన యజమానులకు నోటీసులు జారీ చేసిన అధికారులు, పన్నులు వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేకంగా కొంత మందిని ఏర్పాటు చేసి ఫోన్‌ల ద్వారా పన్నులు కట్టాలని సూచిస్తున్నారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ)లు 8 మంది జిల్లాకు ఉన్న నేపధ్యంలో కేసుల వారీగా డివిజన్ పరంగా కేటాయించటంతో, నిత్యం ఆ పన్నుల వసూళ్లపై పర్యవేక్షణ చేయాలని డీటీసీ షేక్ కరీం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా ఆరు బృందాలను రంగంలోకి దించి పన్నుల వసూళ్లను వేగవంతం చేస్తున్నారు.
స్వయంగా చెల్లిస్తే జరిమానా తగ్గింపు
పన్నులు చెల్లించాల్సిన వాహన యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. స్వయంగా పన్నులు చెల్లిస్తే కేవలం 50శాతం జరిమానాతో సరిపోతుంది. తనిఖీల్లో పట్టుబడితే మాత్రం చట్టప్రకారం 200శాతం జరిమానా విధించి తీరుతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించి తీరాల్సిందే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ వారి వాహనం ప్రకారం పన్నులు చెల్లించాలి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పన్నులు చెల్లించని వాహనాలను గుర్తించాం. తనిఖీలు మరింత ముమ్మరం చేస్తాం.
– షేక్ కరీం, డీటీసీ, గుంటూరు జిల్లా
