పొసగని పొత్తులతోనే పోరాటం | Tamil Nadu Assembly elections will be held on April 23rd | Sakshi
Sakshi News home page

పొసగని పొత్తులతోనే పోరాటం

Mar 28 2026 1:09 AM | Updated on Mar 28 2026 1:09 AM

Tamil Nadu Assembly elections will be held on April 23rd

తమిళనాడు శాసనసభకు ఏప్రిల్‌ 23న ఎన్నికలు జరుగనున్నాయి. కొన్ని దశాబ్దా లుగా రాష్ట్రం ద్విముఖ పోటీలనే చవి చూస్తూ వచ్చింది. ఇపుడు మూడవ గణనీయమైన పార్టీ ప్రవేశంతో ఎన్నికలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. సినీ నటుడు విజయ్‌ రాజకీయ బరిలోకి దిగడంతో ఆయనకు విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయన్న దానిపై ఎక్కువగా చర్చలు సాగుతున్నాయి. 

రాజకీయ అనుభవం సంపాదించడానికి కాక, ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకే బరిలోకి దిగుతున్నట్లు విజయ్‌ స్పష్టం చేశారు. విజయ్‌ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం (టీవీకే)ను జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అన్నా డీఎంకే ఆయన డిమాండ్లు చూసి ఖంగుతింది. 

జన నాయకుడు కాగలడా?
బీజేపీ 2024 లోక్‌ సభ ఎన్నికలలో కన్నా మెరుగైన ఫలితాలను కోరుకుంటోంది. అన్నా డీఎంకేతో పొత్తు ఏదో ఒరగబెట్టగలదనే ఆశ బీజేపీకే లేదు. కానీ టీవీకే ఆగమనం ఈ కూటమికి ఇపుడు లేని ఆధి క్యాన్ని తెచ్చిపెట్టగలదు. ఎన్నికల ప్రచార ఖర్చులు రూ. 40 లక్షలు మించకూడదని ఎన్నికల కమిషన్‌ నిర్దేశిస్తోంది. వాస్తవంలో, రూ. 5 కోట్లు అవసరమవుతాయని అంచనా. టీవీకే అభ్యర్థులలో కొందరికి అంత స్తోమత లేదని ఇటీవల జరిగిన ఆ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఫలితంగా, ఏదైనా పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, దాని పైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని అంటున్నారు. 

విజయ్‌ గతంలో బీజేపీని తన ‘సైద్ధాంతిక శత్రువు’గా అభివర్ణించారు. హిందుత్వ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, క్రైస్తవ, ముస్లిం మైనా రిటీల ఓట్లకు గండిపడవచ్చని ఆయన సందేహిస్తున్నారు. ఆయన అనుయాయుల్లో ఆ రెండు వర్గాలవారే ఎక్కువగా ఉన్నట్లు చెబు తున్నారు. టీవీకే వచ్చి చేరడం పట్ల అన్నా డీఎంకేకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అది చీలుస్తుందని దానికి తెలుసు. అయినా టీవీకే తనకు కూడా గ్రహణం పట్టిస్తుందే మోనని అన్నా డీఎంకే లోలోపల ఆందోళన చెందుతోంది. 

సినిమాలలో మాదిరిగానే ప్రత్యర్థుల దుమ్ము దులిపి ‘జన నాయగన్‌’ అనిపించుకోవాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. ఎన్ని కల బరిలో నిలిచిన అభ్యర్థి హీరోగా నటించిన సినిమా విడుదల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం అవుతుందా? ఇది ఎన్నికల కమిషన్‌కు ఎదురవుతున్న ప్రశ్న. రెండు ద్రవిడ కూట ములలో విజయ్‌ దేనిని దెబ్బతీస్తారనే దానిపైనే దాని జవాబు ఆధారపడి ఉంటుందని గత కొద్ది ఏళ్ళ చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. చిత్ర దర్శకుడు సీమాన్‌ కూడా నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్టీకే) పేరుతో ఒక చిన్న తమిళ జాతీయవాద పార్టీని ఇదివరకే ప్రారంభించారు. దాని ఓట్ల శాతం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తోంది. విజయ్‌ రాకతో ఎక్కువ దెబ్బతినేది ఆ పార్టీయేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

యుద్ధం స్టాలిన్‌తోనే!
అభిమానులు దళపతిగా పిలుచుకునే విజయ్‌ తన విమర్శ నాస్త్రాలన్నింటినీ పాలక డీఎంకే పైన, దాని నాయకుడు, ముఖ్య మంత్రి ఎం.కె. స్టాలిన్‌ పైన మాత్రమే ఎక్కుపెడుతున్నారు. విజయ్‌ 2025 సెప్టెంబర్‌లో కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఆ ఘటన తర్వాత ఆయన కొద్ది బహిరంగ సభలలోనే పాల్గొన్నారు. కానీ, ఆ తర్వాత, ఏ బహిరంగ సభలో మాట్లాడినా ఆయన ఎన్నికల ‘యుద్ధం’ తనకూ, స్టాలిన్‌కూ మధ్యనేనని చెబుతూ వస్తున్నారు. 

పాలకడీఎంకే పాల్పడినట్లు చెబుతున్న అవినీతి, దుష్పరిపాలనను తొల గించగల వ్యక్తిగా విజయ్‌ తనను తాను చాటుకుంటున్నారు. పెరి యార్, కె. కామరాజ్, సి.ఎన్‌. అన్నాదురై, ఎమ్జీఆర్‌ల సిసలైన వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. ఆయన అన్నా డీఎంకే ప్రస్తావనే తీసుకురావటం లేదు. తన ‘సైద్దాంతిక శత్రువు’ను కూడా విమర్శించడం లేదు. తమిళ నాడు నాయకత్వాన్ని కోరుకుంటున్నా, ఇంతకూ రాష్ట్రానికి సంబంధించి విజయ్‌ ప్రణాళికలేమిటో స్పష్టం కాలేదు. మీడియా ఇంటర్వ్యూలకు కూడా ఆయన దూరంగాఉంటున్నారు. 

స్టాలిన్‌ మాత్రం తన వంతుగా, అభివృద్ధికి సంబంధించి ‘ద్రావిడ నమూనా’ను పరిరక్షించుకునేందుకు సాగుతున్న నిర్ణయా త్మక పోరాటంగా ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు. కేంద్రం నుంచి ఒత్తిడులను ఎదుర్కొంటూ కూడా, ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారు ఉన్న రాష్ట్రాలకన్నా తమిళనాడు మెరుగైన పనితీరును కనబరచిందని ఆయన చెబుతున్నారు. అయినా ఆయన దేనినీ తేలికగా తీసు కోవడం లేదు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి కాకుండా, తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి ఐదేళ్ళ కొకసారి పొడసూపుతూఉంటుంది. జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే మాత్రమే గత దశాబ్దంలో ఒకేసారి 2016లో వరుసగా రెండవ విడత విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. 

అన్నా డీఎంకే గురించి విజయ్‌ ఎలా ప్రస్తావించడం లేదో, అలాగే స్టాలిన్‌ కూడా విజయ్‌ పేరును ఎత్తడం లేదు. విజయ్‌పై ధ్వజమెత్తే పనిని ఆయన పార్టీలోని ఇతరులకు వదిలేశారు. కానీ, కరూర్‌ తొక్కిసలాట ఘటన తర్వాత కూడా, ఆయన జన సమ్మోహక శక్తి తరగక పోవడంతో డీఎంకే ఆందోళనకు లోనవుతోంది. పైగా, ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో డీఎంకే సంబంధాలు గత ఎన్నిక లప్పుడున్నంత బలంగా లేవు. సీట్ల పంపంకంపై అవి బాహాటంగానే కీచులాడుకున్నాయి.

అన్నా డీఎంకే అంతంతే!
ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే పాత్ర కుంచించుకుపోయినట్లుగా కనిపిస్తోంది. దాని కూటమిలో బీజేపీతో పాటు టి.టి.వి. దినకరన్‌ కూడా ఉన్నారు. జయలలితకు సన్నిహితురాలైన శశికళకు ఆయన మేనల్లుడు. కాగా, శశికళ సొంత కుంపటి ఉండనే ఉంది. ఆమె పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అన్నా డీఎంకేను చికాకు పరచగలదని భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, అంతో ఇంతో పలుకుబడి కలిగిన ఒ.పన్నీర్‌ సెల్వం కూడా అన్నా డీఎంకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. 

మహారాష్ట్ర, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో కాషాయ పార్టీతో జత కట్టిన ప్రాంతీయ పార్టీలు ఎటువంటి ఫలితాలు సాధించిందీ పార్టీ నాయకుడు ఎళప్పాడి పళనిస్వామి గమనించకపోలేదు. అన్నా డీఎంకే కూటమిలో కెమిస్ట్రీ లోపించిందని తెలుస్తూనే ఉంది. మొత్తం 234 మంది సభ్యులు గల అసెంబ్లీలో 2021 ఎన్నికల్లోడీఎంకే 133 సీట్లు సాధించింది. 

డీఎంకేను ఎన్డీయే ఓడించలేక పోయినా, మహా అయితే, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే విధంగా, డీఎంకే కూటమికి చిల్లు పెట్టవచ్చు. ఎన్డీయేతో కలిసో లేదా కలవకుండానో విజయ్‌ తన వంతు పాత్ర తాను పోషిస్తారు. విజయ్‌ ‘రాజు కాలేరు. రాజుగా ఎవరినో కూర్చోపెట్టనూ లేరు. ఓట్లను చీలుస్తారంతే’ అని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ పీయూష్‌ గోయల్‌ అందుకే వ్యాఖ్యానించినట్లుంది!

-వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
-నిరుపమా సుబ్రమణియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement