భూసర్వే చేస్తేనే ధరణితో ప్రయోజనం | Sarampally Mallareddy Guest Colomn On Dharni Portal | Sakshi
Sakshi News home page

భూసర్వే చేస్తేనే ధరణితో ప్రయోజనం

Oct 30 2020 12:39 AM | Updated on Oct 30 2020 3:27 AM

Sarampally Mallareddy Guest Colomn On Dharni Portal - Sakshi

రాష్ట్ర రెవెన్యూ రికార్డులను 15 రోజుల్లో తయారు చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఆదేశించారు. పాసు పుస్తకాలు డిజిటలైజేషన్‌ చేసి ఇవ్వడంతోపాటు ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుత చట్ట ప్రకారం పట్టేదారులకు మాత్రమే ధరణి వెబ్‌సైట్‌లో వారి ఆస్తుల నమోదు ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో ఉంటాయి. వీటిని వీఆర్‌ఏలు నిర్వహిస్తారు. అమ్మకాలు, కొనుగోళ్ళు సాగాలన్నా ధరణి వెబ్‌సైట్‌ నుండి క్లియరెన్స్‌ పొందాలి. అంటే వీఆర్‌ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలి. దాని ద్వారా రిజిస్ట్రేషన్‌ ఆఫీసరుగా నియమితులైన తహసీల్దారు అమ్మకపు, కొనుగోళ్ళను రిజిస్టర్‌ చేస్తాడు. రిజిస్టర్‌ చేయగానే ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తిమార్పిడి జరిగిపోతుంది. అందువల్ల లంచగొండి విధానం నిర్మూలన జరుగుతుందని ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. అయితే అధికారులు తయారు చేసిన రికార్డులను మాత్రమే నమోదు చేయడం వలన తప్పులు దొర్లినప్పుడు వాస్తవ పట్టేదారు, హక్కుదారు నష్టపోతాడు. ఒకసారి ధరణి వెబ్‌సైట్‌లో నమోదు అయిన తరువాత తిరిగి మార్చాలంటే సివిల్‌ కోర్టుకు వెళ్ళాల్సిందే. అందువల్ల ధరణి వెబ్‌సైట్‌ కోసం తయారు చేసే రికార్డులను బహిరంగ పర్చకుండా ఉద్యోగస్తులు, వాటిని వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే అనేక తగాదాలు మొదలౌతాయి.

తెలంగాణ రెవెన్యూ చట్టం 1907 ప్రకారం 173 సెక్షన్లు ఉన్నాయి. ఇందులో 4, 5, 40, 74, 28ఎ, 125, 128, 169, 171 సెక్షన్లను రద్దు చేశారు. చాప్టరు 3ను కూడా రద్దు చేశారు. మిగిలిన సెక్షన్లు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. రెవెన్యూ చట్టాలను ఏ మాత్రం మార్చకుండా విడిగా ఏర్పాటు చేసిన ‘పాసు పుస్తకాల చట్టం’ 1971ని రద్దు చేసి దాని స్థానంలో ధరణి వెబ్‌సైట్‌ను పొందుపర్చారు. సాగుదారు అనగా కౌలుదారు, తాకట్టు పెట్టుకున్నవాడు, ఆక్రమణదారు, పాలు దారులు ఉంటారు. ప్రస్తుత ప్రభుత్వం సాగుదారుల హక్కులను గుర్తించకుండా వారిని రెవెన్యూ రికార్డుల నుండి తొలగించారు. ఇంతకు ముందు పట్టేదారే సాగుదారుడు అయితే పట్టా పాసుపుస్తకం, స్వాధీనపు పాసుపుస్తకం అతనికే ఇచ్చారు. ప్రస్తుతం సాగుదారులను తొలగించడంతో కొందరు హక్కులు కోల్పోయారు. తెలంగాణలో భూముల అమ్మకాలు, కొనుగోళ్ళలో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చాలా తక్కువ. భూములు కొనడం, నమ్మకంపై సాగు చేసుకోవడం జరుగుతున్నది. దీనిని గమనించి గత ప్రభుత్వాలు 1950లో సెక్షన్‌ 50బీ కిందను, 2000లో ఆర్‌ఓఆర్‌ (రికార్డు ఆఫ్‌ రైట్స్‌) పేరుతో సాదాబైనామాలను కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్‌ ఫీజు తీసుకొని పట్టా మార్పిడి చేశారు. అయినప్పటికీ ఆ రిజిస్ట్రేషన్‌ ఫీజు లేకపోవడం వల్ల కొంత మంది నేటికి పట్టాలు చేసుకోలేదు. 2014లో కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్‌ ఫీజు లేకుండా సాదాబైనామాలు పట్టాలు చేస్తానని ప్రకటించాడు.

ఆ విధంగా 12,50,000ల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నేటికి పరిష్కారం కానివి 10,96,344 ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ కొరకు ఎదురుచూస్తున్నాయి. ఇవి పరిష్కారం కాకుండా ధరణి వెబ్‌సైట్‌ను ఫైనలైజ్‌ చేస్తే 13.65 లక్షల మంది నష్టపోతారు. అంతేకాక అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన అర్హులు, 1950 రక్షిత కౌలుదారీ చట్ట ప్రకారం పట్టా పొంది నేటికి పేరు మార్పిడి జరగని వారు, ప్రభుత్వ భూములు 40 ఏళ్ళకుపైగా సాగు చేస్తున్నవారు నష్టపోతారు. వీరితోబాటు పోడు భూములను సాగుచేసే వారు కూడా నష్టపోతారు. పోడుభూముల సాగుదారులకు శాశ్విత హక్కు కల్పించలేనని సీఎం అసెంబ్లీలో ప్రకటించాడు. అందువల్ల ధరణి వెబ్‌సైట్‌తో నష్టపోయేవారి సంఖ్య 20 లక్షల వరకు చేరుకుంటుంది. ఇంత మందికి నష్టం చేస్తూ రెవెన్యూ చట్టాన్ని మార్చి మొత్తం రాష్ట్రాన్ని భారత దేశంలో ఆగ్ర భాగాన పెట్టానని ప్రచారం చేయడం జరుగుతున్నది.

ఈ రోజు అనేక రెవెన్యూ సమస్యలతో రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ అవినీతి కొరకు కావాలని చేసిన తప్పులకు వారు బలిపశువులు అవుతున్నారు. చాలా మందికి భూమి ఎక్కువ, తక్కువ ఉండటం, పేర్లు అధారం లేకుండా మార్చేశారు. ప్రభుత్వంగానీ, ఉద్యోగులుగానీ, ధరణి వెబ్‌సైట్‌కు ఇచ్చిన వివరాలలో తప్పులు ఉన్నచో వారిపై ఎలాంటి కేసులు పెట్టరాదని సవరణ చేసిన చట్టంలో నిబంధన పెట్టారు. రెవెన్యూ సవరణల పేరుతో చేసిన తప్పులకు రైతులే బాధ్యులు కావాల్సి ఉంటుంది. పైగా గ్రామాలలో జరిగే భూతగాదాలు, సివిల్‌ కోర్టుకు వెళ్ళాలంటే అధిక ధన వ్యయంతో కూడిన పని. భూదాన యజ్ఞబోర్డు భూములు, కొనుగోలు చేసిన అసైన్డ్‌ భూములు, తరాలుగా సాగు చేస్తున్న ప్రభుత్వ భూములు వాస్తవ సాగు దారులకు దక్కకుండా పోతున్నాయి. 

ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వే చేయడం అనివార్యం. సర్వేచేస్తే పాలకవర్గాల భూ బాగోతాలన్నీ బట్టబయలవుతాయి. పేద సాగుదారులకు కొంతైనా న్యాయం జరుగుతుంది. ఇంతకు ముందు భూ భారతి పేరుతో శాటిలైట్‌ సర్వే విఫలమైంది. ప్రస్తుతం డిజిటల్‌ పద్ధతిలో చేస్తామంటున్నారు. వాస్తవానికి మాన్యువల్‌గా చేయడం వల్ల మాత్రమే న్యాయం జరుగుతుంది. రెవెన్యూ చట్టాల జోలికి వెళ్ళకుండా ఒకే ఒక పాసు పుస్తకాల చట్ట సవరణ చేసి మొత్తం రెవెన్యూ సమస్యలు పరిష్కారం అయినట్లు చెప్పడం సరైందేనా? శాసన సభ్యులు వందల ఎకరాల భూములు సేకరించి ఫాంహౌజ్‌ల ఏర్పాటులో భూ సేకరణలు చేస్తున్నారు. వారు చేస్తున్న భూ సేకరణ అక్రమమా? సక్రమమా? అన్నది కూడా సర్వేలో తేలుతుంది. అందువల్ల మొత్తం భూ సమస్య పరిష్కారానికి సర్వే చేయడం మినహా మరో మార్గం లేదు. ధరణి వెబ్‌సైట్‌ సవరణ చట్టం మాత్రమే భూ సమస్యలను పరిష్కరించలేదన్నది వాస్తవం.

సారంపల్లి మల్లారెడ్డి
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు
మొబైల్‌ : 94900 98666

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement