తాత్సారంలో ఆంతర్యమేమిటి? | Sakshi Guest Column On Women Reservations Bill | Sakshi
Sakshi News home page

తాత్సారంలో ఆంతర్యమేమిటి?

Oct 3 2023 4:03 AM | Updated on Oct 3 2023 4:03 AM

Sakshi Guest Column On Women Reservations Bill

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నూతన పార్లమెంట్‌ భవనంలో అట్టహాసంగా తెచ్చిన తొలి బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో చట్టరూపం దాల్చింది. ‘నారీ శక్తి వందన్‌ యాక్ట్‌–2023’గా పిలుస్తున్న దీన్ని సెప్టెంబర్‌ 19న లోక్‌సభ, సెప్టెంబర్‌ 21న రాజ్యసభ ఆమోదించాయి. అయితే దీన్ని నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, అంటే 2029 ఎన్నికల వరకు గానీ అమలుచేయకపోవడం గమనార్హం. కాబట్టి, ఈ రిజర్వేషన్లను జాప్యం చేయాలన్న ఉద్దేశం ఇందులో కనబడుతోంది. స్త్రీలు పార్లమెంట్‌లోకి వెళ్తే సమాజ భవితవ్యమే మారిపోతుంది. వీరు కుటుంబాన్ని తీర్చిదిద్దినట్లే సమాజాన్ని తీర్చిదిద్దగలరు. స్త్రీలనూ, బీసీలనూ, దళితులనూ నిర్లక్ష్యం చేసినంతకాలం ఆ పార్లమెంటుకు అర్థంలేదు.

నూతన పార్లమెంటు భవనంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టడం ఒక చారిత్రా త్మకమైన విషయంగా చెప్పవచ్చు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన ఈ బిల్లును కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన రోజున తొలి బిల్లుగా ప్రవేశపెట్టడం విశేషం. ఈ బిల్లు ప్రకారం రాజ్యసభ, పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటాను అమలు చేస్తారు. 33 శాతంలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు వారి రిజర్వేషన్ల కోటా ఆధారంగా కేటాయిస్తారు.

15 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఈ రిజర్వేషన్లను వెంటనే కాకుండా నియో జకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్‌) తర్వాత అమల్లోకి తేవాలని నిర్ణయించడం గమనార్హం. 2026లో డీలిమిటేషన్‌ చేపట్టాల్సి ఉంది. అది పూర్తయ్యి రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టడం ఖాయం. అంటే 2024 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమల్లోకి రావు. 2029 లోనే ఈ కోటా అమలయ్యే అవకాశముంది.
 
ఆశ్చర్యకరమైన బిల్లు
ఈ రిజర్వేషన్ల బిల్లు చాలాసార్లు సభల ముందుకు వచ్చింది. ప్రతిసారీ ఏకాభిప్రాయం కుదరక ఆమోదం పొందలేదు. దాదాపుగా 27 ఏళ్లుగా అది పెండింగ్‌లోనే ఉండిపోయింది. కనీసం 50 శాతం రాష్ట్రాలు ఈ బిల్లును ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ బిల్లులో చాలా లొసుగులు వున్నాయి. ఆవ్‌ు ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత ఆతిషి మహిళా రిజర్వేషన్‌ బిల్లును 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలను మోసం చేసేందుకు తెచ్చిన బిల్లు అని ఆరోపించారు. నిజానికి ఈ బిల్లులో పితృస్వామిక ఆధిపత్యం ఉంది. దళిత బహుజన వివక్ష ఉంది. ముఖ్యంగా బీసీలను అధికారం లోనికి రాకుండా చేసే కుట్ర దాగి ఉంది. డీలిమిటేషన్‌ అయిన తర్వాత ఎప్పుడో 2029లో రిజర్వేషన్లు అమలు చేయబడతాయి అనడంలోనే వీటిని జాప్యం చేయాలనే ఆలోచన వుంది.

నిజానికి హిందుత్వవాదులు మనుస్మృతి అనుచరులు. మనుçస్మృతిని క్రీ.పూ. రెండవ శతాబ్దంలో రాసివుంటారని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేర్కొన్నారు. బౌద్ధయుగం అంతరించి హిందూ రాజ్యాలు ఆవిర్భవించే క్రమములో పుష్యమిత్రులు ఈ మనుస్మృని బ్రాహ్మణ రాజ్య నిర్మాణానికి సాధనంగా వాడుకున్నారు. వర్ణవ్యవస్థ పున రుద్ధరణ, స్త్రీ అణచివేత యిందులో ప్రధానమైన అంశాలుగా ముందుకు వచ్చాయి. ‘పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే రక్షంతి స్థావిరే పుత్రాన స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని చెబుతుంది మనుస్మృతి.

బాల్యమున తండ్రి స్త్రీలను రక్షించును. యౌవనమున మగడు రక్షించును. ముసలితనమున పుత్రుడు రక్షించును. కావున స్త్రీ స్వతంత్రురాలిగా నుండటానికి వీల్లేదు. (భర్త, కుమారులు లేనప్పుడు బంధువులు రక్షింతురు). దీన్నిబట్టి మనకేమి అర్థమౌతుందంటే హిందూ పురుషుడు స్త్రీకి భయపడ్డాడు. ఈ భావజాలానికి ప్రతీకగా వున్న పార్టీ మహిళా బిల్లు ప్రవేశపెట్టిందంటే, నమ్మశక్యంగా లేదు.

రాజకీయాల్లోకి స్త్రీలను అసలు రాకుండా అడ్డుకోవడం జరుగు తూనే ఉంది. ఆయా పార్టీలు స్త్రీలకు సీట్లు ఇవ్వడమే తక్కువ. ఆ రాజకీయ ప్రాతినిధ్యం కూడా అగ్రకులాల స్త్రీలకే లభ్యం అయ్యింది. భారతదేశంలో ఇప్పుడు 5 శాతం కంటే తక్కువ స్త్రీలు పార్లమెంట్‌లో ఉన్నారు. జెకోస్లేవేకియా, సోవియట్‌ రష్యాల చట్టసభలలో 27 నుండి 28 శాతం వరకు స్త్రీలకు ప్రాతినిధ్యం ఉంది. పశ్చిమ యూరప్‌లో, యూఎస్‌ఏలో 3 నుండి 4 శాతం స్త్రీల ప్రాతినిధ్యం మాత్రమే చట్ట సభలలో ఉంది. పార్టీలు 10 నుండి 15 శాతం సీట్లు కేటాయించినట్లు ప్రకటించినా, భారతదేశంలో స్త్రీలకు 7 శాతం కంటే సీట్లు మించలేదు. వారిలోనూ ఎన్నికైన స్త్రీల అభ్యర్థుల సంఖ్య ఇంకా తక్కువగా ఉంటోంది.

నామమాత్ర రిజర్వేషన్లు
పట్టణీకరణ ప్రభావం స్త్రీల రాజకీయ ప్రవేశానికి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. స్టేటస్‌ ఆఫ్‌ వుమెన్‌ కమిటీ 1977లో చేసిన సర్వే ప్రకారం, గ్రామీణ స్త్రీలే ఎక్కువ రాజకీయ చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. స్త్రీల రిజర్వేషన్‌కు సంబంధించిన విషయాలే ఇలా ఉంటే, ఇక స్త్రీలు ఓపెన్‌ కాంపిటిషన్‌లో సీట్లు గెలవడం కష్టంగా ఉంది. గ్రామ పంచాయితీల్లో పురుషుల ప్రాతి  నిధ్యం ఎక్కువ ఉండడం వలన ఎన్నికైన స్త్రీలు కూడా నామమాత్రంగానే తమ ప్రాతినిధ్య విలువను వ్యక్తీకరించగలుగుతున్నారు. మొత్తం రాజకీయ పెత్తనం అగ్రకులాల పురుషులదైనపుడు దళితులకు, స్త్రీలకు ఇస్తున్న రాజకీయ రిజర్వేషన్లు నామమాత్రం అవుతున్నాయి. దళిత స్త్రీలకు దాదాపు రాజకీయాధికారంలో భాగస్వామ్యం లేదు. 

భారత ఉపఖండంలో ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న ఎన్నికలు కూడా ఒక పెద్ద ఫార్సుగా తయారయ్యాయి. డబ్బు, మత్తు మందులు, హైటెక్‌ ప్రచారం, గూండాయిజం ఉన్నవాళ్ళకే పార్టీలు సీట్లు ఇస్తున్నాయి. ఎవరికైనా స్త్రీలకు సీట్లు ఇస్తే పితృస్వామ్యాన్ని పోషించగలిగిన స్త్రీలకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పెక్కు సంవత్సరాలు భారతదేశాన్ని పరిపా లించారు. ఆమె కాలంలో కాంగ్రెస్‌ పార్టీలో స్త్రీలకు ఎక్కువ ప్రాతి నిధ్యం కల్పించడం కానీ, ఏ విధమైన స్త్రీల సంస్కరణలు కానీ జరగలేదు. కొందరు స్త్రీలు పురుష పెత్తందారితనాన్ని అనుకరించ డమే స్త్రీవాదం అనుకుంటారు.

దళితులు, స్త్రీలు రాజకీయ భాగస్వామ్యాన్ని పొందకపోవడంతో సమంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని చెబుతూ డాక్టర్‌ మణి పి. కమేర్‌కర్‌ ఇలా అన్నారు: ‘స్త్రీలను ఒక అల్ప సంఖ్యాక వర్గంగా లెక్కించి, దళితులను నిర్లక్ష్యం చేసినట్లే రాజకీయాల్లో స్త్రీలను కూడా నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వం తన ప్రచార సాధనాల ద్వారా స్త్రీలను వస్తువులు, అలంకారాలు, ఫ్యాషన్ల మోజులో పడేలా చేసి, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల పట్ల వారి చైతన్యాన్ని దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. పురుష సమాజం చేస్తున్న కుట్రలతో స్త్రీలలో కూడా రాజకీయేతర జీవనం ఎక్కువైంది. భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా స్త్రీల రాజకీయ చైతన్యం చాలా తక్కువ స్థాయిలో ఉంది.’

నాయకత్వ స్థానంలోకి వచ్చినప్పుడే...
రాజకీయ చైతన్యానికి ముందు భారత ఉపఖండంలో స్త్రీలలో ఇంకా బలంగా, సామాజిక ఆర్థిక, సాంస్కృతిక పోరాటాలు జరగాలి. ఉద్యమాల నుండి వచ్చిన కార్యకర్తలు గ్రామస్థాయిలో రాజకీయ నాయకులుగా ఎదగాలి. సమాజ పునర్నిర్మాణానికి, పితృస్వామ్యానికి భిన్నంగా వారు కృషి చేయాలి. ఇతర దేశాలలో కూడా సమాజ ఉపరి తలానికి సంబంధించిన స్త్రీలే నాయకత్వ స్థానాలలో ఉన్నారు. సమాజ పునాదిని నిర్మించిన దళిత స్త్రీలు రాజకీయ చైతన్యాన్ని, నాయ కత్వాన్ని పొందగలిగినపుడే స్త్రీ స్వామ్యం సాధ్యమౌతుంది.

జనాభా నిష్పత్తిని బట్టి అందరికీ సమాన అవకాశాలు వచ్చినప్పుడే భారతదేశంలో నూత్న విప్లవం వస్తుందని అంబేడ్కర్‌ చెప్పారు. స్త్రీ ఒక ఉజ్వల శక్తి. వీరు పార్లమెట్‌లోకి వెళ్తే సమాజ భవితవ్యమే మారి  పోతుంది. కుటుంబాన్ని తీర్చిదిద్దినట్లే సమాజాన్ని తీర్చిదిద్దగలరు. స్త్రీలను, బీసీలను, దళితులను నిర్లక్ష్యం చేసినంతకాలం ఆ పార్లమెంటుకు అర్థంలేదు. శ్రామిక శక్తులు, ఉత్పత్తి శక్తులు, దళిత బహుజన స్త్రీ నారీ మణులు, ఈ పార్లమెంట్‌ను అలంకరించే రోజు రావాలి.
డా. కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement