అంతర్జాతీయ యవనికపై మెరిసిపోతూ... | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ యవనికపై మెరిసిపోతూ...

Published Wed, Sep 13 2023 12:32 AM

Sakshi Guest Column On PM Narendra Modi And India

భారతదేశం సార్వభౌమ దేశంగా అన్ని రంగాలలో సుస్థిర అభివృద్ధి సాధించిన దేశంగా స్వాతంత్య్ర అమృతోత్సవ ముగింపు సంబరాల్లో ఉంది. కరోనా మహమ్మారి మూలంగా ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు సైతం కుదేలైనాయి. కానీ భారత్‌ మాత్రం అన్ని రంగాలలో సుస్థిర అభివృద్ధిని సాధిస్తూ 3.7 ట్రిలియన్‌ డాలర్ల పరిమాణంతో ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ముదావహం. ఇదే సమయంలో అంత ర్జాతీయంగా దేశ ప్రాముఖ్యం పైపైకి దూసుకుపోతుండడమూ గర్వించదగిన సంగతి. 

ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 2045 సంవత్సరానికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భ వించనున్నది. గడిచిన తొమ్మిదేండ్లలో కేంద్రం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని ప్రవేశపెట్టడం, ద్రవ్యోల్భణాన్ని అరికట్టడం; ‘డిజిటల్‌ ఇండియా’, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’లను ప్రవేశ పెట్టడం; వ్యవసాయిక, పారిశ్రామిక విధానాలలో మార్పుల వంటి విప్లవాత్మక నిర్ణయాల వలన అభివృద్ధి సాధ్యమయింది.

2014 మే నెలలో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్య తలు చేపట్టిన నాటి నుండి విదేశీ విధాన రూపకల్పనలో అనేక మార్పులను తీసుకువచ్చారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ళలో ‘సార్క్‌’ (దక్షిణా సియా) దేశాలతో సంబంధాలను మెరుగు పరచటానికి చర్యలు తీసుకున్నారు. చైనా అక్రమ సైనిక చొరబాట్లను ఎప్పటికప్పుడు ఆయన నాయకత్వంలో దేశం తిప్పి కొట్టింది.

‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’ నిర్వహించటం ద్వారా పాకి స్తాన్‌లోని తీవ్రవాదుల స్థావరాలను కూల్చివేసింది. తదుపరి పశ్చి మాసియా దేశాలతో సంబంధాలను పటిష్ట పరచడానికి మోదీ ప్రయత్నించారు. ముఖ్యంగా యూఏఈతో చేసుకున్న ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం – 2022’ ఇరుదేశాల ఆర్థికాభివృద్ధికి మెరుగైన బాటలు వేసింది.  

ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాలతో భారత్‌ సంబంధాలను మెరుగు పరచటంలో మోదీ ప్రభుత్వం నూతన ఒరవడికి నాంది పలికింది. అమెరికా అధ్యక్షులు ఒబామా, ట్రంప్‌ల కాలంలోనూ, ఇప్పటి బైడెన్‌ హయాంలోనూ అమెరికాకు భారత్‌ ‘వ్యూహాత్మక భాగస్వామి’గా చాలా దగ్గరయింది. మెక్సికో, కెనడా, బ్రెజిల్, అర్జెంటీనా తదితర దేశాలతోనూ మోది నాయకత్వంలో భారత్‌ ఎనర్జీ, అంతరిక్ష పరిశోధన, రక్షణ, సైబర్‌ సెక్యూరిటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్, రైల్వేస్‌ తదితర రంగాలకు సంబందించి ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకుంది.

ఇటీవల దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌ బర్గ్‌లో ఆగస్టు 22 నుండి 24 వరకు నిర్వహించిన ‘బ్రిక్స్‌’ సదస్సులోనూ సభ్య దేశా లయిన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో అనేక వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంది భారత్‌. రష్యా, జపాన్, జర్మనీ, ఇటలీ, తదితర దేశాలతో భారత్‌ మొదటి నుంచి అవినాభావ సంబంధాలు కల్గి వుంది. అవి ఇప్పుడు మరింత బలపడ్డాయి. 

మోదీ నాయకత్వంలో భారత్‌ అంతర్జాతీయ యవని కపై తనదైన ముద్రవేసింది. 2023లో జీ20కి భారత్‌ అధ్యక్షత్వాన్ని ప్రధాని మోదీ ‘ప్రజల అధ్యక్ష పదవి’గా అభివర్ణించారు. జీ20 అధ్యక్ష బాధ్యతల్లో భాగంగా సహకార సమాఖ్య వాదాన్ని భారత్‌ విభిన్న నమూనా లలో ప్రదర్శించింది. సదస్సులో పాల్గొన్న అన్ని సభ్య దేశాలూ వివిధ అంశాలకు సంబంధించి ‘న్యూఢిల్లీ సంయుక్త లీడర్స్‌ డిక్లరేషన్‌’ పేరుతో ప్రకటన చేశాయి.

ఉగ్రవాదాన్ని అంతమొందించటం, శిలాజ, ఇంధనాల వాడకం తగ్గింపు, అవినీతిపై పోరు, వాణిజ్య సంబంధాల బలోపేతం, ‘భారత్‌–గల్ఫ్‌– యూరప్‌– మహారైల్‌ పోర్ట్‌ కారిడార్‌ నిర్మాణం’ వంటివి ఆ ప్రకటనలో భాగంగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆఫ్రికన్‌ యూనియన్‌ ఛైర్మన్‌ విజ్ఞప్తి మేరకు భారత్‌  ఆఫ్రికన్‌ యూనియన్‌ సభ్యత్వం తీసుకుంది.

ఈ సందర్భంగా భారత్, అమెరికా అధినే తలు మోదీ, జోబైడెన్‌ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం జరి గింది. అలాగే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ అనేక దేశాల మద్దతును కూడగట్టింది. ఈ వేదిక ద్వారా అమెరికా, బ్రిటన్‌లు భారత్‌కు ఐరాసలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించటం గర్వించదగిన విషయం.

ఇటీవలి ‘చంద్రయాన్‌–3’, ‘ఆదిత్య ఎల్‌–1’ ప్రయోగాలు కూడా శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్‌ శక్తి సామ ర్థ్యాలను ప్రపంచానికి మరోసారి వెల్లడించాయి. దేశానికి అంతర్జాతీయంగా మరింత గౌరవం ఇనుమడించింది.
డా‘‘ పెద్దిరెడ్డి నరేందర్‌ రెడ్డి 
వ్యాసకర్త ఓయూలో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలో

Advertisement

తప్పక చదవండి

Advertisement