మన తీరు ఇలా ఉండాలా?

Sakshi Guest Column On Australian Cricketer Usman Khawaja

కామెంట్‌

ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా పట్ల మనం వ్యవహరించిన తీరు సంకుచితంగా ఉంది. అతడికి ద్వంద్వ జాతీయత ఉంది. అటు పాకిస్తానీయుడి గానూ, ఇటు ఆస్ట్రేలియన్‌ పౌరుడిగానూ ఉంటున్నాడు. అది మన ప్రభుత్వ కళ్లలో అతడిని అనుమానితుడిని చేసింది. అందుకే ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ జట్టుతో కలిసి భారత్‌ పర్యటనకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, వెంటనే అనుమతి దక్కలేదు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, మానవ హక్కుల సూత్రబద్ధ సమర్థకురాలిగా ఉంటున్నందుకు భారత్‌ గర్వపడుతుంది. మనం ఈ స్వీయ–ప్రతిష్ఠను నిలుపుకొనేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన పట్ల పాకిస్తాన్‌ ప్రవర్తన కూడా అలాగే ఉందనే వాదన ఒకటుంది.

మన సొంత ప్రమాణాలను నిర్దేశించుకోవడానికి మన పొరుగు వాడి ప్రవర్తన ప్రమాణం అవుతుందా? పాకిస్తాన్‌ పౌరులనూ, వారి భయంకరులైన పాలకులనూ మనం వేరు చేసి చూడకూడదా? దక్షిణాసియా ప్రాంతంలో కీలక శక్తిగా తనను తాను పరిణించుకుంటున్న దేశం, ఐరాసలో అత్యున్నత సీటును కోరుకుంటున్న దేశం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? 

మన దేశాన్ని సందర్శించాలని కోరుకునే పాకిస్తానీయుల పట్ల మనం ఎందుకు చీకాకుగా వ్యవ హరిస్తాం? అయితే మన పట్ల వాళ్ల ప్రవర్తన కూడా అలాగే ఉందనే వాదన ఒకటుంది. కానీ నా అనుభవం అలా లేదని నేను చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా ఇలాంటి వాదన సముచితమైనది కాదు. అది మనకు విలువనివ్వదు కూడా! 

మొదటి విషయం: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగానూ, మానవ హక్కుల విషయంలో సూత్రబద్ధ సమర్థకురాలిగానూ ఉంటున్నందుకు భారత్‌ గర్వపడుతుంది. కానీ మనం దీన్ని గురించి చెప్పినట్లయితే పాకిస్తాన్‌ అసలు నమ్మదు. అయితే మనం కూడా మన స్వీయ– ప్రతిష్ఠను నిలుపుకొనేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన సొంత ప్రమాణాలను నిర్దేశించు కోవడానికి మన పొరుగువాడి ప్రవర్తన ప్రమాణం అవుతుందా? అలా కాదంటే–  ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా కాకుండా, దానికి భిన్నంగా వ్యవహ రించడం ద్వారా మనం మరింత మెరుగైనవాళ్లమని దృఢ నిరూపణ చేయాల్సి ఉంటుంది. 

అనుమానపు చూపు అద్భుతమైన ఆస్ట్రేలియన్‌ బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖ్వాజా పట్ల మనం వ్యవహరించిన తీరు నేను వర్ణించిన రోత ప్రవర్తనకు ప్రతిరూపమే. నిజానికి ఇది అంతకుమించిన ఘోరమైన విషయం. సంకు చితంగా, ద్వేషపూరితంగా, మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నట్లుగా ఉంది. ఇలాంటి వైఖరి భార త్‌ను పేలవంగా చూపిస్తుంది. దీంట్లోని అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే, ఇదంతా మనకు మనం కలిగించుకున్న నష్టమే.

పాకిస్తాన్‌లో పుట్టిన ఖ్వాజా నాలుగేళ్ల వయసులో ఉండగా కుటుంబంతోపాటు ఆస్ట్రేలి యాకు వలస వెళ్లాడు. ఈరోజు అతడికి ద్వంద్వ జాతీయత ఉంది. అతడు అటు పాకిస్తానీయుడి గానూ, ఇటు ఆస్ట్రేలియన్‌ పౌరుడిగానూ ఉంటు న్నాడు. అది మన ప్రభుత్వ కళ్లలో అనుమానితుడిని చేసింది.

ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ జట్టుతో కలిసి భారత్‌ పర్యటనకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, అతడికి వెంటనే అనుమతి దక్కలేదు. అది ఎంత ఆలస్యమైందంటే, ఫిబ్రవరి 1న ఖ్వాజా లేకుండానే ఆస్ట్రేలియా టీమ్‌ ఇండియాకు వచ్చేసింది. ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ పాలనా యంత్రాంగం నిరసన తెలిపిన తర్వాతే ఖ్వాజా వీసాను పొంద గలిగాడు.

ప్రభుత్వాల ప్రామాణిక ధోరణి భారతదేశంలో మనలో ఏ కొద్దిమందికో ఈ విషయం గురించి తెలుసు. అందులో బహుశా చాలా కొద్దిమంది దీని గురించి కలవరపడుతుండవచ్చు. కానీ ఆస్ట్రేలియాలో ఇలా ఉండదు. బీజేపీ ఖ్వాజాను ఆస్ట్రేలియా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిలా కాకుండా పాకిస్తాన్‌లో పుట్టిన ముస్లింలా చూస్తోందని ‘సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌’లో రాసే దేశ అత్యుత్తమ క్రికెట్‌ వ్యాఖ్యాతల్లో ఒకరైన మాల్కమ్‌ కోన్‌ రాశారు.

వాస్తవం ఇంతకంటే దారుణంగా ఉంది. భారతీయ వీసాను పొందడంలో సమస్యలు ఎదుర్కోవడం ఖ్వాజాకు ఇదే తొలిసారి కాదు. ‘ది గార్డియన్‌’ పత్రిక ప్రకారం– మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా 2011 లోనే ఈ అనుభవం అతడికి ఎదురైంది. పాకిస్తానీ యుల పట్ల ద్వేషపూరిత వైఖరిని ప్రదర్శించడం భారత ప్రభుత్వాలకు ఒక ప్రామాణికమైన ఆచర ణగా మారిపోయిందని ఇది స్పష్టం చేస్తోంది.

ద్వంద్వ పౌరసత్వం ఉన్న పాకిస్తానీయుడు, భారతీయ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు నన్ను వివరించనివ్వండి. ఆ వ్యక్తి లండన్, న్యూయార్క్‌ లేదా దుబాయ్‌ నివాసి అయినప్పటికీ, వారి పాకిస్తానీ పాస్‌పోర్ట్‌పైనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది తప్ప మరొక పాస్‌పోర్ట్‌ మీద కాదు.

దరఖాస్తు సమర్పించగానే భారతీయ రాయబార కార్యా లయం దాన్ని ఢిల్లీకి పంపిస్తుంది. అక్కడ విదేశీ వ్యవహారాల శాఖ కాకుండా, హోమ్‌ మంత్రిత్వ శాఖ దాన్ని నిర్ణయిస్తుంది. దానికి కొన్ని నెలలు పడుతుంది. మూడు నెలల్లోగా నిర్ణయం వస్తుందని ఆశించవద్దని దరఖాస్తుదారులకు ఆటోమేటిక్‌గా చెబుతారు.

అఖండ భారత్‌ ఇలాగా? తరచుగా నేను మెజారిటీ కేసులను తడిమి చూశాను. ఎక్కడా స్పందన లేదు. అలాంటి సందర్భాల్లో ఏ వార్తా రాకపోవడం మంచి వార్త కాదు. ఒకవేళ వచ్చిదంటే, ఎవరో మీ కోసం తీగ లాగగలగాలి. అదీ మీరు అదృష్టవంతులైతే! కానీ ఎంతమంది పాకిస్తానీయులకు అలాంటివి చేసి పెట్టేవారు దొరుకుతారు? తుది ఫలితం ఏమిటంటే – భారత్‌ సందర్శించడానికి చాలా తక్కువ మంది మాత్రమే అనుమతి పొందుతారు.

ఒకప్పుడు –అంటే చాలా కాలం క్రితం కాదు– మన తోటి దేశవాసులుగా  ఉండిన వారితో మనం నిజంగా వ్యవహరించవలసిన తీరు ఇదేనా? మరీ ముఖ్యంగా, అఖండ భారత్‌పై మన ప్రకటనలకు (సమర్థన అటుండనీ) మద్దతు గెల్చుకోవడానికి మనం వెళుతున్న మార్గం ఇదేనా? దక్షిణాసియా ప్రాంతంలో కీలక శక్తిగా తనను తాను పరిగణించుకుంటున్న దేశం, ఐక్యరాజ్యసమితిలో అత్యున్నత సీటును కోరుకుంటున్న దేశం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా ‘అవును’ అనేది సమాధానం అయితే అది నేను నమ్మలేని విషయం అవుతుంది.

పాకిస్తాన్‌ ప్రభుత్వంతో మనకు దశాబ్దాలుగా సమస్యలు ఉన్నాయనడంలో సందేహమే లేదు. కానీ నిజం ఏమిటంటే పాకిస్తాన్‌ ప్రజల విషయంలో కూడా ఇది నిజమేనా? ఈ సందర్భంలో దేశ పౌరులనూ, వారి భయంకరులైన పాలకులనూ మనం వేరు చేసి చూడకూడదా? లేదా మనం అలాంటి సులభమైన సూక్ష్మ విషయాన్ని కూడా గ్రహించలేనంత అసమర్థులమా?

ఈ విషయంలో నిజం ఏదంటే, మనం వీసాలను నిరాకరించడం ద్వారా పాకిస్తానీయులు ఇబ్బందిపడి ఉండవచ్చు లేదా పడకపోయి ఉండ వచ్చు. కానీ ఒక దేశంగా మనం (భారత ప్రభుత్వాలు మాత్రమే కాదు, భారత ప్రజలం కూడా) వికారంగా కనిపించడం లేదా? కాబట్టే మన కోసమైనా మనం ఇలాంటి ధోరణిని తప్పక ఆపివేయాలి.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top