హింసించడం పోలీసుల డ్యూటీ కాదు! | Sakshi
Sakshi News home page

హింసించడం పోలీసుల డ్యూటీ కాదు!

Published Fri, Nov 19 2021 5:26 PM

Police Violence, Law and Rights, Indian Penal Code: Kodepaka Kumara Swamy Opinion - Sakshi

దేశంలో పోలీసు కస్టడీలో నిందితులపై హింసా, ఇతర వేధింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయనీ, మానవ హక్కులకు ముప్పు ఎక్కువగా మన పోలీస్‌ స్టేషన్లలోనే ఉంటోందనీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ పలు సందర్భాల్లో అన్నారు. వాస్తవానికి పోలీసు ఠాణాల్లో నిందితులు చిత్రహింసలకు గురవుతున్నా,  దెబ్బలకు తట్టుకోలేక మరణిస్తే తప్ప ఆ నేరం వెలుగులోకి రావడం లేదు.

పోలీసు అధికారులు తప్పుడు కేసుల్లో అమాయకుల్ని ఇరికించి, గాయపరచడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలను తయారు చేసినట్లయితే, భారతీయ శిక్షా స్మృతి, సెక్షన్‌ 167 ప్రకారం అతను శిక్షార్హుడు. నిందితుడిని అరెస్టు చేసి, నేరాన్ని చేసినట్లు ఒప్పుకోమని హింసించినా, భారతీయ సాక్ష్య చట్టం, 1872లోని సెక్షన్‌ 25, 26 ప్రకారం అటువంటి నేరాంగీకరణలు కోర్టుల్లో చెల్లవు. (చదవండి: ఆ వారసత్వం నేటికీ రేపటికీ అవసరమే!)

మానసికంగా, శారీరకంగా నిందితులను గాయాల పాలు చేసి రిమాండుకు పంపేటప్పుడు జడ్జీ దగ్గర వాస్తవాలు చెప్పనివ్వకుండా కొట్టలేదు, తిట్టలేదు అని చెప్పించే పోలీసు వ్యవస్థలో మనం బతుకుతున్నాం. చాలామంది పోలీసులు ప్రజలను కొట్టడం వారి డ్యూటీలో భాగంగా భావిస్తు న్నారు. సుప్రీంకోర్టు 2006లో ప్రకాశ్‌ సింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ అఫ్‌ ఇండియా కేసు తీర్పులో సూచిం చినట్లు జిల్లా, రాష్ట్ర స్థాయి ‘పోలీసు కంప్లయింట్‌ అథారిటీ’లను ఏర్పాటు చేసి పోలీసుల నేరాలను తగ్గించాలి. తెలంగాణ హైకోర్టు ఆదేశానుసారం జూన్‌ 2021లో సదరు అథారిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవో నం.1093ను ప్రభుత్వం జారీ చేసింది. కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదు.  (జైభీమ్‌: నాటి పోరాటం గుర్తొచ్చింది!)

ఈ ఏడాది తెలంగాణలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మరియమ్మ కస్టోడియల్‌ మరణం జరిగింది. ఈ లాకప్‌ డెత్‌  కేసులో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్‌ నుండి తొలగించారు. కానీ వీరికి జైలు శిక్ష పడుతుందా? అదేరోజు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో దొంగతనం చేశాడనే అనుమానంతో వీరశేఖర్‌ అనే గిరిజనుడిని పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

భారత దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కల్పించిన మానవ హక్కుల గురించీ, సీఆర్‌పీసీ, ఐపీసీ చట్టాల గురించీ కనీస అవగాహన అవసరం. పాఠశాలల్లో ప్రాథమిక, ఉన్నత విద్యలో పాఠాల రూపంలో బోధించాలి. తెలంగాణాలో ఫ్రెండ్లీ పోలీసులు అని చెబుతున్న ప్రభుత్వం, కానిస్టేబుల్‌ నుండి ఉన్నతాధికారుల వరకు మానవ హక్కులపై ప్రతియేటా శిక్షణ తర గతులు నిర్వహించాలి. ఖాకీ డ్రెస్సుల్లో ఉద్యోగం చేస్తున్న నేరగాళ్ళను గుర్తించి, ఉద్యోగాల నుండి తొలగించాలి. తక్షణం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోలీస్‌ కంప్లయింట్‌ అథారిటీలను ఏర్పాటు చేయాలి.


- కోడెపాక కుమార స్వామి 

వ్యాసకర్త సామాజిక కార్యకర్త

Advertisement

తప్పక చదవండి

Advertisement