చేపచిలుక ఎగిరిపోయింది

Nandini Sidda Reddy Guest Column On Tribute To Devipriya - Sakshi

నివాళి

తెలుగు పలుకుబడి మీంచి చేపచిలుక ఎగిరిపోయింది. అది నీటిపుట్టలో ఈదులాడిన చేప కావచ్చు. అమ్మచెట్టు మీద వాలిన చిలుక కావచ్చు. ఈదటం, ఎగరటం, అలరించటం తెలిసిన చేప చిలుక అక్షర ప్రపంచం మీద అలిగి వెళ్ళిపోయింది. సర్దుబాటు చేసుకో లేని తత్వం, చిరుగాలి తాకిడికి చలించిపోయే సున్ని తత్వం, హృదయాల చుట్టూ ఆత్మీయంగా అల్లుకుపోయే అరుదైన వ్యక్తిత్వం, అక్షరాన్ని సకలావయవాలతో ప్రేమించే మనస్తత్వం, అన్నీ కలిస్తే దేవిప్రియ. అరుదైన పేరు. అరుదైన కవి. అంతేసమంగా పాత్రికేయుడు. గాలి రంగు గుర్తించిన కవి రంగులు వెదుక్కుంటూ తిరుమలగిరి స్వర్గవాటిక దగ్గరి గాలిలో కలిసి ఎగిరిపోయాడు. 

తనకు తొందరగా దగ్గరవటం తెలియదు. దగ్గరయితే ఎన్ని అసంతృప్తులున్నా దూరమవటం కూడా తెలియదు. డెబ్బయ్యో దశకం నడిమి కాలంలో పేరు వినటం. సిద్ది పేటలో ముగ్గురు మిత్రులం ‘దివిటి’ సంకలనం ఆవిష్క రణ కోసం శివారెడ్డిగారిని కలిశాము. నేనొక్కణ్ణే కాదు, నాతోపాటు దేవిప్రియను తీసుకొస్తాను, ఆయనే సభాధ్య క్షుడు అని ఆదేశించాడు. సిద్దిపేట బస్టాండులో మొదటి సారి ఆయన్ను చూడటం. మెల్లగా మాట్లాడినా గట్టిగా పట్టుకుంటాడు. మెత్తగా కనిపించినా కటువుగా పలుకు తుంటాడు. క్రమంగా ఒక భావంలా, ఒక వాక్యంలా, స్నేహంగా అల్లుకుపోతాడు. పేద రికం తెలిసిన కవి.  జీవితంలో ఎన్నెన్నో కలలు కన్న కవి. పుల్లా పుల్లా తెచ్చి గూడు అల్లుకున్న పిట్ట పనితనాన్ని ఇష్టపడే బాల్య మన స్తత్వం. పల్నాడు రోషం ఏదో లోలోపల ఇమిడే ఉంటుంది.

కృష్ణా తీరమే అయినా తడితాకక ఎండి పోయిన రాళ్ళూ రప్పల ప్రాంతం వినుకొండ బొల్లాపల్లిలో కన్నుతెర చిన మనిషి, తెలంగాణలో సంచ రించటం, బావి తవ్వితే బండ తప్ప నీళ్ళు పడని మా బందారం దాకా విస్తరించటం హృదయ బంధమే కదా– అది ఒడవని అక్షర బంధం కదా. మా ఊరికి రావట మేనా? మా కుటుంబం, మా బాపుతో, మంజీరా మిత్రులతో కలిసి వరిచేల గట్లమీద తిరుగాడే ఆత్మీయత దేవిప్రియ. మా బాపు ఆసుపత్రిలో మరణశయ్య మీద ఉన్నపుడు చలించి కవిత్వం రాసేటంత బంధమేదో తను అనుభవించేది. వాకిలి, ఇల్లు, మను షులు, చేలు, ఇసిరెలు, ఏవో ఇంకేవో దేవిప్రియ తలపుల్లో ఏ ఆరడిపెట్టాయో మా అవ్వ చనిపోయినప్పుడు ఆరోగ్యం సరిగా లేకున్నా వచ్చి కంటనీరు పెట్టుకున్నాడు. నీరులేని ప్రాంతాల, జీవితాల గోస తెలిసినవాడు కనుకనే నీటిని ప్రేమించాడు, మనసుల్ని ప్రేమించాడు, ఆయన కవిత్వమే నీటిపుట్ట. మంజీరా రచయితల సంఘంతో, కవుల్తో, కార్యకర్తలతో, మిత్రుల్తో అట్లా వాగులా కలిసిపోవటం ఆర్తి ఏదైనా మాకందరికీ స్ఫూర్తి. 

ప్రజాతంత్ర సంపాదకత్వం దేవిప్రియ జీవితంలో మరుపురాని మజిలీ. తర్వాత ఎన్ని పెద్ద పత్రికల్లో అయినా పనిచేసి ఉండవచ్చు, కొత్త  ఒరవడులు పెట్టి ఉండవచ్చు. ప్రజాతంత్ర ఎప్పటికీ గుర్తుండే ప్రయోగం. శ్రీశ్రీ ఆత్మకథ ‘అనంతం’ రచనకు కారణం దేవిప్రియే. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మిత్రులందరం వారం వారం ఇష్టంగా ఎదురుచూసేవారం. ప్రజాతంత్రలోనే అల్లం రాజయ్యను చదువుకున్నం. కంఠమనేని రాధాకృష్ణమూర్తి, శ్రీకంఠమూర్తి, సీహెచ్‌ మధు కథలు తిరిగి తిరిగి చదు వుకునేవాళ్లం. ఈవారం కవిత ఎప్పటికప్పుడు సంచల నమే. ఆ పేజీ ప్రత్యేకం చంద్ర బొమ్మలు, ప్రత్యేకమైన ఛాయాచిత్రాలు, అదొక గొప్ప అనుభవం. కవిత అందులో అచ్చుకావటానికి కల కనేవాళ్లం. ఏదో మేమేనా? సినారె లాంటి మహాకవులు కూడా ఆ పేజీ ప్రచురణ కోసం కలగనటం నాకు తెలుసు.

సినారెకు దేవిప్రియంటే చాలా ఇష్టముండేది. దేవిప్రియతో శివారెడ్డితో సాయంత్రాలు గుర్తుండే అనుభవాలు. కృష్ణా హోటల్‌ గార్డన్‌ రెస్టారెంట్‌లో సాయంత్రాలు సాహితీ మిత్రుల చర్చలు, పలవరింతలు వింటూ పరవశించేవాళ్లం. ‘అడివీ,  నువ్వంటే నాకిష్టం, విల్లనంబులు ఏరి ఉంచు ఏదో ఒకరోజు వాటినే ఆశ్ర యిస్తాను’. దేవిప్రియ కవిత ఎంత ఉత్సాహపర్చేదో? నిజమే– సూర్యుడు ఎప్పుడూ ఒకలాగే ఉండడు. అప్పుడ ప్పుడు వీపుమీద బరువులు మోసే హమాలీలా ఉంటాడు అని దేవిప్రియ ఊహిస్తే ఆలోచనేదో ఆశయమేదో విచ్చు కునేది. స్త్రీవాదం అంకురించకముందే కమలాదాస్‌ ఆత్మ కథ సీరియల్‌గా ప్రచురించి సంచలనం రేకెత్తించిన ప్రత్యే కత దేవిప్రియదే.  

‘కవిత్వాన్ని సామాన్యంగానూ, అసామాన్యంగానూ చెప్పగలవాడే కవి’ దేవిప్రియ ప్రకటించాడు. కవిత్వానికి వరదగుడి కంటే ఎక్కువ రంగులు వేయగలవాడే కవి అన్నాడు. దేవిప్రియ నమ్మినట్లుగానే సామాన్యంగా, అసా మాన్యంగా రాయగల నైపుణ్యం, సింగిడి కంటే ఎక్కువ రంగులు వేయగల కౌశలం ఆయన కవిత్వంలో గుర్తించ వచ్చు. ‘నాకు రెండు నిధులున్నాయి. నాలుక మీద కవిత్వం, తలమీద దారిద్య్రం. నాకు రెండు విధులు న్నాయి. కవిత్వ నిత్యనిబద్ధం, దారిద్య్ర విముక్తి యుద్ధం. అంత సామాన్యంగా, అసామాన్యంగా రాయటం దేవిప్రియకు ఇష్టం. పచ్చపచ్చటి ఉద్యానవనాల్లో సంచ రించినంత సుతారంగా వెచ్చ వెచ్చటి రక్త జలపాతాల సాహచ ర్యంలో  సేదతీరగలడు. పద్యం రాసిన ప్రతిసారీ ఇప్పటికీ భస్మమై మళ్లీ రూపొందే విద్య ఆయనకు బాగా తెలుసు. పదాల అర్థం, పదాల అందం, పదాల పదును సంపూర్ణంగా ఎరిగిన కవి.

పదం మీదే కాదు, పద్యం మీద ఆయనకు పట్టు ఎక్కువ. ఇన్షా అల్లాహ్‌ శతకం రాశాడు. సమాజానంద స్వామి చతురో క్తులు రాశాడు. ఆ రోజుల్లో ‘రన్నింగ్‌ కామెంటరీ’కి మాస్‌ ఫాలోయింగ్‌ ఉండేది. ఆటోవాలాల దగ్గరనుంచి అధికార రాజకీయ నేతల దాకా అభిమానం సంపాదించుకున్నాడు. హాస్యం, వ్యంగ్యం వైభవోపేతంగా పండించేవాడు. ‘కవి గారూ ఇలా రండి. మాటున్నది మీతో అర్థం కాకున్నది మీరు మానవులో కోతో’ అని చమక్కులు వేసేవాడు. ఎంత చమత్కారో కవిత్వం పట్ల అంత సీరియస్‌ తత్వం.
దేవిప్రియ కవిత్వంలో దుఃఖం, వేదన, సంఘర్షణ ఎంతో అంతకుమించి సౌందర్యం, స్వాప్నికత, తాత్వికత ఒదిగిపోయేవి.

ఇష్టం పుడితే ఏదైనా సాధించాల్సిందే. ప్రేమిస్తే ఏదైనా పంచాల్సిందే. తప్పనిసరయి ప్రతిరోజూ అవే దుస్తులు వేసుకుంటుంటే కొత్తబట్టలు పెట్టిన ప్రేమ దేవిప్రియ. వెనకాముందూ చూడకుండా చైనీస్‌ రెస్టారెంట్ల రుచి చూపించిందాయన అభిరుచి. ఇష్టంగా ప్రేమించాడు అంతే ఇష్టంగా కోపించాడు. అలాంటి ఇష్టంతోనే నాకొక వాక్యం తగిలించాడు. మందారం కనిపెంచిన బందారం అని. ప్రేమాస్పదుడు, అక్షరం మీద ప్రేమతో అంత రంగాలు శోధించిన కవి, ఆత్మీయుల అంతరంగాలు జయించిన కవి దేవిప్రియ అనుబంధాల్లో, అక్షరాల్లో, జ్ఞాపకాల్లో అమరుడై వెలుగుతుంటాడు.

వ్యాసకర్త
నందిని సిధారెడ్డి 
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top