ప్రజాభిమానానికి అధికార ముద్ర

Kommineni Srinivasa Rao Article On AP MPTC, ZPTC Election Results - Sakshi

విశ్లేషణ

పని చేస్తే ఫలితం దక్కుతుంది; ప్రజలు మెచ్చితే అన్ని కుట్రలూ వీగిపోతాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వెల్లడైన సరళమైన సత్యం ఇది. స్థానిక ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు జనం బ్రహ్మరథం పట్టడం దాన్నే తెలియజేస్తోంది. ఈ ఎన్నికలు చాలా కారణాల వల్ల చరిత్ర. జరగాల్సినవి జరగక పోవడం, జరగాల్సిన సమయంలో జరగకపోవడం, జరిగినట్టే జరిగి ఆగిపోవడం, జరిగినా వెంటే ఫలితాలు తెలియకపోవడం... ఎన్నికల చరిత్రలో ఇవి చెరిగిపోవాల్సిన పేజీలు. ఇన్ని జరిగినా నాలుగు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కనీవినీ ఎరుగని రీతిలో అధికార పార్టీ గెలవడం సువర్ణాక్షరాలతో రాయాల్సిన పుట. ఇది ప్రజాభిమానం వల్లే సాధ్యమైంది. చేస్తున్న పాలనకు వారి అధికార ముద్ర పడ్డందువల్లే సంభవమైంది.

ఉమ్మడి ఏపీ చరిత్రలో గానీ, విభజిత ఏపీలో గానీ ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికల అన్నిటిలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇది అధికార దుర్వినియోగంతోనో, మరో అక్రమంతోనో సాధ్యమయ్యేది కాదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో నలభై శాతం ఓట్లు వచ్చాయి. దానర్థం ఏమిటి? ఆయా చోట్ల అధికార పార్టీ ఏమైనా గొడవలు చేస్తే ఎదుర్కొనేవారు గణనీయంగానే ఉన్నా రన్నమాట. దానికి తోడు ఆయా వ్యవస్థల అండ ఎటూ ఉంది. అలాంటిది స్థానిక ఎన్నికలలో నిజంగా తెలుగుదేశంకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితే ఉంటే ఆ పార్టీ ఊరుకుంటుందా? టీడీపీ ఇక్కడ కూడా రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేసింది. ఒక పక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్క రించామని చెబుతూనే, వివిధ నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్య ర్థులకు బీఫారాలు ఇచ్చారు. 8 వేలకు పైగా ఎంపీటీసీలు వైసీపీ గెలిస్తే, 9 వందలకు పైగా టీడీపీ గెలిచింది. మరి పోటీలో ఉన్నట్లా, లేనట్లా? 

నామినేషన్లు వేసిన తర్వాత చాలాకాలం ఎన్నికలు జరగకుండా చేయడంలో టీడీపీ సఫలమైంది. ఏడాదిన్నరపాటు ఎన్నికల ప్రక్రియ నడిచిన సందర్భం దేశంలో ఇదొక్కటే కావచ్చు. కరోనా కేసులు లేన ప్పుడు ఎన్నికలను వాయిదా వేయించింది. ఆ తర్వాత కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో జడ్పీ, మండల ఎన్నికలను పక్కనబెట్టి గ్రామపంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ద్వారా పథకం అమలు చేయిం చింది. ఈ ఎన్నికలలో పూర్తిగా పరాజయం చెందడంతో కొత్త వ్యూహంలోకి వెళ్లారు. జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపకుండా ఆపు చేయించారు. చాలా చిత్రంగా నామినేషన్లు పూర్తయిన ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ నిర్వహించకపోవడం కూడా ఒక చరిత్రే. స్థానిక ఎన్నికలపై ఎవరైనా పరిశోధన చేయదలిస్తే, ఇవన్నీ ఆసక్తికర అధ్య యన అంశాలు అవుతాయి.

మధ్యలో ఏపీ ప్రభుత్వంపై ఎన్నికల కమిషనర్‌ చాలా దారుణ మైన లేఖను కేంద్రానికి రాయడం జరిగింది. నిజానికి ఈ లేఖ టీడీపీ ఆఫీసులో తయారైందని ఎక్కువ మంది నమ్మకం. మొదట ఆ లేఖతో తనకు సంబంధం లేదని చెప్పిన నిమ్మగడ్డ, ఆ తర్వాత కేసును సీఐడీ టేకప్‌ చేయడంతో టీడీపీని రక్షించడం కోసం తానే రాశానని చెప్పు కోవలసి వచ్చింది. అలాగే ఈ ఎన్నికలపై కోర్టులలో పడినన్ని వ్యాజ్యాలు బహుశా మరే ఎన్నికలపై పడి ఉండకపోవచ్చు. సింగిల్‌ బెంచ్‌ జడ్జీ ఎన్నికలు నిర్వహించవద్దని అనడం, డివిజన్‌ బెంచ్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, అయినా మళ్లీ సింగిల్‌ జడ్జీ ఈసారి ఎన్నికలనే రద్దు చేయడం, తిరిగి అప్పీల్‌లో డివిజన్‌ బెంచ్‌ నాలుగు న్నర నెలల సమయం తీసుకుని ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే స్థానిక ఎన్నికలు జాప్యం అయితే న్యాయస్థానాలు ప్రభుత్వాలను మందలిస్తుంటాయి. ఈసారి మాత్రం న్యాయ వ్యవస్థ వల్ల కూడా ఎన్నికలు జాప్యం అవడం మరో చిత్రం అని చెప్పాలి. 

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలకు కోడ్‌ అమలు చేసి, జడ్పీ, మండల ఎన్నికలకు అది వర్తింపచేయకుండా కోడ్‌ ఎత్తివేసి నిమ్మగడ్డ ఈ ఎన్నికలను వాయిదా వేయడమే కుట్రగా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల కమిషనర్‌ నీలం సహానీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇస్తే దానిని లిటిగేషన్‌గా మార్చాయి టీడీపీ, జనసేన. ఒక పక్క తాము ఎన్నికలను బహిష్కరించామని చెబుతూనే మరో పక్క ఎన్నికలను రద్దు చేయాలని టీడీపీ కోర్టుకు వెళ్లడం ఆశ్చర్యమే. 

నలభై శాతం ఓట్లు కలిగిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాడి వదలివేయడానికి కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్య మంత్రి జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు, అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా బలహీనవర్గాలకు చేరాయి. కులం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రయోజనాలు దక్కాయి. దాంతో టీడీపీకి చెందినవారు కూడా వైసీపీ వైపు మొగ్గుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వానికి పాజిటివ్‌ వేవ్‌ లేకుంటే చంద్రబాబుకు కంచుకోట వంటి కుప్పం నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలు, తొంభై శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలు వైసీపీ ఖాతాలోకి ఎలా వస్తాయి? ఇది కచ్చితంగా చంద్రబాబుకు అప్రతిష్టే. ఈ 32 ఏళ్లలో కుప్పంలో టీడీపీ తప్ప మరో పార్టీ గెలవ లేదు. గత ఎన్నికలలో 30 వేల మెజారిటీతో చంద్రబాబు గెలిచారు. పంచాయతీ ఎన్నికలలోనే వైసీపీ గెలుపుతో బిత్తరపోయిన చంద్ర బాబు, తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి వచ్చారు. అయినా జడ్పీ, మండల ఎన్నికలలో ఫలితం దక్కకపోవడం విశేషం. 

పంచాయతీ ఎన్నికలలో చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో టీడీపీ గెలిస్తే మీడియాలో అది పెద్ద వార్తగా ప్రచారం అయింది. కానీ ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలలో ఆ స్థానం వైసీపీకి దక్కింది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామా రావు స్వగ్రామం నిమ్మకూరును టీడీపీకి బలమైన గ్రామంగా భావి స్తారు. అక్కడ కూడా ఈసారి వైసీపీ గెలిచింది. మాజీ మంత్రి దేవినేని ఉమా ఇలాకాతో సహా అనేక చోట్ల టీడీపీకి ఒకటి, అరా తప్ప సీట్లు రాలేదు. గత నాలుగు దశాబ్దాలలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి విజయం నమోదు కాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జడ్పీ ఎన్నికలలో అధికార టీడీపీ పది జడ్పీలను మాత్రమే గెలుచుకుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పదింటిని, టీఆర్‌ఎస్‌ రెండింటిని కైవసం చేసుకుంది. మండలాల ఎన్నికలలో టీడీపీకి 482 దక్కితే, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 430, టీఆర్‌ఎస్‌కు 83 వచ్చాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు 19 జడ్పీలు, టీడీపీకి రెండు, టీఆర్‌ఎస్‌కు ఒకటి వచ్చాయి. మండల ఎన్నికలలో కాంగ్రెస్‌కు 620, టీడీపీకి 355, ఇతర పార్టీలు 45 గెలుచుకున్నాయి. అంటే వైఎస్‌ ఉన్నప్పుడు కూడా టీడీపీ తన ఉనికిని నిలబెట్టుకోగలిగింది. 2014లో టీడీపీ ఆధిక్యత ప్రదర్శించగలిగినా, వైసీపీ తన పట్టును గట్టిగానే ఉంచుకోగలిగింది. టీడీపీకి 372 జడ్పీటీసీలలో తొమ్మిది జడ్పీలు, వైసీపీ 271 జడ్పీటీసీ లతో మూడు జిల్లా పరిషత్‌లు కైవసం చేసుకున్నాయి. ఒక చోట ఇండిపెండెంట్‌ గెలిచారు. మండల పరిషత్‌లలో టీడీపీకి 386 వస్తే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 205 వచ్చాయి. 

కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. 12 కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరిగితే అన్నింటిలోనూ వైసీపీనే విజయం సాధించింది. 83 శాతం డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంటే, 11 శాతం డివిజన్లే టీడీపీకి వచ్చాయి.75 మున్సిపాలిటీలకు గానూ 74 వైసీపీ ఖాతాలో జమ య్యాయి. తాజాగా వెల్లడైన జడ్పీ, మండల ఎన్నికల ఫలితాలలో తొంభై శాతంపైగా వైసీపీకి రావడం టీడీపీకి జీర్ణం కాని విషయమే. ఇవన్నీ రికార్డులే. సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పార్టీకి కొంత మొగ్గుంటుంది. ఒక్క 2014లో కాంగ్రెస్‌ స్వయంకృతాపరాధం వల్ల పూర్తిగా నష్టపోయింది. అది వేరే విషయం. కానీ ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే– ఎనభై, తొంభై శాతం ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా రావడం; ప్రతిపక్ష టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం.

ఇదే సమయంలో ఒక విషయం కూడా హెచ్చరించాలి. స్థానిక ఎన్నికలలో ఇంత పెద్ద ఎత్తున గెలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌పై మరింత బాధ్యత పెరిగింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో ముందంజలోనే ఉన్నా, వచ్చే రెండున్నరేళ్లు పూర్తి అప్రమత్తంగా ఉండి, ప్రజలలో ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకోవలసి ఉంటుంది. ఏ చిన్న ఘటన జరిగినా చిలవలు పలవలు చేయగల సత్తా టీడీపీకి, ఆ పార్టీకి మద్దతిచ్చే మీడియాకు ఉంది. తిమ్మిని బమ్మిగా చేయగల నేర్పరులు వారు. తస్మాత్‌ జాగ్రత్త!


కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు     

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top