దళితులు శూద్రులే... విడగొట్టారంతే!

Kancha Ilaiah Guest Column On Dalits Are Shudras - Sakshi

మానవ చరిత్రలో ఒక్క భారతదేశంలోనే అత్యంత హేయమైన అంటరానితనం వేళ్లూనుకొని ఉంది. దాదాపు అన్ని మతాలూ మనుషుల మధ్య ప్రేమను ప్రోదిచేసి, ఇహపరమైన జీవితాన్ని సమానత్వం, సౌభాతృత్వం వంటి గొప్ప ఆదర్శాలతో ఆనందమయం చేసుకోవడానికి మార్గాలు చూపించినవే. కానీ హిందు మతం మాత్రం అంటరానితనం ప్రాతిపదికన భారతీయ సమాజంలో అసమానతలకు బీజం వేసి కొనసాగేలా ఆంక్షలు విధించడం.. విడ్డూరమేకాదు అమానవీయం కూడా. ఒకప్పుడు శూద్రుల్లో భాగంగా ఉన్న దళితులను వారి నుంచి వేరుచేసిన వైనం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.

దళితులు చారిత్రక శూద్రులు. ఆర్యులకంటే ముందు క్రీ.పూ. 3000 నాటికే  వ్యవ సాయ–పట్టణ నాగరికతను అభివృద్ధి చేసు కున్న హరప్పా ప్రజా సమూహంలో వారూ భాగంగా ఉన్నారు. కానీ ఇంత ఆధునిక రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకు తున్నప్పటికీ, ద్విజులతో పాటు శూద్రులు కూడా వారిని అంటరాని వారుగా చూస్తున్నారు. మనకు గొప్ప ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్‌ ఒక దళితుడనే ఎరుక భారతీయుల్లో కనిపిం చడం లేదు. అంబేడ్కర్‌ తనను తాను విముక్తి గావించుకొని, కులము, అంటరానితనం లేని ‘భారతదేశం అనే ఆలోచన’కు రూపమిచ్చాడు. అయితే ఇది సాకారం కావాలంటే, తమ సాటి ఉత్పాదక శూద్రులైన దళితులు తమ నుంచి ఎలా వెలికి గురయ్యారనే సంగతిని శూద్రులు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ విభజన సృష్టించడం ద్వారా ద్విజులు.. తమ ఇరువురిపైనా ఎంత పటిష్టమైన నియంత్రణ కలిగి ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి. 
 
దళితులను శూద్రుల నుంచి వేరుచేసి వారికి ప్రతికూల ఆధ్యా త్మిక భావజాలాన్ని ఆపాదించింది బ్రాహ్మణవాదం. అది ఇప్పటికీ కొనసాగుతున్న ఒక మూఢ నమ్మకం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత మొత్తం జనాభాలో శూద్రులు 52 శాతం ఉన్నారు. దళితులు 16.6 శాతం ఉన్నారు. బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖత్రీలు,  వంటి వారందరూ కలిసి దాదాపు 5 శాతం మాత్రమే ఉన్నా. తమకన్నా అధిక సంఖ్యలో ఉన్న దళితులను వీరు ఆధునిక అంటరాని బానిసలను  చేశారు. 2011 జనగణన ప్రకారం మొత్తం జనాభాలో హిందువులు 79.8 శాతం ఉన్నారు. శూద్రులు/ఓబీసీలు, ద్విజులు కచ్చితంగా ఎంతమంది ఉన్నారన్న సంగతి భవిష్యత్తులో కులాలవారీ జనాభా గణన చేసినప్పుడే తెలుస్తుంది. ప్రస్తుతం అనుకుంటున్న సంఖ్యలు గాలిలో రాతల లాంటివే. చర్రితను పరిశీలించినప్పుడు, కుల విభేదాలు భారత అభివృద్ధిపై చాలా ప్రతికూల ప్రభావం కలిగి ఉన్నాయనేది స్పష్టమవుతుంది. క్రీ.పూ. 1500 ప్రాంతంలో బ్రాహ్మ ణుల ఆధ్యాత్మిక గ్రంథంగా రుగ్వేదాన్ని రాయడంతో అసలు సమస్య ప్రారంభమైంది. ఆహార అనుత్పాదక వర్గాలవారు హరప్పా నాగరికత నిర్మాతలను శాశ్వతంగా తమ బానిసలుగా చేసుకున్నారు. వారు మొదట్లో ఈ బానిసలను అంటదగిన, అంటరానివారుగా; ఆ తర్వాత అనేక కులాలుగా విభజించారు. 

అంటరానితనం అనే సామాజిక జాడ్యం రుగ్వేదకాలంలో  లేనే లేదనిపిస్తుంది. ఎక్కడా దాని ప్రస్తావన కనిపించదు. నాలుగు వర్ణాల్లో చిట్టచివరిదైన శూద్ర వర్ణం వారు మిగిలిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి అన్ని రకాల సేవలూ అందిస్తూ సేవించాలి. దీన్నిబట్టి అంటరానివారుగా భావిస్తున్న పంచములు మొదట్లో శూద్రులలో భాగంగా ఉండేవారని అర్థమవుతుంది. జంతు చర్మాలు, వాటితో తయారు చేసిన వస్తువులు అపవిత్రమైనవి (అంటరానివి)గా బ్రాహ్మ ణవాదం ప్రçకటించిన తర్వాతే తోళ్లతో సంబంధం ఉన్న శూద్రు లందరినీ అంటరానివారుగా పరిగణించారని అనిపిస్తుంది. వేద కాలపు ప్రజల ప్రధాన వృత్తి పశుపోషణ అయినప్పటికీ తోళ్ల పరిశ్రమ కూడా వారి ఆర్థిక జీవనంలో ఒక భాగమే అని చెప్పవచ్చు. వేదకాలపు పశుపోషణ ఆర్థిక వ్యవస్థను పోలిన ప్రస్తుత ఆదివాసీ వ్యవస్థలను పరిశీలిస్తే అందుకు సంబంధించిన సాక్ష్యాలు లభిస్తాయి.

దట్టమైన అరణ్యాల్లో ఉన్న మనకాలపు ఆదివాసీ సమాజాల్లో కూడా వృత్తుల ప్రత్యేకీకరణ కనిపిస్తుంది. అక్కడా వేటాడటం, చర్మా లను సేకరించడం, ఆ చర్మాల నుంచి రకరకాల తాళ్లు, బ్యాగులు, ఇతర వ్యవసాయ పనిముట్లు తయారు చేయడం కనిపిస్తుంది. కానీ ఆ ఆదివాసీ సమాజాల్లో ఈ తోళ్లతో సంబంధం ఉన్న పనివారిని అంట రానివారుగా పరిగణించకపోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాల అభివృద్ధి క్రమంలో అతి సహజంగా కనిపించే దృశ్యం ఇది. కానీ భారత దేశంలో బ్రాహ్మణవాదం మానవుల్లో బానిసత్వం కన్నా ఘోరమైన అంటరానితనం అనే కొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టింది.

అంటరానితనానికి గీటురాయి తోలు 
ఆధునిక భారతం అంతటా తోళ్ల పరిశ్రమ మొత్తం దళితుల పరి శ్రమగా ఉంది. ఇందులో పనిచేసేవారందరూ దళితులే. గ్రామీణ భారతావనిలో తోలు పని.. శూద్రులు, దళితులకు మధ్య అంటరాని తనానికి గీటురాయిగా ఉంది. అయితే ఇస్లాం రాకతో అందులోకి మారినవారు కుల పరమైన గుర్తింపు లేకుండానే తోలు పరిశ్రమలో భాగమయ్యారనుకోండి. ఇతర వెనుకబడిన తరగతులవారు, ద్విజులు ఎవరూ తోలు పరిశ్రమలో పనిచేయడం లేదు.

అయితే ఏ దశలో తోలుపని అంటరానిదానిగా మారిందనేది స్పష్టంగా తెలియదు.   శూద్రుల ఆచార వ్యవహారాల్లో కొత్తగా కులాల ప్రాతిపదికన బ్రాహ్మణ కర్మకాండలను బ్రాహ్మణవాదం ప్రవేశ పెట్టింది. తోలు అపవిత్రం, దానికి సంబంధించిన పని కలుషిత మైనదని ఈవాదం వారి బుర్రల్లో చొప్పించింది. ఫలితంగా అంటరాని తనం పాదుకుంది. కర్మకాండలు మూఢనమ్మకాలుగా మారి పోయాయి. ఇందుకు వేలాది సంవత్సరాల కాలం పట్టింది. అందుకే బ్రాహ్మణవాదం ఒక మతం కాదు. అది ఒక మూఢ నమ్మకం.
పరంపరగా వస్తున్న బ్రాహ్మణ వాదం ఆధారంగా పనిచేసే ఆర్‌ఎస్‌ఎస్‌/బీజేపీ శ్రేణులకు అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఎజెండా లేదు. దళిత, శూద్ర తత్వవేత్తలు కలిసి కూర్చొని భారత చర్రితను జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంటరానివారు, అంటదగినవారి మధ్య ఉండే సంబంధం శాశ్వత మానవ సంబంధం కాదు. ఈ అమానవీయ సంబంధాన్ని నాశనం చేయడానికి నడుం బిగిస్తే తప్పనిసరిగా ఈ భూమిపై నుంచి అది మాయమవుతుంది.

బ్రాహ్మణ వాద సాహిత్యానికి చెందిన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాల్లో అంటరానితనానికి ఎటువంటి పరిష్కారం లేదు. అసలు సమస్యను సృష్టించిందే ఈ సాహిత్యం కాబట్టి పరిష్కార మార్గాలు అందులో ఎందుకుంటాయి? ఇవ్వాళ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు బ్రాహ్మణ వాద గ్రంథాలన్నీ శూద్రులు, దళితుల అసలైన సంస్కృతిని నిక్షిప్తం చేశాయని, వాటిని అనుసరించాలని, వాళ్లంతా తమవారేనని.. తమ రాజకీయ ప్రాపగాండాలో భాగంగా ప్రచారం చేస్తున్నాయి. నిజానికి భారత దేశంలో తప్ప, ప్రపంచంలోని ఏ మత గ్రంథం కూడా ప్రజ లను కులాలుగా విభజించి అమానవీయమైన అంటరానితనాన్ని ప్రబోధించలేదు.

తోలుపై రాయడాన్ని ఎందుకు నిరాకరించినట్లు?
భారతదేశంలో తోలుతో సంబంధం ఉన్న వారందరినీ అంటరాని వారిగా చిత్రించిన బ్రాహ్మణీయ వ్యవస్థ, చివరికి తోళ్లను రాత సాధనంగానూ ఉపయోగించడానికి నిరాకరించింది. తోలుకు అపవ్రి తతను ఆపాదించిన బ్రాహ్మణవాదులు తొందరగా పాడైపోయే తాళ పత్రాలపై రాసేవారు.  దీంతో మన ప్రాచీన జీవనానికి సంబంధించిన ఎంతో సమాచారాన్ని కోల్పోయాం. ప్రాచీన ప్రపంచంలో మొదటగా బైబిల్ని లిఖించింది సాపుచేసిన చర్మం మీదే. అలాగే గ్రీకు తత్వ వేత్తలు, ఈజిప్టు వాసులూ తోలుపైనే రాశారు. కన్ఫ్యూసియస్‌ వంటి చైనా తత్వవేత్తలు కూడా చర్మంపైనే తమ రచనలు చేశారు. టావో మతం చర్మంపై రాసిన రచనల ఆధారంగానే ఉనికిలోకి వచ్చింది. సమకాలీన ప్రాచీన ప్రపంచంలో భారతీయులు తప్ప వేరే ఎవరూ తాళపత్రాలను రాతకోసం ఉపయోగించలేదు. 

పోనీ దేశంలో తోలు పరిశ్రమలో ఉన్నవారన్నా చర్మంపై రాశారా అంటే అదీ లేదు. ఇందుకు కూడా నిందించవలసింది బ్రాహ్మణ వాదు లనే. ఎందుకంటే దళితులు, శూద్రుల చదువుపై నిషేధం విధించింది వారే గనుక. మానవుల మధ్య అసమానత్వాన్ని సృష్టించడానికి దైవత్వ భావాలను సాధనాలుగా ఉపయోగించడం వల్ల ప్రజల్లో ఉత్పాదకతా సామర్థ్యం దెబ్బతింటుంది. సరిగ్గా భారత దేశంలో జరి గిందీ ఇదే. ఈ బ్రాహ్మణీయ భావజాలం వల్ల కేవలం దళితులే కాదు శూద్రులు కూడా తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఉత్పాదక శక్తులు బాగా బలహీనమయ్యాయి. ఇతర శక్తులు భారతదేశంలో జోక్యం చేసుకుని ఉండకపోతే ఇండియా మరింతగా వెనకబడిపోయి ఉండేది.

విశ్లేషకులు

ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top