ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో నయా దోపిడీ

Julakanti Rangareddy Critics On LRS Scheme In Telangana - Sakshi

సందర్భం

రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లు, అందులోని ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయడానికి లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసింది. జీవో 131, జీవో 135. వీటి ప్రకారం 2020 ఆగస్టు 26 వరకూ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్స్‌ కల్గి ఉన్న యజమానులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. ప్రస్తుతమున్న అనుమతుల్లేని లేఅవుట్‌ వెంచర్లన్నీ తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. గ్రామకంఠం భూములకు ఇది వర్తించదు. వ్యక్తిగత ప్లాట్‌ యజమాని వెయ్యి ఫీజుతో, లేఅవుట్‌ వెంచర్‌ యజమాని రూ.10 వేలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి అక్టోబర్‌ 15లోగా దరఖాస్తు నమోదు చేసుకోవాలి. 

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల అనధికార ప్లాట్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ 16 లక్షల మంది అప్లై చేసుకుంటే వచ్చే ఫీజుతోనే సుమారు రూ.160 కోట్ల ఆదాయం వస్తుంది. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు 2021 జనవరి 31 వరకూ ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకున్నట్లయితే 16 లక్షల ప్లాట్లకు గాను ఒక్కో దానికి సుమారు రూ.50 వేల చొప్పున వేసుకున్నా, రూ. 8 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశముంది. 
(చదవండి: ఎల్‌ఆర్‌ఎస్‌: ‘3 లక్షల కోట్లు దండుకోవాలని చూస్తోంది’)

ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతోంది. చిన్న చిన్న ప్లాట్లు కల్గిన వారిలో 80 శాతం మంది పేద, మధ్యతరగతి వారే ఉన్నారు. అసలే కరోనా లాక్‌డౌన్‌తో అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన దయనీయమైన స్థితిలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చి నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి కొంత నగదు ఇచ్చి బియ్యం పంపిణీ చేయడంతో పాటు, ఇంటి అద్దెలను సైతం కట్టొద్దని చెప్పిన ముఖ్యమంత్రి నేడు వేల కోట్ల రూపాయలు ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో వసూలు చేయడానికి పూనుకోవడం దుర్మార్గమైన చర్య. ప్రస్తుతమున్న ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్‌ఆర్‌ఎస్‌ చేయిం చుకోకపోతే వాటిని అమ్మాలన్నా, వాటిలో నిర్మాణాలు చేపట్టాలన్నా అనుమతి ఉండదని; మంచినీటి కనెక్షన్, డ్రైనేజీ ఏర్పాటు, రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ఏ విధమైన రిజిస్ట్రేషన్‌ జరగవని చెప్పడం– పరోక్షంగా ప్రజలను ప్రభుత్వం బెదిరించి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగానే కన్పిస్తోంది.

లేఅవుట్లలో ఎక్కువ వరకూ 200–250 గజాల ప్లాట్లు ఉంటాయి. ఇప్పుడు రోడ్లు విస్తరించే క్రమంలో ఆ ప్లాట్ల విస్తీర్ణం తగ్గిపోతోంది. రెండు వైపులా రోడ్ల ప్లాటు అయితే హక్కుదారులకు ఏమీ మిగలడం లేదు. అయినా వారి నుంచి కూడా మొత్తం ప్లాట్ల విస్తీర్ణానికి చార్జీలు వసూలు చేస్తున్నారు. పోయిన విస్తీర్ణానికి నష్టపరిహారం ఇవ్వడం లేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక 2015లో ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చింది. అక్రమ లేఅవుట్లు, అనధికార ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. ఆ సమయంలో దరఖాస్తు రూపంలో రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించకుండానే మూలన పడేశారు. తిరిగి నేడు మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోవాలంటూ కొత్త జీవో తేవడంతో గతంలో కట్టిన డీడీల మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 
(చదవండి: సారూ.. మాకేది మోక్షం!)

కేంద్రం నుంచి జీఎస్టీ రాష్ట్ర పన్నుల వాటాగా రూ.8 వేల కోట్లు రావాలని చెబుతున్నారు. పదే పదే అడిగినా ఇవ్వడం లేదని, కరోనా వైరస్‌ కట్టడి చేయడానికి కూడా ఆర్థిక సాయమందించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దేవుడితో పోరాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రంతో ఎందుకు పోరాడి నిధులు రాబట్టలేకపోతున్నారో ప్రజలకు తెలియజేయాలి. కేంద్రంతో పోరాడే దమ్ము లేకనే పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు.

వాస్తవంగా రిజిస్ట్రేషన్‌ చట్ట ప్రకారం నిషేధాస్తులు తప్ప ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడం ఏమాత్రం ఆపకూడదు. కానీ ఆగస్టు నెల చివరి నుంచి రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేయడం చట్టవిరుద్ధం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఆరేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ ఎందుకు అనుమతి లేని ప్లాట్లు, లేఅవుట్లకు రిజిస్ట్రేషన్‌ చేయనిచ్చారు? కొన్ని ప్లాట్లు, వెంచర్లలో భవన నిర్మాణాలు సైతం జరిగాయి. ఇన్ని ఏళ్ల కాలంలో ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ గుర్తు రాలేదా? ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నప్పుడు ఏకపక్షంగా ఆర్థికభారం మోపడం తగదు. తక్షణమే జీవో 131, 135లను రద్దుచేయాలి.
వ్యాసకర్త: జూలకంటి రంగారెడ్డి, మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top