బ్లూ ఎకానమీ గురించి మాట్లాడరా?

Johnson choragudi Explained Article On The Blue Economy - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తన ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ ఆగస్టు 15న వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి – ‘అంటరానితనం’ అనే పదాన్ని తన అధికారిక ప్రసంగంలో ప్రస్తావించి, అనూహ్యంగా మరోసారి పరిశీలకుల దృష్టిని తన వైపుకు తిప్పు కున్నారు. ప్రగతిశీల వాదులు సైతం – ఇంకా అదెక్కడ ఉందంటూ కనిపిస్తున్న దాన్ని – ‘కార్పెట్‌’ కిందికి తోస్తుంటే; అదేమీ కాదని జగన్‌ పని మాల– ‘అంటరానితనం’ ప్రస్తావనను అధికారిక వేదికపై తెచ్చారు. దాంతో ఇంతకూ అదిప్పుడు ఉందా లేదా? ఉంటే ఏమిటి? అనే చర్చను మన ముందుకు తెచ్చారు. ఇక ఇప్పుడు కార్య సాధకులు కనుక ఎవరైనా ఉంటే వారు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను అబద్ధం చేసే పని చేపట్టవచ్చు.   సీఎం మాటల్లోనే అది– ‘ఈ నాలుగేళ్ల పాలనలోనే, రూపం మార్చుకున్న అంటరానితనం మీద, పేద వర్గాలను అణచి వేస్తున్న ధోరణుల మీద యుద్ధాన్ని ప్రకటించాం.

 అంటరాని తనం అంటే, ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోటానికి వీల్లేదని దూరం పెట్టటం మాత్రమే కాదు, పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్న మెంట్‌ బడిని పాడుపెట్టటం, పేదలు ఏ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారో ఆ ఉచిత సేవలు వారికి అందకుండా ఖరీదు చేయటం, పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం, పేదలు కోరుకునే చిన్నపాటి ఇళ్ళ స్థలాన్నీ ఇంటినీ వారికి ఇవ్వకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం... ఇవన్నీ రూపం మార్చుకున్న అంటరానితనంలో పేదల మీద పెత్తందారీ భావజాలంలో భాగాలే. పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడేవరకూ ఇటువంటి అంటరానితనం మీద ఈ యుద్ధం కొనసాగుతుంది.’ ఇలా సాగింది ఆ సందేశం. ఈ సందేశం– ‘గ్రామర్‌’ ఏమై ఉంటుంది అని చూసి నప్పుడు, సీఎంగా తన రెండవ టర్మ్‌లో చేపట్టబోయే కార్యా చరణకు జగన్‌ తొమ్మిది నెలలు ముందుగానే ‘సామాజిక వాతావరణ’ ముందస్తు హెచ్చరికను జారీ చేశారేమోనని అనిపిస్తున్నది. 

అయితే, విమర్శకులు అనొచ్చు, ఎన్నికల ముందు రాజ కీయ నాయకులు ఇలా కాకుండా మరెలా మాట్లాడతారు? అని. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పైకి కనిపించకుండా అమలవుతున్నసాంఘిక వివక్షను ఎదుర్కోవడానికి ఈ ప్రభుత్వం చేపడుతున్న చర్యల ప్రతిఫలానాలు – ‘నీతి అయోగ్‌’ వంటి స్వతంత్ర ప్రతి పత్తిగల సంస్థలు సైతం వెల్లడిస్తున్న నివేదికల్లో చూడవచ్చు. పైకి కనిపించని సూక్ష్మం అనిపించే ఇటువంటి అంతర్గత అంతరాన్ని ఈ ప్రభుత్వం పట్టుకుంది. దాని మీద అది ’ఫోకస్‌’ వేసి తగు నివారణా చర్యలు మొదలుపెట్టింది. అయితే, ఈదృష్టికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అది – రెండు వందల ఏళ్ళపాటు ఈ సర్కారు జిల్లాలు బ్రిటిష్‌ పాలనలో ఉండడం. దాంతో – ’మిషన్‌ అప్రోచ్‌’తో ప్రజల వద్దకు వెళితే వాళ్ళతో ‘కనెక్ట్‌’ కావడం కష్టం కాదు అని నమ్మి, దాన్ని– సర్కారే కాదు, నైజాం జిల్లాల్లో కూడా అమలుచేసి; అవును నిజమే అని నిరూపించినవాడు వైఎస్సార్‌. దానికి కొనసాగింపుగా ఈ చారిత్రక నేపథ్యాన్ని – ‘నాయకుడు’గా తననుతాను ‘ప్రూవ్‌’ చేసుకోవడానికి జగన్‌ గరిష్ఠ స్థాయిలో వాడుకోవడం వెలుగులోకి రాని అంశం. 

ఇప్పటికి మూడేళ్ళ క్రితమే తమ పార్టీ శ్రేణుల సమావేశంలో జగన్మోహన్‌ రెడ్డి నోటినుంచి– ‘అవుట్‌ రీచ్‌’ అనే పదం రావడం; ‘మిషన్‌ అప్రోచ్‌’కి కొనసాగింపుగా ఇక్కడ గుర్తుచేసుకోవడం అవసరం. ఇటీవల – ‘సోషల్‌ ఇంజనీరింగ్‌’ వంటి పదాలను పొలిటి కల్‌ సర్కిల్స్‌లో దేశమంతా విరివిగా వాడుతున్నారు. అయితే, జగన్‌ విషయంలో దాన్ని ఆలా చూడడం కుదరడం లేదు.అందుకు కారణం – ఆయనలా గతంలో సామాజిక దొంతర్ల పొరల్లోకి ఛేదించుకుంటూ లోపలికి వెళ్లినవారు మనకు కనిపించరు. ఆర్థిక ప్రయోజనాలు అందే పథకాలు అంటే సరే, కానీ ‘పవర్‌ పాలిటిక్స్‌’లోకి వచ్చే కొత్త సామాజిక వర్గాలకు– ‘లెవెల్‌ ప్లేగ్రౌండ్‌’ గతంలో ఎక్కడిది? ప్రముఖ తెలుగు నవల ’మాలపల్లి’ (1922) లో రచయిత ఉన్నవ లక్ష్మినారాయణ ప్రతిపాదించిన ‘నిమ్న వర్గాల రాజకీయ నాయకత్వాని’కి, ఇది 21వ శతాబ్ది ’వెర్షనా’ అన్నట్టుగా... కొత్త ఆశలు ఇక్కడ కనిపిస్తున్నాయి.

 కొందరికి అది పొసగకపోవడం అంటారా, అది వేరే విషయం.సంక్షేమం సరే, ‘అభివృద్ధి’ ఏది? అనేది ఈ ప్రభుత్వం వైపు వేలు చూపించేవారి అతి తేలికైన ప్రశ్న. ఈ ప్రశ్న తర్వాత వెంటనే వీరు – ‘హైదరాబాద్‌’ అంటారు. ఇక్కడి సంపన్న జిల్లాల సొమ్ము అక్కడ అనుత్పాదక రంగాల్లో పెట్టుబడులై, జరిగిన – అర్బన్‌ ‘అభివృద్ధి’ నమూనా ఇప్పుడు ఇక్కడ వద్దా? అనేది వీరి ప్రశ్న. కనీస భౌగోళిక వాస్తవిక స్పృహ లేని వాదనలివి. రాష్ట్ర విభజన జరిగాక, 2014–19 మధ్య– ‘సన్‌ రైజ్‌ స్టేట్‌’ అంటూ తీరాన్ని ‘బ్రాండింగ్‌’ చేస్తూ, ‘కార్పొరేట్‌’ తరహా ‘పబ్లిసిటీ’కి దాన్ని పరిమితం చేయడం మాత్రమే జరిగింది తప్ప; అప్పట్లోనే ఆ సూర్యోదయ తూర్పుచూపుతో ప్రణాళికా రచన మొదల యివుంటే, ఇప్పటికి పరిస్థితి మరోలా  ఉండేది.

 సముద్రతీర రాష్ట్రానికి ‘బ్లూ ఎకానమీ’ లక్ష్యంగా విశాఖ పట్టణం కేంద్రిత చూపు కాకుండా, ఇంకా హైదరాబాద్‌ అంటూ పాతపాట ఏమిటి? అనే ఇంగితం పదేళ్ల తర్వాత కూడా ఈ విమర్శకులకు తట్టకపోవడం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 15,375 కోట్లతో– రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌ వే పోర్టులు; రూ. 3,521 కోట్లతో తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణం త్వరితగతిన పూర్తి అవుతున్నాయని వీరికి పట్టదు. కారణం ఇక్కడ కూడా వివక్షే. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లలో ఉపాధి అనేసరికి వీటిలో సంపన్న వర్గాల యువతకంటే, దిగువ మధ్య తరగతి యువత ఉపాధికి జరిగే ప్రయో జనం ఎక్కువ. వీటి గురించి మాట్లాడకుండా ఉండడం అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తిరస్కరిస్తున్నట్టే!
 


జాన్‌సన్‌ చోరగుడి
వ్యాసకర్త సామాజిక, అభివృద్ధి అంశాల విశ్లేషకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top