మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి!

Demand For National Festival Status For Medaram Jatara - Sakshi

సందర్భం 

ఆదివాసీ అస్తిత్వం మేడారం జాతర. వారి పోరాటానికి చిహ్నం. అది జాతర కాదు, ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక. గిరిజన స్వయంపాలనకు దిక్సూచి అయిన మేడారం జాతర మొదలైంది. అమ్మతల్లుల జాతరలో ఆదివాసులే కాదు, సకల జనులూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు. జాతర నాలుగు రోజులూ... సత్తెంగల సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లిస్తూ... సంప్రదాయ వంటకాలను నైవేద్యంగా పెడుతూ... మరో లోకాన్ని సృష్టిస్తారు. ఇటువంటి జనజాతరకు ఎప్పటి నుంచో జాతీయ హోదా కల్పించాలని భక్తులూ, రాష్ట్రప్రభుత్వం ఎన్నో రోజుల నుంచి కోరుతున్నది. కానీ ఆ కల ఇంకా నెరవేరనేలేదు. 

దేశంలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర రానేవచ్చింది. నేటి నుంచి ఫిబ్రవరి 19 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో... వివిధ రకాల పూజా ప్రక్రియలు, ఆదివాసుల ప్రత్యేక వస్త్ర ధారణ వంటి అంశాలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. ములుగు జిల్లా, తాడ్వాయి మండలం... మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన ఈ వేడుకకు జాతీయ హోదా ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి ఇప్పటి వరకు చాలాసార్లు ప్రతిపాదనలు వెళ్ళినా ఇంతవరకు అది సాకారం కాలేదు.

స్థానిక ఆదివాసీల నమ్మకం ప్రకారం... సమ్మక్కను కోయల్లో చందా వంశస్థుల ఆడపడుచుగా భావిస్తారు. ఆమె బయ్యక్కపేటలో జన్మించింది. ఈడు వచ్చే కొలది ఆమె తాను ఇంటిలో ఉండలేనని, విడిగా ఉంటానని చెబుతూ వచ్చింది. చివరికి అక్కడి దట్టమైన అడవుల్లో ఉన్న ఒక కొండపైకి వెళ్లి దాన్నే తన నివాస స్థలంగా ఏర్పాటు చేసుకుందని స్థానికులు చెబుతారు. సమ్మక్క కొండ దిగి వచ్చి రోజూ స్నానం చేసే ఒక కొలను కూడా కొండ దగ్గరలో ఉందనీ, దాన్ని ‘జలకం బావి’ అని పిలుస్తామని వాళ్లు చెబుతున్నారు. మొదటలో బయ్యక్క పేటలోనే సమ్మక్క జాతర జరిగేది. కొన్ని కారణాల వల్ల అది మేడారానికి మారింది. 

మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో మొదలయ్యే సమ్మక్క జాతర నాలుగు రోజులు జరుగుతుంది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకువస్తారు. రెండవ రోజున మేడారం సమీపం లోని చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకొస్తారు. మూడో రోజు అమ్మవార్లకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. తమ కోరికలు తీర్చమని భక్తులు బెల్లం (బంగారం)ను నైవేద్యంగా సమర్పించుకుంటారు. నాలుగవ రోజు పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయిస్తారు. అంటే వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి భక్తి శ్రద్ధలతో మళ్లీ ఆదివాసీ కోయలు చేరుస్తారు. ఇలా దీంతో జాతర ముగుస్తుంది.

ఎంతో చరిత్ర, నేపథ్యం కలిగిన సమ్మక్క–సారలమ్మ జాతరను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2014లో ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా జాతర జరుపుతున్నది. ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 332.71 కోట్ల నిధులను కేటా యించింది. ఈ ఏడాది రూ.75 కోట్ల నిధులు కేటాయించి రవాణా, త్రాగునీరు, భద్రతా చర్యలు వైద్య సదుపాయాలు తదితర సదుపాయాల కోసం 21 ప్రభుత్వ శాఖలకు నిధులు కేటాయించింది. (చదవండి: పరాయీకరణ దిశలో మేడారం జాతర)

రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆరు ప్రధాన రహదారుల ద్వారా ఈ జాతరకు 1 కోటి 30 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక మంది భక్తులు హాజరయ్యే పండుగ ఇది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఈ) ద్వారా జాతరకు ఎంత మంది వచ్చారో 99 శాతం కచ్చితత్వంతో తెలుసుకుంటారు. దేశంలో ఏ ఉత్సవంలోనూ వినియోగించని విధంగా కృత్రిమ మేథా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా, తొక్కిసలాట జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఏర్పాట్లు చేస్తుంది. 

ఇంతటి చరిత్ర, నేపథ్యం కలిగిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రతిపాదన చేసి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత జాతరలో ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్‌ ముండా ఈ మహా జాతర ప్రాముఖ్యత గురించి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి జాతీయ హోదా ఇప్పిస్తానని వాగ్దానం  చేశారు. కానీ అది మాటలకే పరిమితమైంది కానీ చేతలకు నోచుకోలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ మహా జాతరకు జాతీయ హోదా కల్పించి నిధులు విడుదల చేస్తే జాతర ప్రాశస్త్యాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. ఆ తర్వాత యునెస్కో గుర్తింపునకూ మర్గం సుగమం అవుతుంది.

- అంకం నరేశ్‌
వ్యాసకర్త ఉపాధ్యాయుడు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top