ప్లాస్టిక్‌ అడ్రెస్ | Sakshi Funday Special Story: School uniforms made from 70 Percentage plastic | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ అడ్రెస్

May 3 2026 12:16 AM | Updated on May 3 2026 12:16 AM

Sakshi Funday Special Story: School uniforms made from 70 Percentage plastic

ప్లాస్టిక్‌ లేకుండా మన రోజువారీ జీవితం సాగని పరిస్థితి వచ్చేసింది. ఈ ప్లాస్టిక్‌ మన ఇంట్లోకే కాదు ఇప్పుడు ఒంటి మీదకు వచ్చేసింది. సౌకర్యం కోసం ఎంచుకున్న దుస్తులు– అనారోగ్య సమస్యలను ‘కొని’ తెస్తున్నాయి. ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ఇవి త్వరగా చెడిపోక వ్యర్థాలుగా పేరుకుపోయి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.

మీ పిల్లల్ని కొత్త స్కూల్లో చేర్చారా? మీ పిల్లలు వాడుతున్న యూనిఫామ్‌లు సరిపోవడం లేదా? అయితే ఈ ఏడాది మరో యూనిఫామ్‌ కొనాల్సిందే! కొనడం సరే, అసలు పిల్లలు వాడుతున్న యూనిఫామ్‌లు ఆరోగ్యకరమేనా? పర్యావరణ హితమేనా? పాత యూనిఫామ్స్‌ సంగతేంటి? వాటిని ఏం చేస్తున్నాం?  వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించామా? 

ఈ ప్రశ్నలు సాధారణంగా మనం వేసుకోం. ఎందుకంటే యూనిఫామ్‌ తప్పనిసరి అవసరం. ఏడాదికో జత మార్చేదే కదా? అది అందుబాటు ధరలో లభిస్తే సరిపోతుంది అని భావిస్తాం కాని, ఈ యూనిఫామ్‌ వెనుక అనేక వాస్తవాలు దాగి ఉన్నాయి.

మన దేశంలో సుమారు 24 కోట్లకు పైగా విద్యార్థులు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ ఏడాదికి తమ యూనిఫామ్‌లోని ఒక షర్టు వాడకుండా పక్కన పడేస్తే, దాదాపు 32,000 టన్నుల వ్యర్థాలు పోగుపడతాయి. యూనిఫామ్‌ షర్టులు ఎక్కువగా పాలిస్టర్‌తో తయారవుతాయి. ఒక కిలో పాలిస్టర్‌ తయారీకి సుమారుగా 62 లీటర్ల నీరు అవసరం. 1.53 కిలోల పెట్రోలియం. 217 మెగా జూల్స్‌ శక్తి అవసరం అవుతుంది. పాలిస్టర్‌ తయారీ ప్రక్రియలో 21 కిలోగ్రామల కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాతావరణంలోకి విడుదలవుతుంది.

పాలిస్టర్‌ను ఎక్కువగా ఎందుకు వినియోగిస్తారు?
మన దేశంలో పాలిస్టర్‌ను ఎక్కువగా వాడడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ బట్ట ముడతలు పడదు. దీంతో ఇస్త్రీ అవసరం ఉండదు. ఉతికిన తర్వాత త్వరగా ఆరుతుంది. ఇది వినియోగదారులకు అదనపు సౌలభ్యం.

ఏటా 70 లక్షల టన్నులకు పైగా వస్త్ర వ్యర్థాలు
మన దేశంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలపై జరుగుతున్నంత చర్చ వస్త్ర వ్యర్థాలపై జరగడం లేదు. పేరుకుపోతున్న వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తున్నా, పర్యావరణానికి ముప్పుగానే పరిణమిస్తోంది. కేంద్ర జౌళిశాఖ లెక్కల ప్రకారం దేశంలో ఏటా 70.73 లక్షల టన్నుల వస్త్ర వ్యర్థం ఉత్పత్తి అవుతోంది. దీంట్లో 42% ఫ్యాక్టరీల్లో తయారీ సమయంలో వస్తుండగా, 58% వినియోగం తర్వాత వచ్చే వ్యర్థం. ఇందులో 70% వ్యర్థాల్ని రీసైక్లింగ్, పునర్వియోగం చేస్తున్నారు. ప్రపంచంలోని వస్త్ర వ్యర్థాల్లో భారతదేశం సుమారు 8% వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది.

విద్యార్థులపై ప్రభావం
పాలిస్టర్‌ వస్త్రాన్ని పాలిథిలిన్‌ టెరెఫ్లాలెట్‌ (పెట్‌) అనే రసాయనంతో తయారు చేస్తారు. పెట్రోలియం ఆధారిత రసాయనాలను వేడిచేసి, వాటిని ప్లాస్టిక్‌ చిప్స్‌గా మార్చి ఆపై సన్నని దారాలుగా మారుస్తారు. పెట్‌ బాటిల్స్‌ అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం– వాటిని కూడా ఈ మెటీరియల్‌తోనే తయారు చేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇదే వాస్తవం. విద్యార్థులు ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం యూనిఫామ్‌ వేసుకుంటారు. ఈ దుస్తులు చెమట పీల్చుకోవు. చర్మంపై ఎక్కువ సేపు తడి ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా, ఫంగస్‌ పెరిగి కొంతమందిలో అలర్జీలు, చర్మ సమస్యలు వస్తాయి.

ఇది మరిన్ని అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఈ దుస్తులు ఉతికిన ప్రతిసారీ కంటికి కనిపించనంత చిన్న పరిమాణంలో ప్లాస్టిక్‌ రేణువులుగా విడిపోయి నీటిలో కలుస్తాయి. నీటిశుద్ధి కేంద్రాలు సైతం వీటిని పూర్తిగా వడపోయలేవు. ఇవి నదుల్లోకి, సముద్రాల్లోకి చేరుతాయి. చేపలు, ఇతర జీవులు వీటిని ఆహారంగా తీసుకుంటాయి. ఆ జీవులను మనం తింటే ఆ ప్లాస్టిక్‌ రేణువులు మన శరీరంలోకి చేరుతాయి. ఇవి కేవలం నీటిలోనే కాదు గాలిలోనూ కలుస్తాయి. ఇవి శ్వాస ద్వారా మన శరీరంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది.

పర్యావరణానికి ముప్పు 
కొంతమంది దుస్తులను కాలువలు, నదులు, నీటి కుంటల్లో పడేస్తారు. కొన్ని డంపింగ్‌ యార్డుకు చేరుతాయి. ప్రధానంగా పాలిస్టర్‌ వస్త్రాలు మట్టిలో కలిసిపోవు. ఏళ్ల తరబడి అలానే ఉంటాయి. మరికొన్ని పీలికలుగా అయిపోతాయి కానీ నేలలో పూర్తిగా కలిసిపోవు. కొన్నిచోట్ల దుస్తులను బహిరంగంగా కాలుస్తారు. ఇది తక్షణ పరిష్కారంగా కనిపించినా, సింథటిక్‌ వస్త్రాలు కాల్చినప్పుడు విషపూరిత వాయువులు విడుదల అవుతాయి. ఇవి గాలిలో చే రి మనం పీల్చే గాలిని కలుషితం చేసి, మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.

రీ సైక్లింగ్‌ పరిష్కారమా? తాత్కాలిక ఉపశమనమా?
వస్త్ర వ్యర్థాలు భారీగా పెరిగిపోతున్నాయి. కొండల్లా పేరుకుపోతున్నాయి. ఈ దశలో సహజంగా వచ్చే ఆలోచన రీ సైక్లింగ్‌. ఈ వ్యర్థాలను మళ్లీ ఉపయోగించగలమా? వీటితో కొత్త ఉత్పత్తులు తయారు చేయగలమా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. భారతదేశంలో వస్త్రాల రీ సైక్లింగ్‌ కొత్త వ్యవస్థేమీ కాదు. ఏళ్ల తరబడి అనధికారికంగా, కుటీర పరిశ్రమల స్థాయిలో నిరంతరాయంగా ఈ వ్యవస్థ పనిచేస్తోంది.

దేశంలోని కొన్ని ప్రాంతాలు రీసైక్లింగ్‌ హబ్‌లుగా మారాయి. వాడిన దుస్తులు, ఫ్యాబ్రిక్‌ ముక్కలు, పరిశ్రమ వ్యర్థాల నుంచి సేకరించిన వాటిని ఈ హబ్‌లలో వర్గీకరిస్తారు. పునర్వినియోగానికి అనుగుణంగా మారుస్తారు. అయితే ఇదంత సులభమైన ప్రక్రియ కాదు. సేకరించిన వాటిలో ఉపయోగపడేవి, ఉపయోగపడని వాటిని ముందుగా వర్గీకరించాలి. పనికొచ్చే వాటిని ప్రాసెస్‌ చేసి దుప్పట్లు, దిండ్లు, ఫిల్లింగ్‌ మెటీరియల్స్, తక్కువ నాణ్యత గల దుస్తులు తయారు చేస్తారు.

రీసైక్లింగ్‌కు పలు పరిమితులు

రీసైక్లింగ్‌ ఒక పాక్షిక పరిష్కార మార్గం మాత్రమే. మొత్తం వ్యర్థాల నిర్మూలన కు ఇది పూర్తి పరిష్కారాన్ని చూపడం లేదు. ముఖ్యంగా పాలిస్టర్‌ వ్యర్థం పూర్తి స్థాయి వినియోగానికి పనికి రాదు– ఇది మొదటి సమస్య. సేకరించడం, వర్గీకరించడం, శుద్ధి చేయడం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి– ఇది రెండో సమస్య. ఇక మూడో సమస్య సాంకేతికత. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతులనే వినియోగిస్తున్నారు.

ఫలితంగా పాలిస్టర్‌ మిక్స్‌డ్‌ కాటన్‌ వంటి వస్త్రాల్లో వ్యర్థాలు ఎక్కువగా మిగిలిపోతున్నాయి. కెమికల్‌ రీసైక్లింగ్‌ పద్ధతులు అందుబాటులో ఉన్నా, అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. వీటికి ఖర్చు ఎక్కువ. సాంకేతికత విస్తృతంగా అందుబాటులో లేదు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా ఉత్పత్తి పెరుగుతోంది. వినియోగమూ అదే స్థాయిలో ఉంది. దుస్తులను తక్కువ కాలం వాడి పారేస్తున్నాం. ఈ విధానంలో మార్పు రాకపోతే పునర్వినియోగం మాత్రమే సమస్యను పరిష్కరించలేదు.

అటకామా ఎడారిలో వ్యర్థవస్త్రాలు
చిలీలోని అటకామా ఎడారి వ్యర్థవస్త్రాల చెత్తకుప్పలా మారుతోంది. అమెరికా, యూరోప్‌ దేశాలు పనికిరాని దుస్తులను తీసుకొచ్చి,  అటకామా ఎడారిలో అక్రమంగా పడేస్తున్నారు. ఈ తతంగం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. చిలీకి వివిధ దేశాల నుంచి ఏటా వాడేసిన దుస్తులు దాదాపు 1.23 లక్షల టన్నుల వరకు వస్తుంటాయి. వీటిలో సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌కు కూడా పనికిరాని దుస్తులు 39 వేల టన్నుల వరకు ఉంటాయి. వీటినే అటకామా ఎడారిలో పడేస్తున్నారు. వీటిలో ఎక్కువగా సింథటిక్‌ దుస్తులే ఉండటం వల్ల ఇవి పర్యావరణానికి సమస్యగా మారుతున్నాయి.

ఇతర పరిష్కారాలు
వస్త్ర వ్యర్థాల సమస్య పరిష్కారం కావాలంటే ఉత్పత్తి నుంచి వినియోగం వరకు వ్యవస్థలో మార్పు రావాలని పరిశోధకులు, పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
ఒకే తరహా వస్త్రాలను ఎక్కువగా వినియోగించే యూనిఫామ్‌ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అత్యంత అవసరం. ఇది సులభతరం కూడా!

ఈ వస్త్రాల తయారీలో పర్యావరణానికి అనుకూలమైన పదార్థాలను ఉపయోగించాలి. సహజసిద్ధమైన దారాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. దుస్తుల్లో పాలిస్టర్‌ శాతాన్ని పరిమితం చేయాలి. పర్యావరణ అనుకూల ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలి.
విద్యార్థులు సుమారు ఎనిమిది నుంచి పది గంటల సేపు యూనిఫామ్‌ వేసుకుని ఉంటారు. కాటన్‌ దుస్తులు శరీరానికి అనుకూలంగా ఉంటాయి. చెమటను పీల్చుకుంటాయి. ఆరోగ్యపరంగాను మేలు చేస్తాయి. వీటి వాడకం పెరిగితే నేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. కునారిల్లుతున్న నేత పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుంది.

పాఠశాలల నిర్వాహకులు, తల్లిదండ్రులు ముందుగా ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. యూనిఫామ్‌ ధర ఆధారంగా కాకుండా పిల్లల ఆరోగ్యం, పర్యావరణహితం ఆధారంగా ఎంపిక చేసుకోవాలనే అవగాహన పెరగాలి. 
మన ఎంపిక పిల్లల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

పత్తి మంచిది పాలిస్టర్‌ చెడు అనేది సమస్య కాదు. పత్తి సాగులో కూడా అత్యధికంగా నీటి, రసాయనాల వినియోగం, కాలుష్యం వంటి సమస్యలు ఉన్నాయి. పర్యావరణానికి అనుకూలమైన సాగు పద్ధతులు, వస్త్రాల తయారీ కీలకం. ఆ దిశగా పరిశ్రమలు ముందడుగు వేయాలి.
వస్త్ర వ్యర్థాల తగ్గింపులో అతి ముఖ్యమైన పాత్ర తయారీదారులది. ఒక వస్త్రం తయారు చేసిన తర్వాత అది వ్యర్థంగా మారినపుడు కూడా ఆ కంపెనీ బాధ్యత వహించాలి. ఈ విధానాన్ని అమలు చేస్తే ఉత్పత్తి దశలోనే పలు మార్పులు వస్తాయి. వ్యర్థాల శాతం తగ్గేలా పరిశ్రమలు జాగ్రత్తలు తీసుకుంటాయి.

సమాజపరంగా చూస్తే దుస్తుల  వినియోగపు అలవాట్లలో మార్పు కీలకం. ఎన్ని దుస్తులు కొనుగోలు చేస్తున్నాం? ఎంత కాలం వాడుతున్నాం? ఈ రెండు ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనవి. ఒక దుస్తు విలువ దాని ధరలో కాదు, ఎన్నాళ్లు వాడుతున్నామనే దానిలో ఉందనే అవగాహన పెరగాలి.

యూనిఫామ్‌ మార్కెట్‌ వృద్ధి
1980ల నాటికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు అన్ని విద్యాసంస్థలు యూనిఫామ్‌ తప్పనిసరి చేశాయి. ∙గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా సంస్థల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. దీంతో యూనిఫామ్‌ వినియోగం, వ్యాపారం రెండూ పెరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా యూనిఫామ్‌ మార్కెట్‌
2024  18.9బిలియన్‌ డాలర్లు
2034(అంచనా) 33.1 బిలియన్‌ డాలర్లు

వస్త్రాల వ్యర్థం –  ప్రపంచస్థాయి సమస్య
బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ గతేడాది ఆగస్టులో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 మిలియన్‌  టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. వీటితో 200కి పైగా ఒలింపిక్‌ స్టేడియాలను నింపవచ్చని పేర్కొంది. 2030 నాటికి ఈ వ్యర్థం 150 మిలియన్‌ టన్నులకు చేరవచ్చని అంచనా.
ప్రపంచవ్యాప్తంగా దుస్తుల ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ డంప్‌యార్డులకు చేరే వాటి సంఖ్యా పెరుగుతోంది. 
కాల్చివేసే లేదా విదేశాలకు ఎగుమతి చేస్తే బట్టల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటోంది.

అమెరికా, యూరప్‌ నుంచి పెద్ద మొత్తంలో వస్త్ర వ్యర్థాలు మన దేశంలోని హరియాణాలో ఉన్న పానిపట్‌కి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ రీసైక్లింగ్‌ కేంద్రంగా గుర్తింపు పొందింది. ∙దిగుమతి అయిన పాత బట్టలను రీసైకిల్‌ చేసి కొత్త దుస్తులు లేదా దుప్పట్లు తయారు చేస్తారు.

ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం
వస్త్రాల వ్యర్థాలు ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపుతున్నాయి. వస్త్ర వ్యర్థాల నుంచి వచ్చే విషపూరిత రసాయనాలు, రంగులు, సూక్ష్మ ప్లాస్టిక్‌ నేలలోకి, నీటిలోకి చేరి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. 
డంపింగ్‌ యార్డుకు చేరిన వ్యర్థాలు క్రమంగా కుళ్లే సమయంలో ప్రమాదకర విషవాయువులు విడుదలై వాతావరణ మార్పులకు కారణం అవుతాయి.
ఏటా సుమారు 5లక్షల టన్నుల మైక్రోఫైబర్లు సముద్రంలో కలుస్తున్నాయి.

నీటి వినియోగం ఎంత?
ఒక కాటన్‌ షర్ట్‌ తయారీకి సుమారు 2,649 లీటర్ల నీరు అవసరం. ఒక వ్యక్తి రోజుకు 8 గ్లాసుల చొప్పున తాగితే సుమారు మూడు నుండి నాలుగు సంవత్సరాలకు ఆ నీరు సరిపోతుందని అంచనా.

పాలిస్టర్‌తో పోలిస్తే కాటన్‌ షర్ట్‌ తయారీకి నీటి వినియోగం చాలా ఎక్కువ. అయితే పాలిస్టర్‌లో మైక్రోప్లాస్టిక్‌ కాలుష్యం ఎక్కువ.

సహజ సిద్ధ వస్త్రాలకు ప్రాధాన్యం
పర్యావరణానికి హాని తక్కువ.
గాలి, నేల కాలుష్యం తగ్గుతుంది.
నీటి వినియోగాన్ని తగ్గిస్తాయి
రైతులు, కార్మికులకు ఆరోగ్యకరం.

ప్రపంచవ్యాప్తంగా ఏటా 92 మిలియన్‌ టన్నుల వ్యర్థవస్త్రాలు పోగవుతున్నాయి. ప్రతి సెకనుకు ఒక చెత్తలారీ లోడుకు సమానమైన వ్యర్థవస్త్రాలు తగులబడుతున్నాయి. వీటిలో ఎక్కువగా ఉంటున్న సింథటిక్‌ వస్త్రాలు నేలలో పూర్తిగా కలిసిపోవడానికి కనీసం రెండువందల ఏళ్లు పడుతుంది. వీటి వల్ల భూసారం దెబ్బతింటోంది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. వీటిని తగులబెట్టడం వల్ల పర్యావరణంలోకి విషవాయువులు వెలువడుతూ, జీవజాలం మనుగడకు ముప్పుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న దుస్తుల్లో దాదాపు 57 శాతం వరకు ఏడాదిలోగానే వ్యర్థంగా మారుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఈ పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చుతున్నా, ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకు ఎవరూ సరైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేకపోవడమే విచారకరం. 

టైక్స్‌టైల్, రీ సైక్లింగ్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. విషపూరిత రసాయనాలు, దుమ్ము, సూక్ష్మఫైబర్‌ కణాల విడుదల కారణంగా వారు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారు. మహిళలు కూడా ఈ రంగంపై ఎక్కువగా ఆధారపడ్డారు. వారికి తగిన భద్రత, రక్షణ సదుపాయాలు లేవు. కంటి సంబంధిత సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. సర్క్యులర్‌ ఎకానమీ లక్ష్యాలు సాధించాలంటే పని పరిస్థితులను మెరుగుపర్చి, భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.  

∙దిలీప్‌ మాదిరెడ్డి 

Advertisement
 
Advertisement
Advertisement