Women Are Embracing All The Opportunities That Support Their Growth - Sakshi
Sakshi News home page

స్వయంకృషి: ఇష్టమైన పనులతో కొత్తమార్గం...

Published Thu, Sep 22 2022 12:37 AM

Women are embracing all the opportunities that support their growth - Sakshi

పడుతున్న కష్టమే మనకు బతుకుదెరువును నేర్పుతుంది. కొత్తగా ఆలోచించమంటుంది. ఒంటరి గడపను దాటుకొని నలుగురిలో కలవమంటుంది నేనుగా ఉన్న ఆలోచనల నుంచి మనంగా మూటగట్టుకొని సమష్టిగా పయనం సాగించమంటుంది. శ్రీకాకుళం, తిరుపతి నుంచి హైదరాబాద్‌ లోని ఒక ఎన్జీవో ప్రోగ్రామ్‌కి ఎవరికి వారుగా వచ్చారు శోభారాణి, ప్రమీల, దేవి, అరుణ, పద్మ, చైతన్య... గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ మహిళలు తమ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఒక్కరుగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు కలిసికట్టుగా పనిచేద్దాం అని తమకై తాముగా కొత్త మార్గం వేసుకుంటున్నారు.

సైదాబాద్‌లోని యాక్సెస్‌ లైవ్లీ హుడ్‌లో మహిళా సాధికారత కోసం అక్కడి వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఓ ఆసక్తికరమైన సంభాషణ మమ్మల్ని ఆకర్షించింది.  ‘నేను మళ్లీ హైదరాబాద్‌కు వచ్చే టైమ్‌కి నా మిల్లెట్‌ లడ్డూలను ప్లాస్టిక్‌ బాక్స్‌ల్లో కాకుండా ఆర్గానిక్‌ స్టైల్‌ బాక్స్‌ల్లో తీసుకువచ్చి మార్కెటింగ్‌ చేస్తా..’ అని తన పక్కనున్నవారితో చెబుతోంది ఓ అమ్మాయి. ‘‘నేను కూడా శానిటరీ ప్యాడ్స్‌ను అలాగే తయారుచేసి తీసుకువస్తా’’ అంది మరో మహిళ. ‘మీ బనానా చిప్స్‌... మాకు పంపించండి. మా దగ్గర మార్కెట్‌ చేస్తా!’ అని ఇంకో మహిళ మాట్లాడుతోంది. వారితో మేం మాటలు కలిపినప్పుడు వారి గ్రూప్‌లోకి మమ్మల్నీ అంతే సాదరంగా కలుపుకున్నారు.  

‘ఇల్లు నడుపుకోవాలన్నా, పిల్లలను చదివించుకోవాలన్నా మేమూ ఏదో పని చేసుకోవాలనుకున్నవాళ్లమే..’ అంటూ తమ గురించీ, తాము చేస్తున్న పనుల గురించి ఆనందంగా వివరించారు.

మిల్లెట్‌ లడ్డూలను తయారుచేస్తున్నది మీనా. శానిటరీ న్యాప్‌కిన్ల గురించి, మిల్లెట్‌ మిక్స్‌ల గురించి వివరించింది ప్రమీల. వీరిద్దరూ తిరుపతి నుంచి వచ్చినవాళ్లు. ‘నేను బనానా చిప్స్‌ చేస్తాను’ అని శ్రీకాకుళంలోని సీతం పేట నుంచి వచ్చిన శోభారాణి చెబితే, రాగి బిస్కెట్లను, రాగులకు సంబంధించిన ఉత్పత్తులను తయారుచేస్తుంటాను’ అని చెప్పింది బ్రాహ్మణ మండలం నుంచి వచ్చిన అరుణ. ‘హోమ్‌మేడ్‌ స్నాక్స్‌ చేసి అమ్ముతుంటాను’ అని వివరించింది దేవి. తిరుపతిలో న్యూట్రిషనిస్ట్‌గా డిప్లమా చేసిన చైతన్య మల్టీ మిల్లెట్స్‌ ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్‌ చేస్తోంది.

కరోనా సమయంలో...
ప్రమీల మాట్లాడుతూ –‘మా ఆయనది ప్రైవేటు ఉద్యోగం. కరోనా కారణంగా పోయింది. పిల్లల చదువు, కుటుంబ పోషణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. దీంతో ఉదయాన్నే రాగి జావ చేసి, దగ్గరలో ఉన్న పార్క్‌ దగ్గరకు వెళ్లి కూర్చోనేదాన్ని. మొదట్లో ఎవరు కొంటారో.. అనుకునేదాన్ని. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ నేను చేసే రాగి జావకు డిమాండ్‌ పెరిగింది. దీంతో పాటు మొలకెత్తిన గింజలు కూడా పెట్టి అమ్మేదాన్ని. తెల్లవారుజామున మూడు గంటల నుంచి నా పని మొదలవుతుంది.

మా చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ఆడవాళ్లు కూడా మాకూ పని ఇప్పించమంటే, ఇదే పని నేర్పాను. తయారుచేసుకున్నది పార్క్‌ల వద్దకు తీసుకెళ్లి అమ్మడం, అలా వచ్చిన ఆదాయాన్ని వాళ్లకూ పంచడం.. కరోనా సమయం నుంచి చేస్తున్న. దీంతో పాటు రకరకాల మల్టీగ్రెయిన్‌ మిక్స్‌లు, డ్రింక్స్‌ స్వయంగా చేసి అమ్ముతున్నాను. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్‌ కూడా సొంతంగా తయారుచేస్తున్నాను. దీని వల్ల నాకే కాదు, మా దగ్గర ఉన్న కొంత మంది ఆడవాళ్లకైనా పని ఇప్పించగలుగుతాను’ అని వివరిస్తుంటే కష్టం నేర్పిన పనిలో ఉన్న తృప్తి ఆమె మోములో కనిపించింది.

కూలీ పనుల నుంచి...
శ్రీకాకుళం నుంచి వచ్చిన శోభారాణి మాట్లాడుతూ ‘మా దగ్గర అటవీ ఉత్పత్తులు ఎక్కువ. కానీ, వాటికి మా దగ్గర పెద్దగా మార్కెట్‌ లేదు. వాటి మీద మంచి ఆదాయం వస్తుందన్న విషయం కూడా నాకు అంతగా తెలియదు. కూలీ పనులకు వెళ్లేదాన్ని. ఏడాదిగా అరటికాయలతో చిప్స్‌ తయారీ చేసి అమ్ముతున్నాను. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఆర్డర్ల మీద పంపిస్తున్నాను. ఎగ్జిబిషన్లలోనూ పాల్గొంటున్నాను. మా ఊళ్లో జరిగిన మహిళా సంఘాల కార్యక్రమాల్లో ‘మీ దగ్గర దొరికే ఉత్పత్తులతో ఏమైనా తయారుచేయచ్చు’ అంటే నేనిది ఎంచుకున్నాను. ఎక్కడా దొరకని స్పెషల్‌ అరటికాయలు మా ప్రాంతంలో లభిస్తాయి. వాటితోనే ఈ మార్గంలోకి వచ్చాను. మా ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు వికలాంగులు నాకు ప్యాకింగ్‌లో సాయపడతారు. వారికి రోజుకు 200 రూపాయలు ఇస్తాను’ అని ఆనందంగా వివరించింది.

కుటుంబ పోషణే ప్రధానంగా...
‘స్కూల్‌ ఏజ్‌లోనే పెళ్లవడం, పాప పుట్టడం.. ఆ తర్వాత వచ్చిన కుటుంబసమస్యలతో నా కాళ్ల మీద నేను నిలబడాలనే ఆలోచన కలిగింది’ అంటూ వివరించింది పాతికేళ్లు కూడా లేని మీనా. మిల్లెట్‌ లడ్డూల తయారీని సొంతంగా నేర్చుకుని, వాటిని మార్కెటింగ్‌ చేస్తోంది. మొదట ఇంటి చుట్టుపక్కల వాళ్లకే అమ్మేదని, తర్వాత్తర్వాత చిన్న చిన్న ఎగ్జిబిషన్స్‌లో పాల్గొనడం చేశాన’ని తెలియజేసింది. ‘‘కుటుంబాలను పోషించుకోవడానికే కాదు, మాకై మేం ఎదిగేందుకు, మాతో పాటు కొందరికి ఉపాధి ఇచ్చేందుకు మేం ఎంచుకున్న ఈ మార్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళుతుంటాం..’’ అని వివరించారు దేవి, అరుణ.

మిగతావారూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ పనిలో మా కుటుంబసభ్యులందరినీ పాల్గొనేలా చేస్తున్నాం. పనితో పాటు నెలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. మా స్వశక్తితో మేం ఎదుగుతున్నాం అన్న ఆనందం కలుగుతుంది. మొదట్లో మాకెవ్వరికీ ఒకరికొకరం పరిచయం లేదు. మహిళా ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా కలుసుకున్నవాళ్లమే. మంచి స్నేహితులమయ్యాం. ఒకరి ఉత్పత్తులను మరొకరం ఆర్డర్ల మీద తెచ్చుకొని, మా ప్రాంతాలలో వాటినీ అమ్ముతుంటాం. ఎవరికి వారుగా వచ్చినా, ఈ ఏడాదిగా ఒకరికొకరం అన్నట్టుగా ఉన్నాం. మా వ్యాపారాలను పెంచుకునేందుకు, ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాం’ అని వివరించారు.

మొదటి అడుగు ఎప్పుడూ కీలకమైనదే. కష్టం నుంచో, ఎదగాలన్న తపన నుంచో పుట్టుకు వచ్చేదే. తమ ఎదుగుదలకు మద్దతుగా నిలిచే అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. మరెన్నో అడుగులు వేయడానికి సిద్ధమవుతున్న వీరిని మనసారా అభినందిద్దాం.

– నిర్మలారెడ్డి
ఫొటోలు: గడిగె బాలస్వామి

Advertisement
Advertisement