Tips For Winter Allergies: అలర్జీలు.. అలసత్వం వహిస్తే ప్రాణాంతకం కూడా! ఆహారంలో పీతలు, సోయా.. ఇంకా

అలర్జీనా? నివారణ ఇలా...
Winter Care- Health Tips: మడిసన్నాక కాసింత కళాపోషణుండాల అనే సినిమా డైలాగ్‌లా మనిషన్నాక జీవితంలో ఏదో ఒక దశలో అలర్జీ కలగక మానదు. బాధించకుండానూ ఉండదు. ఇందుకు మనం పీల్చే గాలి, తీసుకునే ఆహారం, ప్రేమతో పెంచుకునే జంతువులు, వాడే సుగంధ ద్రవ్యాలు లేదా తీసుకునే మందులు కూడా కారణం కావచ్చు.
అలర్జీ అంత ప్రమాదకరం కాకపోయినా, అలసత్వం వహిస్తే ప్రాణాంతకం కూడా కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలర్జీల విజృంభణకు శీతాకాలం అనువైన సమయం. అందువల్ల మనం సాధారణంగా ఎదుర్కొనే కొన్ని రకాల అలర్జీలు, కారణాలు, నివారణలపై అవగాహన కోసం..
అలర్జీ అంటే ఏదో పెద్ద వ్యాధి అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ, అది కరెక్ట్ ఆలోచన కాదు. అలర్జీ అంటే శరీరం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అన్నమాట. అంటే, మనం తీసుకునే ఆహారం లేదా గాలి శరీరంలోకి వెళ్లినప్పుడు, మన శరీరం స్పందించాల్సిన దానికంటే ఎక్కువగా స్పందిస్తుంది. ఈ విధంగా మోతాదు కంటే ఎక్కువగా స్పందిస్తే దాన్ని అలర్జీ లేదా హైపర్ సెన్సిటివిటీ అంటారు. దీనిమూలంగా రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి.
ఆహారపరమైన అలర్జీ
మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు ఆహార సంబంధమైన అలర్జీలకు దారితీస్తాయి. సాధారణంగా ఫుడ్ అలర్జీలు గుడ్లు, పాలు, వేరుశెనగ, చేపలు, రొయ్యలు, పీతలు, సోయా, కొన్ని రకాల నట్స్ (ఆక్రోట్స్, బాదం, బ్రెజిల్ నట్స్), గోధుమ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వస్తాయి.
శరీరానికి ఈ పదార్థాలు సరిపడకపోతే దురద, చర్మంపై దద్దుర్లు, వాంతులు లేదా కడుపులో అసౌకర్యం, శ్వాస సరిగా అందకపోవటం, గురక, దగ్గు, గొంతునొప్పి, పల్స్ పడిపోవడం, చర్మం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఫుడ్ అలర్జీల నిర్ధారణకు చర్మ పరీక్షతోపాటు రక్త పరీక్షలు(ఐజీఈ యాంటీబాడీస్) కూడా చేయాల్సి ఉంటుంది.
దుమ్మెత్తే అలర్జీ
దుమ్ము, ధూళి వల్ల, వాటిలోని సూక్ష్మజీవుల వల్ల వచ్చే అలర్జీని డస్ట్ అలర్జీ అంటారు. వైద్య పరిభాషలో వీటిని డస్ట్ మైట్స్ అంటారు. శ్వాస తీసుకునే క్రమంలో ఈ డస్ట్ మైట్స్ శరీరంలోకి ప్రవేశించి శ్వాసనాళాల వ్యాకోచం లేదా వాపునకు కారణమవుతాయి. దీనివల్ల తుమ్ములు, ముక్కు కారడం, కంటిలో దురద, కళ్ళలో నుంచి జిగట నీరు, ఒళ్లంతా దురద, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మన ఇళ్లలో ఉండే తేమ, దుమ్ము, మురికి ఈ డస్ట్ మైట్స్‌కు ఆవాసాలు. కాబట్టి దుప్పట్లు, దిండు గలీబులు, టవల్స్, కార్పెట్లు, ఇతర సామగ్రిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. డస్ట్ అలర్జీ కారకాలను గుర్తించడానికి కొన్ని రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
ఈ పరీక్ష ఫలితాలను బట్టి ఏయే పదార్థాలు మనకు సరిపడటం లేదో, ఆయా పదార్థాలకు దూరంగా ఉండమని లేదా వాటికి తగిన మందులను సూచిస్తారు వైద్యులు. డస్ట్ అలర్జీతో బాధపడేవారు 80 శాతం మంది ఆస్తమా రోగులుగా మారుతున్నారు.
కంటి అలర్జీ
సాధారణంగా కంటి అలర్జీలు పుప్పొడి, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువుల చర్మ కణాలు వంటి వాటి వల్ల సంభవిస్తాయి. వీటివల్ల కళ్లలో దురద, వాపు, మంట, జిగట నీరు కారడం, ఎరుపెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి అంటువ్యాధులు కావు. కంటి అలర్జీలకు ప్రత్యేకమైన నిర్ధారణ పరీక్షలు ఏవీ ఉండవు. కంటి అలర్జీకి కారకాలేమిటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటమే నివారణ.
అలర్జీ వస్తే ఏం చేయాలంటే..?
శరీరంలో అలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే అలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. డాక్టర్ తో మీ ఫ్యామిలీ హిస్టరీ, జీవనశైలి, ఇతర జబ్బులకు వాడుతున్న మందులు తదితర వివరాలను తెలియజేస్తే, దానికి తగిన నిర్ధారణ పరీక్షలను సూచిస్తారు.
ముందుగా ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, ఎక్స్‌రే వంటి పరీక్షలు నిర్వహించి ఆ తరువాత మీ అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ పరీక్షలు, ప్యాచ్ లేదా రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల నివేదికల ఆధారంగా మీరు ఏరకమైన అలర్జీ లతో బాధపడుతున్నారో నిర్ధారించుకొని తగిన చికిత్సను సిఫార్సు చేస్తారు.
చికిత్స ఏమిటి?
అలర్జీలకు సరైన చికిత్సను నిర్ధారణ పరీక్షల ఆధారంగానే కాకుండా బాధితుడి మెడికల్ హిస్టరీ, లక్షణాల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఇవ్వవలసి ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. దీన్ని ఏదో ఒక చికిత్సా విధానం ద్వారా అదుపులో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే!
చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు..
Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే..