నిద్ర లేకపోతే ఎంత డేంజరంటే..? షాకింగ్‌ విషయాలు

What Are The Causes And Effects Of Insomnia - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కంటి నిండా కునుకు తీసి ఎన్నాళ్లయిందో.. మనసారా నిద్రపోవడం ఒక కలగా మారింది..ఇప్పుడు ఎక్కువ మంది నోట వినిపించే మాట ఇది. అనారోగ్యానికి కారణమవుతున్న ప్రధాన సమస్య ఇది. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రికి మంచమెక్కినా నిద్ర పట్టడానికి చాలా సమయం పడుతోంది. ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారుకుని రెండు మూడు గంటలకే మేల్కొనాల్సి వస్తోంది.

జీవనశైలిలో వచ్చిన మార్పులు ఇందుకు కారణమవు తున్నాయి. అలాగని జీవనశైలిని ఏమైనా మార్చుకుంటున్నారా అంటే అదీ చేయడం లేదు. గాఢనిద్ర లేక పోవడం ఆరోగ్య పరంగా అనేక అనర్థాలకు దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పనిలో పెరిగిన ఒత్తిళ్లు, అమెరికా వంటి దేశాలలోని మల్టీ నేషనల్‌ కంపెనీల కోసం నిరంతరం రాత్రి పూట పనిచేయడం నిద్ర లేమికి కారణమవుతూ అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.

ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 50 నుంచి 60శాతం మంది నిద్ర లేమితో బాధపడుతున్నారని వైద్యుల అధ్యయనంలో తేలింది. ఒకప్పుడు గాఢనిద్ర అంటే పది గంటలు పైమాటే. మారిన పరిస్థితులతో నిద్రను అమెరికన్‌ స్లీప్‌ అసోసియేషన్‌ ఎనిమిది గంటలకు కుదించింది.

నీరసం..నిస్సత్తువ 
నిద్ర లేమిని వైద్య పరిభాషలో ఇన్‌సామ్నియా అంటారు. దీని బాధితులకు రాత్రి వేళ్లల్లో నిద్ర త్వరగా పట్టకపోవడం, మధ్య రాత్రి వేళల్లో మెలకువ రావడం, త్వరగా లేచిపోవడం, మెదడు పనితీరు క్షీణించడం, నిద్రపోయిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకున్న భావన కలగక పోవడం, రోజంతా మత్తుగా ఉండటం జరుగుతుంది. ఫలితంగా నీరసం వచ్చేస్తుంది. పగలంతా శ్రమించిన వారికి, మెదడుకు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. వైద్యులు నిద్రను రెండు రకాలుగా పేర్కొంటున్నారు.

నిద్రలో ఉన్న 1, 2, 3 దశల్లో గాఢ నిద్రలో 2,3 స్టేజ్‌లుగా చెబుతున్నారు. నిద్రలో మూడో స్టేజ్‌ చాలా కీలకమైంది. ఉదయం నుంచి జరిగే కార్యక్రమాలు ఈ సమయంలోనే మెదడులో నమోదవుతుంటాయి.ఆ సమయంలో సరిగ్గా నిద్ర పట్టలేదంటే ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్టేనని గుర్తించాలంటున్నారు. నిద్ర అనేది చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఏడాది లోపు పిల్లలు 12 గంటలు నిద్రపోతారు. వయస్సు పెరిగే కొద్దీ 8 గంటలు ఉండాలి. యుక్త వయసు నుంచి 50 సంవత్సరాలు మధ్య ఉన్న వారికి మధ్యాహ్నం నిద్ర పోవడం మంచిది కాదు.

నిద్రపోయేందుకు ఇవి పాటించాలి
నిద్రపోయే ముందు మొబైల్‌ చూడకూడదు.
పడకునే గదిలో లైట్‌ వేసుకోకూడదు.అసలు టీవీ ఉండకూడదు.
పడుకునే గది కొంత చీకటిగా ఉండాలి.బెడ్‌లైట్‌ కూడా కాంతివంతంగా ఉండకూడదంటున్నారు.
మధ్య వయస్సు వారు మధ్యాహ్నం పడుకోకూడదు. తిన్న తరువాత పడుకోకపోవడమే చాలా మంచింది.
బెడ్‌కు ఎదురుగా గడియారం పెట్టుకోవడం, టైం ఎంతయిందనిని తరచు చూడటం వల్ల నిద్ర లేమికి మరో కారణం.
ఈ మధ్య కాలంలో నిద్ర లేమితో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. రెండు, మూడు గంటలు, ఐదు గంటలు లోపు నిద్రపోయే వారిలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
ఇది చాలా ప్రమాదకరం. మెదడుతో పాటు ఇతర భాగాలపై ప్రభావం చూపుతోంది.

నిద్రపై ఆరోగ్య ప్రభావం 
సుఖమైన నిద్ర పోయే వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు పరీక్షలు కోసం రాత్రి అంతా చదివేసినా అవి ఒకటి, రెండు రోజులు మాత్రమే గుర్తుంటాయి.  ఆ తరువాత  మరరిచిపోతారు. చదివినంత సమయం నిద్ర కూడా ఉన్నప్పుడే చదువుకున్నది మెదడులో స్థిరంగా ఉంటుంది. పిల్లల్లో .నిద్ర సరిగ్గా లేని వారు పెరగాల్సినంత పెరగక పోవచ్చు.
చదవండి: సాహస రాణి.. ‘ఎందుకొచ్చిన రిస్క్‌’ అన్నవాళ్లే ఎక్కువ, కానీ!

నిద్ర పోకపోవడం పొగతాగడం కంటే ప్రమాదకరం 
పడుకునే ముందు మొబైల్‌ వినియోగం, ఆన్‌లైన్, ఛాటింగ్‌లు, డ్రగ్స్‌ వంటిని తగ్గించాలి. పడుకోవడానికి మూడు గంటలు ముందు కాఫీ, టీ, ఆల్కాహాల్, కూల్‌డ్రింక్‌ తీసుకోకూడదు. గంట ముందు పాలు తీసుకోవచ్చు. నిద్రపోయేందుకు ముందు వ్యాయామం చేయకూడదు. కొందరు రాత్రి పూట వాకింగ్, వ్యాయామం చేస్తుంటారు. అది ఏమంత మంచిది కాదు. నిద్రపోకపోవడమనేది పొగతాగడం, మద్యం సేవించడం వంటి వాటికంటే ప్రమాదకరంగా పేర్కొంటున్నారు. 
– డాక్టర్‌ పిల్లారిశెట్టి శంకర్, ఎండీ, డీఎన్‌బీ, న్యూరో ఫిజీషియన్, రాజమహేంద్రవరం

నిద్ర మాత్రలతో మతిమరుపు 
మానసిక సమస్యలు, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ వల్ల కూడా స్లీపింగ్‌ డిస్ట్రబెన్స్‌ ఉంటుంది. అసలు కారణానికి మందులు వాడాలి తప్ప నేరుగా నిద్రలేమికి మందులు వాడకూడదు. ఆ్రల్పాజోలం ఎక్కువగా వాడుతున్నారు. నిద్రకు సమయ పాలన లేకపోవడంతోనే యువతలో నిద్ర లేమి సమస్యలు వస్తున్నాయి. జీవన శైలి మార్చుకుంటే మందులతో పనిలేదు. శ్వాస సంబంధిత ఇబ్బందుల వల్ల కూడా నిద్ర లేమి ఎదురవుతుంది. నిద్రమాత్రల వల్ల మతిమరుపు త్వరగా వస్తుంది. పాలీ సోమినో గ్రాఫీ యంత్రం ద్వారా నిద్ర లేమిని పరీక్షించవచ్చు.   
– డాక్టర్‌ వానపల్లి వరప్రసాద్, మానసిక వైద్య నిపుణుడు, జీజీహెచ్, కాకినాడ  

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top