పిల్లలకు కష్టం విలువ చెప్పాలి | Teaching kids that success comes through effort, not shortcuts | Sakshi
Sakshi News home page

పిల్లలకు కష్టం విలువ చెప్పాలి

Mar 22 2026 1:05 AM | Updated on Mar 22 2026 1:05 AM

Teaching kids that success comes through effort, not shortcuts

చదువు, ఉద్యోగం, వివాహం– ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలోనూ కొనసాగే దశలే! కాని, ఇప్పుడు ప్రతిదీ అపసవ్యంగా జరుగుతోంది. దానికి కారణం పెంపకం లోపాలే! జీవితంలో ఏదీ సులువుగా రాదు, కష్టపడాల్సిందే అని పిల్లలకు నేర్పాలి. ‘మా చిన్నతనంలో మేం కష్టపడ్డాం. పిల్లలు ఇప్పుడు సుఖంగా పెరగాలి’ అనే ఆలోచనతో వారి అవసరానికి మించి ఖర్చుపెట్టే వాళ్లున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి. 

మనం ఎంత సామాన్యంగా జీవిస్తామో పిల్లలు అంత ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఉచితంగా ఇచ్చేదానికి విలువ ఉండదు. ఏదైనా ఒక వస్తువు కొనాలంటే నా చిన్నతనంలో ఎంత కష్టపడ్డానో, అవసరానికి ఎవరి ముందు చేయి చాపకుండా ఎలా జీవించాలో, దాని వల్ల జీవితం ఎంత బాగుంటుందో చెప్పేదాన్ని. దీని వల్ల పిల్లల్లో అవగాహన పెరుగుతుంది. ఈ రోజుల్లో పేరెంట్స్‌ ఎలా ఉన్నారంటే పిల్లలు ఏదైనా కళ నేర్చుకుంటే వాళ్లు నెల రోజుల్లో దానిని స్టేజీపైన ప్రదర్శించాలి. త్వరగా ఫేమస్‌ అయిపోవాలి. అంతా షార్ట్‌ టర్మ్‌లో జరిగిపోవాలనే ధోరణి బాగా పెరిగింది.

నా చిన్నతనంలో ఆర్థిక సంక్షోభంలో ఉండే కుటుంబాలు ఎక్కువ. ఎక్కువ సంతానం, తక్కువ సంపాదన. చాలా కష్టపడి పిల్లల్ని పెంచేవారు. ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటిగా భావించేవారు. అలాంటి స్థితిలో నేను పెరిగాను. మాది చేనేత కుటుంబం. ఆడపిల్లలను చదివించి, పెళ్ళిళ్లు చేయాలంటే మరీ భారంగా ఉండేది. నాకు చదువు మీద ఇష్టం ఉండటంతో కాలేజీ వరకు వెళ్లగలిగాను. బీఎస్సీ చదువుతున్నప్పుడు పెళ్లయ్యింది. పెళ్లయ్యాక ఉమ్మడి కుటుంబం. అయినా ఎమ్మెస్సీ చేయగలిగాను. టీచర్‌ ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా నాకు నేను నిలదొక్కుకోగలిగాను. మా అక్క, అన్నయ్యలు సాహిత్యం అంటే ఇష్టం చూపేవారు. మా వారు సాహితీవేత్త. సాహిత్యాభిలాషతో నేనూ రచనలు చేస్తుండేదానిని. 

నాకు ఒక్కగానొక్క కూతురు పల్లవి. నా కూతురు బాగా చదువుకోవాలని ఉండేది. అలాగని నా ఇష్టాలను తనమీద రుద్దలేదు. నేను చదువుకుంటూ, రాసుకుంటూ ఉండేదాన్ని. బహుమతి రూపంలో పుస్తకమే ఇచ్చేదాన్ని. దీని వల్ల తనకూ సాహిత్యం అంటే ఇష్టం ఏర్పడింది. సంగీతం, చిత్రలేఖం నేర్చుకుంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం చేసింది. పెళ్లయిన తర్వాత అమెరికా వెళ్లి, అక్కడా ఉద్యోగం చేసింది. తిరిగి హైదరాబాద్‌ వచ్చాక కూడా ఉద్యోగం కొనసాగించింది.  

టెక్నాలజీని చెడుగా ఉపయోగిస్తున్నారు...
నా చిన్నతనంలో వినోద కార్యక్రమాలు పెద్దగా లేవు. ఖాళీ సమయం ఎక్కువ ఉండేది. దీని వల్ల పుస్తకాలు, సంగీతం, సాహిత్యం పట్ల ఆసక్తి చూపేవాళ్లం. ఈ రోజుల్లో టీవీ చానెళ్లు, స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా పిల్లల ఆలోచనలను త్వరగా డైవర్ట్‌ చేస్తున్నాయి. టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవడం లేదు. తల్లిదండ్రులు టెక్నాలజీ గురించి మంచి చెడులు చెప్పగలిగి, ఫోకస్డ్‌గా ఉంటే పెంపకం బాగుంటుంది. కాని, వాళ్లే చేతిలో సెల్‌ఫోన్‌ పెట్టి అన్నం తినిపిస్తున్నారు. ఇక వారేం మంచి చెప్పగలుగుతారు. 

మా ఇంట్లో ఇప్పటికీ ఎవరమూ సీరియళ్లు చూడం. జాగ్రఫిక్‌ చానెల్స్, పాత సినిమాలు చూస్తాం. దీని వల్ల సమయం ఉంటుంది. మా అమ్మాయి జర్మన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకుంది. ట్రాన్స్‌లేషన్స్‌ చేస్తుంటుంది. మా మనవరాలు ఆశ్లేష ఇంగ్లిష్‌ సాహిత్యం చదవడం, రాయడం చేస్తుంది. మేం ముగ్గురం కలిసి పుస్తకాల గురించి చర్చించుకుంటాం. పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఎలా పరిష్కరించుకోవచ్చో కూడా తెలుస్తుంది. 

ఇస్కూలు కథలు
నేను మ్యాథ్స్‌ టీచర్‌గా ఉద్యోగం చేశాను. అయినా పిల్లల కల్చరల్‌ యాక్టివిటీస్‌ చూసేదాన్ని. పిల్లల చేత పాటలు పాడించడం, డ్యాన్సులు, నాటకాలు వేయించడం చేసేదాన్ని. నా ఉద్యోగ అనుభవాలతో ‘ఇస్కూలు కథలు’ పేరుతో 30 కథలతో బుక్‌ తీసుకువచ్చాను. మహారాష్ట్ర గవర్నమెంట్‌ ఆ పుస్తకంలోని ‘ఒకే తాను ముక్కలం’ అనే కథ వారి స్కూల్‌ పాఠ్య పుస్తకాలలో ఒక పాఠంగా చేర్చింది. ఆ బుక్‌ హిందీలోకి కూడా అనువాదమైంది.

మా దగ్గరున్న పుస్తకాలతో మా అమ్మాయి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసింది. వాటిలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అన్ని రకాల పుస్తకాలు ఉంచాం. ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు, చదువుకోవచ్చు అని మా చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలియజేశాం. కాని, రిటైర్‌ అయిన ఒకరిద్దరు తప్ప మిగతా ఎవ్వరూ రావడం లేదు. పిల్లలు స్కూల్‌ బుక్స్, ట్యూషన్స్‌తో, పెద్దలు సీరియల్స్‌తో టైమ్‌ గడిపేస్తున్నారు. ఈ విధానం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఎవరూ ఊహించడం లేదు. 

హాస్టల్‌లో ఉంటున్నవారి శాతమూ పెరిగింది. వాళ్లు పెరిగి, పెళ్లయ్యాక కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోతున్నారు. దీంతో త్వరగా విడాకులవైపుగా వెళ్లడమూ పెరిగింది. పేద–ధనిక అనే తేడా లేదు పిల్లల పెంపకంలో అందరిలోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి. ఆ ప్రభావాలు పిల్లల మీద నెగటివ్‌గా పడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సింది తల్లిదండ్రులే!

కేరెంటింగ్‌- శీలా సుభద్రాదేవి 

శీలా సుభద్రాదేవి ప్రముఖ రచయిత్రి, కవయిత్రి. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవంతో ఇస్కూలు కథలు సంపుటి వెలువరించారు. దీనితో పాటు తొమ్మిది కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు, ఒక నవలను అందించారు.  

∙ నిర్మలారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement