రైతు బిడ్డకు నాలుగు బంగారు పతకాలు

Suryapet Innovator Gorre Ashok Bags Four Gold Medals E NNOVATE 2021 - Sakshi

అంతర్జాతీయ పోటీలో గెల్చుకున్న యువ ఆవిష్కర్త అశోక్‌

చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే చక్కని వ్యవసాయ పరికరాలను రూపొందించి శభాష్‌ అనిపించుకున్న యువకుడు గొర్రె అశోక్‌కు ‘ఇ–న్నోవేట్‌’ ఇంటర్నేషనల్‌ ఆన్‌లైన్‌ ఇన్నొవేషన్‌ షో లో ఇటీవల నాలుగు బంగారు పతకాలు దక్కాయి. పోలెండ్‌లోని జకపొనె నగరంలో ప్రతి ఏటా ఈ పోటీ జరుగుతుంది. ఈ ఏడాది పోటీకి ప్రపంచ దేశాల నుంచి 2 వేలకు పైగా ఎంట్రీలు వచ్చాయి. ఈ పోటీలో రెండుకు మించి బంగారు పతకాలు గెల్చుకున్న ఇన్నోవేటర్‌ అశోక్‌ ఒక్కరే కావటం విశేషం. వ్యవసాయం, ఆక్వాకల్చర్‌ విభాగంలో 12 ఆవిష్కరణలకు బంగారు పతకాలు దక్కగా.. అందులో తొలి 4 అశోక్‌వి కావటం మరో విశేషం. 


సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం అంజలీపురంలో చిన్న రైతు కుటుంబంలో పుట్టిన అశోక్‌.. దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో వ్యవసాయ వృత్తి విద్యా కోర్సు పూర్తి చేశారు. చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ఆయనకు ఇష్టం. కేవలం రూ. 250 ఖర్చుతో వరి పొలంలో కలుపు తీతకు ఉపయోగపడే చేతి పరికరాన్ని రూపొందించి ‘ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌–2019’లో ప్రథమ బహుమతి పొందారు. ఈ నేపథ్యంలో వరి పొలంలో కలుపు తీత పరికరంతో పాటు తాను రూపొందించిన మరో మూడు పరికరాలను అశోక్‌ ఈ ఏడాది ‘ఈ–న్నోవేట్‌’ పోటీకి పంపారు. ఏకంగా నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్నారు.  

విత్తనం వేసుకునే చేతి పరికరం:
పత్తి, కంది, పెసర వంటి పంటల విత్తనాలను నడుము వంచే పని లేకుండా నిలబడే వేసుకునే ఒక చిన్న పరికరాన్ని అశోక్‌ రూపొందించారు. 3 అడుగుల ఎత్తున ఉండే ఈ పరికరంతో వేగంగా, సులువుగా, పురుషులు /మహిళలు /పెద్దలు / పిన్నలు ఎవరైనా సమాన దూరంలో విత్తనాలు వేసుకోవచ్చు.  

4 రకాలుగా ఉపయోగపడే పరికరం 
అశోక్‌ తయారు చేసిన మరో పరికరం చిన్న రైతులకు నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది. పత్తి, మిరప పొలాల్లో సాళ్ల మధ్య దున్నుతూ కలుపు తొలగించడానికి, విత్తనాలు వేసుకునే సమయంలో అచ్చు తీయడానికి, ఆరబోసిన ధాన్యాలను కుప్ప చేయడానికి, కళ్లాల్లో గడ్డిని పోగు చేయడానికి చిన్న మార్పులతో ఈ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. 

బహుళ ప్రయోజనకర యంత్రం
అశోక్‌ మొట్టమొదటిసారిగా పెట్రోలుతో నడిచే పెద్ద వ్యవసాయ యంత్రాన్ని రూపొందించారు. ఏ పంటలోనైనా ఎకరంలో 15 నిమిషాల్లో పిచికారీని పూర్తి చేయడం, ఎరువు వంటి బరువులను ఇంటి నుంచి పొలానికి రవాణా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే మల్టీపర్సస్‌ యుటిలిటీ వెహికల్‌ అని దీనికి పేరు పెట్టారు. ‘ఈ–న్నోవేట్‌’ పోటీలో దీనికి కూడా బంగారు పతకం వచ్చింది. ప్రభుత్వం లేదా దాతలు ఆర్థిక సాయం చేస్తే పేటెంట్‌ పొంది, ఆ తర్వాత ఈ యంత్రాన్ని రైతులకు అందిస్తానని కొండంత ఆశతో చెబుతున్న అశోక్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా! 
ashokgorre17@gmail.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top