ఉచిత డిజిటల్‌ సహకార కోర్సులు | Savidya Sahakar Vidyalaya India first digital cooperative learning Sagubadi | Sakshi
Sakshi News home page

Savidya: ఉచిత డిజిటల్‌ సహకార కోర్సులు

May 5 2026 7:56 PM | Updated on May 5 2026 8:01 PM

Savidya Sahakar Vidyalaya India first digital cooperative learning Sagubadi

తెలుగు సహా 8 భాషల్లో సహకార డిజిటల్‌ వీడియో కోర్సులు

160కి పైగా కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర సహకార శాఖ

సహకార రంగానికి సంబంధించి 160కి పైగా ఆన్‌లైన్‌ డిజిటల్‌ కోర్సులను తెలుగు సహా 8 భాషల్లో ఉచితంగా కేంద్ర సహకార శాఖ ఆఫర్‌ చేస్తోంది. రైతులు, ఎగుమతిదారులు, విద్యార్థులకు ఉపయోగపడేలా కృత్రిమ మేధ తోడ్పాటుతో ఈ కోర్సులను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘సవిద్య.సీఓఓపి’ పేరిట ఒక వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది.

‘సవిద్య’ అంటే ‘సహకార విద్యాలయం’. (Sahakar Vidyalaya) ఇది దేశంలోనే మొట్టమొదటి డిజిటల్‌ సహకార విద్యా వేదిక. రైతులు, విద్యార్థులు, ఎగుమతిదారుల్లో సహకార విజ్ఞానాన్ని పెంపొందించటానికి ఉద్దేశించిన వేదిక ఇది. సహకార మంత్రిత్వ శాఖ ‘సహకార్‌ సే సమృద్ధి’ (సహకారం ద్వారా శ్రేయస్సు) చొరవలో భాగంగా ప్రారంభించిన ఈ వేదిక సహకార రంగంలో నిపుణుల నేతృత్వంలో ఉచిత శిక్షణను అందిస్తుంది. 

వ్యవసాయ పద్ధతులు, ఎగుమతి వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కవర్‌ చేసే 160కి పైగా ఉచిత వీడియో కోర్సులు. తెలుగు సహా 8 భారతీయ భాషల్లో గ్రామీణులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ కోర్సులను రూపొందించారు. కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లను ఉపయోగించి కంటెంట్‌ను వ్యక్తిగతీకరిస్తుంది. లక్షలాది వినియోగదారులకు మరింత సమర్థవంతంగా జ్ఞానాన్ని అందించేందుకు ఏఐ వాడినట్లు కేంద్ర సహకార శాఖ తెలిపింది.

వినియోగదారులు తమ మొబైల్‌ పరికరాల ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ వీడియో కోర్సులు చదువుకోవడానికి వీలుంది. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి, పంట దిగుబడిని మెరుగుపరచుకోవడానికి ఇందులో కోర్సులు ఉన్నాయి. విద్యార్థులు సహకార రంగంలో వృత్తి, పరిశోధన అవకాశాలను అన్వేషించడానికి ఉపయోగపడే కోర్సులు ఉన్నాయి. అంతేకాదు, ఎగుమతిదారులు ప్రపంచ మార్కెట్‌ అవసరాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై అవగాహన పొందడానికి అవసరమైన కోర్సులను సైతం ఇందులో పొందుపరచటం విశేషం.

నేషనల్‌ కో–ఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఈఎల్‌), క్రిబ్కో వంటి సహకార సంస్థలు ఉమ్మడి కృషితో సహకార విద్యా ప్లాట్‌ఫారమ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 17,000 సహకార సంఘాలను 2 కోట్ల మందికి పైగా రైతులకు అనుసంధానం చేయటమే దీని లక్ష్యం. మీరు savidya.coopలో నేరుగా కోర్సులను ఎంపిక చేసుకొని, సులువుగా, ఉచితంగా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement