నేటి అమ్మ మేటి యోధ | Sakshi Specioal Story About mothers day 2026 | Sakshi
Sakshi News home page

నేటి అమ్మ మేటి యోధ

May 10 2026 6:11 AM | Updated on May 10 2026 10:25 AM

Sakshi Specioal Story About mothers day 2026

నేడు మదర్స్‌ డే

వయసు ముప్పై వచ్చేసరికి ఆమె భార్య, తల్లి, కోడలు, ఉద్యోగి. యువతిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! కుటుంబం.. సమాజం... విసిరే సవాళ్లు ఎన్ని! కాని గెలవడం ఆమెకు తెలుసు. ఆమె నేటి అమ్మ. ఈ అమ్మకు పద్మవ్యూహాలు ఛేదించడం తెలుసు.

నాకు నేను మిగలాలి
పెళ్లి అయ్యింది. పిల్లాడు పుట్టాడు. ఉద్యోగం ఉంది. సంతోషమే. కానీ ‘నేను’ ఏమయ్యాను అనే ప్రశ్న ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అద్దంలో చూసుకుంటే కనిపించేది ఒకరి భార్య, ఒకరి తల్లి, ఒక కంపెనీ ఉద్యోగి. కానీ వీళ్ల వెనుక ఉత్సాహం ఉరకలెత్తే ‘అమ్మాయి’ కూడా ఉండాలే. నాటి అమ్మాయిని కాపాడుకోవడం నేటి అమ్మకు తెలుసు. అందుకు తను ఏం చేస్తోంది? తనకంటూ కొంత సమయాన్ని మిగుల్చుకుంటోంది. తనకు ఆసక్తి ఉన్న రాజకీయ, సామాజిక అంశాలు తెలుసుకుంటోంది. వాలెంటరీ గ్రూప్‌తో పని చేస్తోంది. నెలకి ఒక్కసారైనా ఫ్రెండ్స్‌ను కలుస్తుంది. పూర్వపు బృందానికి లంకెలా పని చేస్తోంది. నేటి అమ్మ ఏకకాలంలో అమ్మ, వ్యక్తి కూడా.

80శాతం తృప్తి చాలు
ఆఫీసులో ప్రమోషన్‌ కోసం మీటింగ్‌ నడుస్తోంది. ఇంట్లో పిల్లాడికి జ్వరం వచ్చింది. అటు వైపు చూడాలా.. ఇటు వైపు చూడాలా? 30 ఏళ్ల అమ్మ రెండుగా చీలిపోతుంది. ఉద్యోగం వదిలేస్తే ఆర్థిక స్వాతంత్య్రం పోతుంది. పిల్లాడిని వదిలేస్తే మనసు ముల్లు గుచ్చుకుంటుంది. అందుకే రెండూ బేలెన్స్‌ చేసుకుంటోంది.  ‘గిల్ట్‌’ని పక్కన పెట్టడం నేర్చుకుంటోంది. ఆఫీసులో 100 శాతం, ఇంట్లో 100 శాతం ఇవ్వలేనని ఒప్పుకుని, రెండు చోట్లా 80 శాతం నిజాయితీగా ఇస్తోంది. ‘సూపర్‌ ఉమన్‌’ కాకపోయినా ‘తృప్తి ఉన్న అమ్మ’ అవుతోంది.

నా శరీరం నా కవచం
డెలివరీ తర్వాత పొట్ట మీద గీతలు, జుట్టు రాలడం, నడుం నొప్పి, నిద్రలేమి. 20 ఏళ్ల వయసులోని చురుకుదనం 30కి వచ్చేసరికి మాయం. సోషల్‌ మీడియాలో ‘ఫిట్‌ మామ్‌’లను చూసి తనను తాను తిట్టుకోవాలా? నో. నేటి అమ్మ అలా చేయదు. అద్దంలో కనిపించే గీతల్ని ‘యుద్ధ గాయాలు’గా చూస్తోంది.  వాటిని అలా ఉండనిచ్చి పిల్లాడిని స్కూల్‌లో దింపి వచ్చేటప్పుడు 30 నిమిషాలు నడుస్తోంది. యూట్యూబ్‌ చూసి 10 నిమిషాల యోగా చేస్తోంది. ‘సైజ్‌ జీరో’ కాదు, ‘జీరో టెన్షన్‌ హెల్త్‌’ తన టార్గెట్‌ చేసుకుంది. శరీరాన్ని ద్వేషించడం మానేసి, అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టింది. నేటి అమ్మ... జీవన ప్రయాణాన్ని గౌరవిస్తోంది.

నేను ముద్దాయిని కాను
పిల్లాడు మార్కులు తక్కువ తెచ్చుకున్నాడా... ‘అమ్మ సరిగా చూడట్లేదు’. పిల్లాడు అల్లరి చేశాడా... ‘తల్లి ఉద్యోగం చేస్తే పిల్లలు ఇలాగే ఉంటారు’. బయటి వాళ్ల మాటలు సరే... సొంత వాళ్లే ‘మా అమ్మలా నువ్వు లేవు’ అని పోలుస్తారు. 30 ఏళ్ల అమ్మ ప్రతి రోజూ బోనులో నిలబడుతుంది. అయితే ముద్దాయిలా కాదు. నిర్దోషిగా. పరాయి మాటలకు చెవులు మూసుకోవడం నేర్చుకుంటోంది. ‘నా పిల్లాడికి ఏం కావాలో నాకు తెలుసు’ అనే నమ్మకాన్ని గట్టిగా పట్టుకుంటోంది. ఫోన్‌ పక్కన పెట్టి పిల్లాడితో రోజూ 30 నిమిషాలు  మాట్లాడుతోంది. మార్కులతో పాటు వాడితో అనుబంధం ముఖ్యమని చెబుతోంది. జడ్జిమెంట్‌ ఇచ్చేవాళ్లకు తన పిల్లాడి నవ్వే సమాధానం అని ప్రూవ్‌ చేస్తోంది.

నా రేపటి చూపు
పిల్లాడి స్కూల్‌ ఫీజు, ఇంటి ఇ.ఎం.ఐ, అత్తమామల మందులు... సంపాదనలో సగం కళ్ల ముందే కరిగిపోతుంది. ఫ్రెండ్‌ మంచి చీర కొనుక్కుంటే ‘నేను ఎప్పుడు కొనుక్కోవాలి’ అని 30 ఏళ్ల అమ్మ మనసు చిన్నబోతుంది. తన కలల్ని ‘తర్వాత’ అనే అరలో దాచేస్తుంది. అయితే ఎన్నాళ్లు? అందుకే అమ్మ మారింది. ‘తర్వాత’ని ‘ఇప్పుడే’గా మార్చుకుంటోంది. నెలకి కొన్ని డబ్బులైనా తన పేరు మీద సేవ్‌ చేస్తోంది. ఫ్రీలాన్స్ పని చేస్తోంది. ఆన్‌లైన్‌లో చీరలు అమ్ముతోంది. భర్తతో బడ్జెట్‌ డిస్కస్‌ చేస్తోంది. ‘కుటుంబం కోసం’ అనే మాటతో పాటు ‘నా కోసం’ అనే ‘అర’ను జత చేసుకుంటోంది.

నా టాలెంట్‌ నా కల 
పెళ్లికి ముందు ఆమెకు ఒక కల ఉండేది. డ్యాన్సర్‌ అవ్వాలి, లేదా బిజినెస్‌ పెట్టాలి, లేదా ఒక్కతే లడాఖ్‌ వెళ్లాలి. పిల్లాడు పుట్టాక ఆ కలల ఫైల్‌ మూసేసింది. ‘ఇప్పుడు కుదరదులే’ అని తనకు తానే సర్ది చెప్పుకుంది. మరి ఇప్పుడు? తన కలలను తవ్వి బయటకు తీస్తోంది. ఉద్యోగం, పిల్లాడితో సమయం... పోగా మిగిలిన కాసేపు తన కల కోసం కేటాయిస్తోంది. ఆన్ లైన్‌ క్లాస్‌లో డ్యాన్స్ నేర్చుకుంటోంది. కథలు రాస్తోంది. ఇంటి నుంచే చిన్న బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తోంది. భర్తతో ‘నాకూ ఒక లడాఖ్‌ కావాలి’ అని ధైర్యంగా అడుగగలుగుతోంది. ‘అమ్మ’ అయిన తర్వాత కలలు చావవు, విరామంతో మేల్కొంటాయి అంతే అని ప్రపంచానికి చెబుతోంది. మరి నేటి అమ్మ కదా.    

అమ్మా... మము కన్నందుకు పాదాభివందనం
దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడట. తప్పు. అమ్మతో సాటి రాగల దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు కూడా అంగీకరించడు. అందుకే కవి అంటాడు... ‘అమ్మ లేకుంటే జననం లేదు, అమ్మ లేకుండా గమనం లేదు’. అవును. అమ్మ లేకుండా  చేసేది ఏమి గమనం’ అమ్మ లేకుండా సాగేది ఏమి గమ్యం? అమ్మా... ఎలా సాకావు మమ్మల్ని. ‘అకలి’ అని నువ్వు ఏనాడూ అనలేదు. 

మా కడుపు నిండితే నీ కడుపు నిండిందనుకున్నావు. ‘స్వార్థం’ అనే భావన ఏనాడూ చూపలేదు. నీకున్నదంతా మాకే పంచి పెట్టావు. అలసిన సంగతి తెలియనిచ్చావా? తెచ్చిపెట్టుకున్న హుషారుతో మమ్మల్ని విజయాల వైపు పరుగులెత్తించావు.

మేము పాసైతే నువ్వు పాసయ్యావనుకుని, మేము ఇంటర్వ్యూకెళితే నువ్వు ఉపవాసం ఉండి, మేము గెలిస్తే నీకు ప్రైజ్‌ వచ్చిందనుకుని మురిసిపోయే అమాయకురాలివి. 

ఎంత క్షమ నీకు. ఎంత ఆర్తి. ఎంత ఆర్ద్రత నీ పిల్లల కోసం. నీ ప్రతి ప్రార్థన మా కోసమే కదా. ‘మదర్స్‌ డే’ అని చెప్పి స్టేటస్‌ పెట్టి, నీతో సెల్ఫీ దిగి ఇన్ స్టాలో పోస్ట్‌ చేస్తే బాధ్యత తీరిపోతుందనుకుంటున్నాం. నువ్వనే ఒక మహాకావ్యంలో మేమొక అధ్యాయమని తెలుసుకోవాలి. తెలుసుకుంటాం. కృతజ్ఞతాశ్రువులతో నీ చేతులను ముద్దాడతాం. ‘అమ్మా.. మము కన్నందుకు పాదాభివందనం’ అని నీ పాదాలు అంటి ఆశీర్వాదం తీసుకుంటాం.
అమ్మా.. నీకు శతకోటి ప్రణామాలు. 

Advertisement
 
Advertisement
Advertisement