ఊపిరి ఉగ్గబట్టి 20 మీటర్లు.. 2 నిమిషాలు... సీఫుడ్‌ హీరోలు జుజు మహిళలు | Jeju’s Haenyeo: South Korea’s Legendary Sea Women Preserving 1,000-Year Marine Heritage | Sakshi
Sakshi News home page

ఊపిరి ఉగ్గబట్టి 20 మీటర్లు.. 2 నిమిషాలు... సీఫుడ్‌ హీరోలు జుజు మహిళలు

Oct 15 2025 10:17 AM | Updated on Oct 15 2025 12:51 PM

Sagubadi Sea food heros The ‘haenyeo’ Women Divers Of Jeju Island South Korea

శ్వాస పరికరాలు లేకుండా సాగర గర్భంలోకి డైవ్‌ చేస్తూ షెల్‌ ఫిష్, సీవీడ్స్‌ వంటి సముద్ర ఆహారాన్ని సేకరించి కుటుంబాలను పోషించుకునే మహిళా రైతుల తెగువ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో చెమటను చిందించే రైతమ్మలందరికీ స్ఫూర్తినిస్తుంది. దక్షిణ కొరియాలోని జెజు ద్వీపానికి చెందిన హెన్యో అనే మహిళా డైవర్లను ‘సీ ఉమన్‌’ అంటారు. వెయ్యేళ్ల నాటి వారసత్వ సంస్కృతి, డైవింగ్‌ నైపుణ్యం, సుస్థిరతలకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రత్యేకమైన పాక్షిక మాతృస్వామిక సంప్రదాయం వారిది. ఇప్పటికీ 103 గ్రామాలకు చెందిన మహిళలు ఈ విధంగా ఎటువంటి యంత్రాల సహాయం లేకుండా సముద్ర గర్భంలోకి దూసుకెళ్తూ ఆహార సేకరణ చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ‘ఫుడ్‌ హీరోలు’గా కీర్తిస్తోంది. అంతేకాదు, అత్యంత అరుదైన ప్రపంచ వ్యవసాయ వారసత్వ సంపదగా కూడా హెన్యో సామ్రాజ్యాన్ని ఎఫ్‌ఏవో, యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చాయి. జెజు ద్వీపంలో పుట్టిన ఈ తరం యువతులు సైతం ఈ సంప్రదాయ వారసత్వ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఆధునిక సాగర కన్యలుగా జీవనం సాగిస్తుండటం విశేషం. స్వేచ్ఛా డైవింగ్‌ ద్వారా వారు ‘సముద్ర  పొలాలను’ పండిస్తున్న అరుదైన మహిళా ఫుడ్‌ హీరోలపై అక్టోబర్‌ 16న అంతర్జాతీయ ఆహార దినోత్సవం (World Food Day )సందర్భంగా ప్రత్యేక కథనం...

‘సముద్రం నా రెండో తల్లి’!
ర్యుజిన్‌ కో తన తల్లి లేదా అమ్మమ్మ అడుగుజాడల్లో నడవాలని ఎప్పుడూ అనుకోలేదు. జెజు ద్వీపం తూర్పు తీరంలో డైవ్‌ చేయడానికి తన తల్లి లేదా అమ్మమ్మ ఇంటి నుంచి  పొద్దున్నే బయలుదేరి వెళ్లే సంగతి ఆమెకు బాల్యంలోనే తెలుసు. సీజన్‌ సరిగ్గా ఉన్నప్పుడు, వారు తమ కుటుంబాలను పోషించుకోవడానికి సముద్రపు అర్చిలు, అబలోన్, సముద్రపు నాచును సముద్రం లోపలి జలాలను గాలించి సేకరించేవారు. ర్యుజిన్‌ తన తరంలోని చాలా మంది అమ్మాయిల్లాగే కష్టపడి చదువుకుని నగరపు జీవితాన్ని గడపాలని కలలు కంది. అథ్లెటిక్స్‌లో డిగ్రీ  పొందినతర్వాత ఆమె నగరానికి వెళ్లిపోయింది. కానీ, అక్కడి జీవితంలో నిలవలేకపోయింది. ఎదురైన నిరాశ, ఆవహించిన నిస్సత్తువ ఆమెను తిరిగి ఇంటి బాట పట్టించాయి. ఇల్లు ఆమెను సముద్రం వైపు నడిపించింది. ఆ విధంగా యువ ర్యుజిన్‌ తన తల్లి, అమ్మమ్మలాగే ఆమె ‘సముద్ర మహిళ’ కావాలని నిర్ణయించుకుంది.

ప్రకృతి చిత్రమైనది. ఒక వనరు లేకపోతే మరో వనరును చూపిస్తుంది మనుషులు బతకడానికి!  రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియాలోని జెజు ద్వీపం ఇందుకు ఒక ఉదాహరణ. ఒక అసాధారణ, విలక్షణ ‘సముద్ర వ్యవసాయ’ వారసత్వానికి కేంద్ర బిందువైంది. జెజు ద్వీపంలో ఎక్కువ భూమి నిస్సారవంతమైనది కావటంతో వ్యవసాయానికి అంతగా పనికొచ్చే స్థితిలో లేదు. ఈ భౌగోళిక బలహీనత కారణం వల్ల జెజు ప్రజలు సాంప్రదాయకంగా వరికి బదులుగా తమ మెట్ట పొలాల్లో బాగా పెరిగే చిరుధాన్యాలు, బార్లీ వంటి ధాన్యపు పంటలను పండించేవారు. ఎందుకంటే ఈ పంటలు తక్కువ వనరులతోనే ఎక్కువ మందికి ఆహార భద్రతనిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ కారణంగా అక్కడి మహిళా రైతులు సముద్రంపై ఆధారపడి తమ కుటుంబాలకు ఆహారాన్ని సమకూర్చుకోవటంపై దృష్టి సారించారు. సముద్రం అడుగున ఉండే జీవులు, ఆకులు అలములను వెదికి తెచ్చుకోవటమే వారు వృత్తిగా పెట్టుకున్నారు. సుమారు వెయ్యి ఏళ్ల క్రితం నుంచి జుజు ద్వీపంలోని మహిళలు సముద్రపు నీటి లోతుల్లోకి దూకి తినదగిన ఆహారాన్ని సేకరించటం ప్రారంభించారు. ఆ క్రమంలో వారు అసాధారణమైన డైవింగ్‌ నైపుణ్యాలను తరతరాలుగా సంతరించుకున్నారు. ఎటువంటి శ్వాస పరికరాలు పెట్టుకోకుండా సాగర గర్భంలోకి డైవ్‌ చేస్తూ అట్టడుగున ఉండే షెల్‌ ఫిష్, సీవీడ్స్‌ వంటి సముద్ర ఆహారాన్ని సేకరించి కుటుంబాలను  పోషించుకుంటున్నారు. 

జెజు హెన్యో ఫిషింగ్‌  ప్రాక్టీస్‌ అనేది ప్రధానంగా మహిళలు నిర్వహించే సాంప్రదాయ జీవనాధార ఫిషింగ్‌ వ్యవస్థ. హెన్యో అంటే కొరియన్‌ భాషలో ‘సముద్ర మహిళ’ అని అర్థం. జెజు హెన్యోలు సాధారణ పద్ధతుల్లో చేపలు పట్టరు. అలాగని మట్టిలో పంటలు పండించరు. ఈ రెండిటికి మధ్యలో పర్యావరణ హితమైన సముద్రాహార సేకరణ ద్వారా తమ సమాజానికి ఆహార, జీవనోపాధి భద్రతను సాధించగలిగారు. ఈ మహిళా డైవర్లు సగం వ్యవసాయం – సగం మత్స్యకార జీవనశైలితో కూడిన జీవనోపాధి పనిలో నిమగ్నమవుతున్నారు.  

వట్టిపోతున్న సముద్రం
కనుమరుగవుతున్న వాణిజ్య అవకాశాలతో పాటు సముద్రం నుంచి జుజు మహిళా డైవర్లు   పొందే ప్రతిఫలం కూడా తగ్గుతోంది. వాతావరణ మార్పుల కారణంగా జెజు సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. ఫలితంగా, ఈ ప్రాంత సముద్ర జలాల్లోకి చొచ్చుకొస్తున్న ఉపఉష్ణమండల చేపలు స్థానిక జాతులను మింగేస్తున్నాయి. అముర్‌ స్టార్‌ ఫిష్, బ్లూ–రింగ్డ్‌ ఆక్టోపస్‌ వంటి మాంసాహార జాతులు ఈ జలాలను దురాక్రమణ చేస్తున్నాయి. సముద్ర మహిళలు ఇప్పుడు అలల కింద కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

ర్యుజిన్‌ సముద్రంలోకి దిగిన ప్రారంభ సంవత్సరాల్లో సమృద్ధిగా చేపలు పట్టుకోగలిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారి΄ోయింది. ఒకప్పుడు దొరికిన దానిలో ΄ావు వంతు కంటే తక్కువ మత్స్య సంపదే ఇప్పుడు దొరుకుతోంది.  ‘నా నైపుణ్యాలు మెరుగుపడినప్పటికీ, సముద్రం నుంచి తక్కువగానే పట్టుకోగలుగుతున్నాను. మూడు సంవత్సరాల క్రితం నేను ఏటా 30 బస్తాల అగర్‌ సీవీడ్‌ను సేకరించి ఎండబెట్టగలిగాను. ఈ సంవత్సరం కేవలం ఏడు బస్తాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది..’ అన్నారు ర్యుజిన్‌. 

ర్యుజిన్, ఆమెతో పాటు ఉండే మహిళా డైవర్లు మత్స్య సంపద అంతరించి΄ోకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. స్వీయ–నియంత్రణ ΄ాటిస్తూ సముద్ర పర్యావరణ వ్యవస్థను సంరక్షించే చర్యలు చేపడుతున్నారు. హానికరమైన మత్స్య జాతుల నుంచి ఒబుంజాక్‌ (ఒక రకమైన అబలోన్‌) వంటి స్థానిక జాతులను కాపాడుతున్నారు. మహిళా డైవర్లు తాము ఆహారం కోసం వేటాడే వారిలా మాత్రమే కాకుండా సముద్ర జీవుల సంరక్షకులుగా తమను తాము భావిస్తారు. స్థానిక సముద్ర జలాలను దురాక్రమణ చేసే స్టార్‌ ఫిష్‌లను స్థానిక ప్రభుత్వ మద్దతుతో చంపే పని కూడా చేస్తున్నారు.

కొత్త యుగం
సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ జెజు హెన్యో సంస్కృతిపై ప్రజలకు ఆసక్తి పెరుగుతోంది. 2016లో యునెస్కో జెజు హెన్యో సంస్కృతిని యావత్‌ మానవాళి అవ్యక్త సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) జెజు హెన్యో మత్స్యకార వ్యవస్థను ‘ప్రపంచవ్యాప్తంగా అతిముఖ్యమైన వ్యవసాయ వారసత్వ వ్యవస్థ’గా 2023లో ప్రకటించింది. సముద్ర జీవవైవిధ్యం, హానికరం కాని రీతిలో వేట పద్ధతులు అనుసరించటం, అసాధారణమైన సామాజిక నీతి సంరక్షకులుగా హెన్యో మహిళా డైవర్లకు గల ప్రాముఖ్యతను ఎఫ్‌ఏఓ గుర్తించి  ప్రోత్సహిస్తోంది. 

జెజు ప్రత్యేక స్వయం పాలిత రాష్ట్రంలో ఏర్పాటైన హెన్యో సాంస్కృతిక వారసత్వ విభాగం డైరెక్టర్‌ క్యుంగ్‌–హో కో మాట్లాడుతూ ఈ గుర్తింపు ప్రాముఖ్యతను ఇలా వివరించారు.. ‘ఇది జెజు హెన్యో వ్యవస్థను ఉన్నతీకరిస్తుంది.  ఈ విలువైన వారసత్వాన్ని భవిష్యత్‌ తరాలకు అందించడానికి సహాయపడుతుంది. స్థానిక సమాజం అభివృద్ధికి దోహదపడుతుంద’ని ఆయన అన్నారు. ‘కఠినమైన పని పరిస్థితులు, పర్యావరణ మార్పులు, తగ్గుతున్న సముద్ర వనరులు, వృద్ధాప్యం, కొత్తగా ఈ పనిలోకి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండటం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, తమ జీవనోపాధిని కొనసాగించే మహిళల బలమైన ఆకాంక్షను ఎఫ్‌ఏవో గుర్తింపు బలోపేతం చేస్తోంది’ అన్నారాయన. 

హెన్యో జీవన విధానాన్ని కాపాడుకోవడానికి జెజు ప్రభుత్వం కృషి చేస్తోంది. సముద్ర మహిళల సంక్షేమం కోసం, వారి ఆదాయాన్ని పెంపొందించడానికి, వారి పని వాతావరణాన్ని మెరుగుపరచటం ద్వారా హెన్యో సంస్కృతిని సంరక్షించడానికి ఈ సంవత్సరం 2 కోట్ల అమెరికన్‌ డాలర్ల మేరకు ప్రభుత్వం పెట్టుబడి పెట్టిందని డైరెక్టర్‌ క్యుంగ్‌–హో కో వివరించారు. డైవింగ్‌ సంబంధిత గాయాలకు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. అరవై, డెబ్బయి ఏళ్లు దాటిన హెన్యోలకు ఆర్థిక భత్యాలు ఇస్తున్నారు. 75 ఏళ్లు పైబడిన వారికి పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తున్నారు. హెన్యో పండుగలు, ఆచారాల ప్రోత్సహించటం, కొత్త తరం మహిళలకు హెన్యో నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడానికి పాఠశాలలను కూడా నిర్మించటం విశేషం.

ఉద్యోగం కంటే ఎక్కువ..ఒక జీవన వారసత్వం! 
వేగవంతమైన ప్రపంచంలో జెజులోని హెన్యో సమాజం పర్యావరణ స్పృహతో కొనసాగుతోంది. ప్రకృతిని మనుషులు ఉపయోగించుకునే క్రమంలో పర్యావరణ పరిమితులను గౌరవిస్తుంది. పరస్పరం ఆధారపడటాన్ని విలువైనదిగా భావించే జీవన విధానాన్ని కొత్త తరాలకు చాటిచెప్పే ఉదాహరణగా నిలుస్తుంది. 

‘ప్రజలు ఈ పనిని ‘3డి ఉద్యోగం’ అని పిలుస్తారు. మూడు డీలు అంటే.. డర్టీ, డేంజర్, డిమాండింగ్‌తో కూడిన పని అని చెబుతుంటారు. కానీ నా మటుకు నాకు, ఇది అత్యున్నతమైన సంతృప్తినిచ్చే పని అనిపిస్తుంటుంది’ అన్నారు 42 ఏళ్ల ర్యుజిన్‌. ‘నేను నీటి అడుగున ఉన్నప్పుడు, నేను జీవించడం గురించి మాత్రమే ఆలోచిస్తాను. అంతకుమించి అతిగా ఆలోచించడం మానేశాను’ అంటారు ర్యుజిన్‌. ‘సముద్రం నా రెండో తల్లి. నేను సముద్రపు తల్లి ఒడిలో ఈదులాడుతూ చాలా స్వస్థత పొందాను. ఈ తల్లి నాకు చాలా ఇచ్చింది..’ అంటారామె ఉద్వేగంగా! ‘నాకు నలుగురు పిల్లలు. ప్రతి ఉదయమూ జీవన పోరాటమే. కానీ సముద్రం వైపు వెళుతున్నప్పుడు మాత్రం నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజు సముద్రం నాకు ఏమి ఇస్తుందో అన్న ఉత్సుకత కలుగుతుంది. స్వస్థత చేకూర్చే నిరంతర ప్రవాహంలా జీవితం గడచిపోతోంది’ అన్నారామె. ‘జెజులో మహిళలది ఎల్లప్పుడూ కీలక పాత్రే. నాకు, హెన్యో అంటే మహిళలు, మహిళలు అంటే హెæన్యో. ఇది గొప్ప గర్వకారణం...’ అన్నారు.

కనుమరుగవుతున్న వారసత్వం
హెన్యో వ్యవసాయ వారసత్వ సంప్రదాయానికి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1,105వ సంవత్సరం నుంచి ఈ వ్యాపారాన్ని ప్రస్తావించిన రికార్డులున్నాయి. జెజు మహిళలు ఎల్లప్పుడూ ఆ ద్వీపం జీవితానికి వెన్నెముకగా ఉన్నారు. మత్స్యకారులుగా, రైతులుగా, తల్లులుగా, ఎక్కువగా వీళ్లదే ఇళ్లలో ముఖ్యమైన సంపాదనగా ఉంటుంది.

1970లలో 14,000 మంది హెన్యోలు ఉన్నారు. కానీ, 1980 తర్వాత కాలంలో చాలా మంది మహిళలు ఈ పనిని విడిచిపెట్టి పర్యాటక, టాన్జేరిన్‌ పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. ప్రస్తుతం 2,700 హెన్యోలు ఉన్నారు. అయితే, వారిలో చాలా మంది డెబ్బై, ఎనభై– ఏళ్ల వయస్కులే! 42 సంవత్సరాల వయస్కురాలైన ర్యుజిన్‌ సముద్రంలోకి వెళ్లే అతి పిన్న వయస్కుల్లో ఒకరు. ర్యుజిన్‌ గ్రామంలో 83 మంది చురుకైన హెన్యోలు ఉన్నారు. ఈ సంవత్సరం పది మంది పదవీ విరమణ చేయాలని ప్లాన్‌ చేసుకుంటున్నారు. ర్యుజిన్‌ తరంలో డైవర్లు పని నేర్చుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. ‘భవిష్యత్తులో నేను ఒంటరిగా డైవింగ్‌ చేయవలసి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నాను. అందుకే నేర్చుకోవాలనుకునే వారెవరినైనా స్వాగతిస్తున్నాను. నాకు తెలిసిన ప్రతి నైపుణ్యాన్నీ వారికి నేర్పుతాను’ అని ర్యుజిన్‌  చెప్పారు. 

20 మీటర్లు.. 2 నిమిషాలు...
స్వేచ్ఛా డైవింగ్‌ చేసే జెజు మత్స్యకార మహిళలు తమ శ్వాసను ఉగ్గబట్టుకునే సామర్థ్యం, సముద్ర జలాల్లోకి దూసుకెళ్లే నైపుణ్యం, సముద్రపు నీటి అడుగున ఏయే తావుల్లో తమకు అవసరమైన ఆహారం ఎక్కడెక్కడ ఉంటుందో గ్రహించే సంప్రదాయ విజ్ఞానం, జ్ఞాపక శక్తిని మాత్రమే ఆయుధాలుగా ఉపయోగించి సముద్రపు లోతుల్లోకి సాహసంతో దూకేస్తారు. ఆక్సిజన్‌ ట్యాంకులు లేకుండా వారు డైవ్‌ చేయగలరు. ఒకటి–రెండు నిమిషాలు తమ శ్వాసను స్తంభింపజేసుకోగలరు. ఆ కొద్ది సమయంలోనే ఐదు నుండి 20 మీటర్ల లోతుకు డైవ్‌ చేయగలరు. రోజుకు ఏడు గంటల పాటు సముద్రంలో గడపటం వారికి వెన్నతో పెట్టిన విద్య.  

ప్రతి అక్టోబర్‌ 16 నాడు ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ర్యుజిన్‌ వంటి ‘ఫుడ్‌ హీరో’ల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఇటువంటి సంప్రదాయ విజ్ఞానంతో కూడిన గొప్ప జీవన నైపుణ్య సాంప్రదాయ వారసత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరాన్ని ఈ తరం గుర్తించేలా చెయ్యటం మన కర్తవ్యం.

– నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement