మహిళల నీటి కష్టాలు మూడురెట్లు! | Sagubadi: Global water crisis aggravated by gender inequalities | Sakshi
Sakshi News home page

మహిళల నీటి కష్టాలు మూడురెట్లు!

Mar 20 2026 5:44 PM | Updated on Mar 20 2026 6:54 PM

Sagubadi: Global water crisis aggravated by gender inequalities

ప్రపంచంలో మన దేశానికి ఉన్నది 4% మంచినీరు మాత్రమే. కానీ, ప్రపంచ జనాభాలో 18% మన దేశంలోనే నివశిస్తున్నారు. నీటి కొరత ఇప్పటికే మనకు పెనుసవాలుగా మారింది. ముఖ్యంగా వేసవిలో నీటి చుక్క కోసం అల్లాడే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ప్రతిరోజూ నీటి సేకరణకు 25 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇది పురుషులు, బాలురు వెచ్చిస్తున్న దాని కంటే 3 రెట్లు ఎక్కువ. 

నీటి గణాంకాల గురించి సాధారణంగా క్యూబిక్‌ మీటర్లలో చెబుతూ ఉంటాం. కానీ ఈ ప్రతి సంఖ్య వెనుక ఒక మానవ ముఖం ఉంది. ఆ ముఖం, చాలా సార్లు, మహిళదే! ఇది కల్పన కాదు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో, యూఎన్‌ ఉమెన్, భారత జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాల సహితంగా నమోదు చేసిన వాస్తవం ఇదే. నీటి భద్రతే లింగ సమానత్వానికి భూమిక.

ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మార్చి 22న ‘ప్రపంచ నీటి దినోత్సవం’ నిర్వహిస్తూ మనలో నీటి చైతన్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది ఇతివృత్తం: ‘ప్రజలందరికీ నీరు: స్త్రీ పురుషులకు సమాన హక్కులు– సమాన అవకాశాలు’. నీటి దినోత్సవ ప్రచార నినాదం: ‘నీరు ప్రవహించే చోట, లింగ సమానత్వం వికసిస్తుంది’! అది సాగు నీరైనా, తాగు నీరైనా సరే.. నీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అయినా మహిళల అభిప్రాయాలకు, ఆకాంక్షలకు సముచితమైన చోటివ్వటం ద్వారా సమానత్వాన్ని వికసింపజేయాలని ఐరాస పిలుపునిస్తోంది! ఇది మనందరం ఆలకించాల్సిన మానవీయమైన పిలుపు!!

వ్యవసాయానికి అవసరమైన శ్రమను, గృహ, ఉత్పాదక అవసరాలకు నీటిని అందించడంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ.. అధికారిక నీటి నిర్వహణ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల నుంచి వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నారు. వ్యవసాయ పనులను 37%–42% వరకు మహిళలే చేస్తున్నారు. ఒక పంట కాలంలో సగటున 3,300 గంటలు పనిచేస్తారు. పురుషుల 1,860 గంటలు మాత్రమే. 

కలుపు తీయటం, మొక్కలు నాటటం, నీరు పెట్టటం వంటి చేతులతో చేసే పనులు, ఎక్కువ నీరు అవసరమయ్యే పనులతో ΄ాటు, పశువులకు నీరు పెట్టటం వంటి పశు΄ోషణ పనుల్లో ఎక్కువ భాగాన్ని చక్కబెట్టే బాధ్యతలను మహిళలు నెరవేర్చుతున్నారు. క్షేత్ర స్థాయిలో వీరే ‘వాస్తవ‘ నీటి నిర్వాహకులు అయినప్పటికీ, వారి ΄ాత్రను తక్కువగా చూస్తున్నారు. 

టైమ్‌ పావర్టీ
భూగర్భ జలమట్టాలు తగ్గి΄ోతున్నందున, మహిళలు నీటిని తెచ్చుకోవడానికి మరింత దూరం ప్రయాణించవలసి వస్తుంది. మన దేశంలో మహిళలు కొన్నిసార్లు దీనికోసం రోజూ నాలుగు గంటల వరకు సమయం వెచ్చిస్తున్నారు. బుందేల్‌ఖండ్, విదర్భ, రాయలసీమ వంటి కరువు పీడిత ప్రాంతాల్లో వేసవికాలంలో 15–20 లీటర్ల బిందెలను నెత్తిన పెట్టుకని రోజుకు 5–20 కిలోమీటర్ల దూరం నడచి మరీ కుటుంబాలకు మహిళలు, బాలికలు నీటిని సమకూర్చుతున్నారు.  

ఒక అంచనా ప్రకారం.. గ్రామీణ భారతీయ మహిళ నీటి సేకరణ కోసం 210 గంటల (27 పూర్తి పనిదినాలకు సరిపడా) సమయాన్ని ప్రతి ఏటా కేటాయిస్తోంది. ఇంటì  దగ్గరకే కుళాయి వస్తే ఈ సమయం అంతా మహిళలకు ఆదా అవుతుంది. ఈ శ్రమకు విలువ కడితే దేశం యావత్తూ ఒక రోజు ఆర్జించే ఆదాయానికి సమానం. ఈ పనుల వల్ల మహిళలు, బాలికలకు తీరిక దొరక్క (టైమ్‌ పావర్టీ) చదువు లేదా మరింత లాభదాయకమైన వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నారు. 

కేవలం 5% మంది మహిళలకు మాత్రమే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. సోలార్‌ పంపులు  వంటి వాతావరణ మార్పుల్ని తట్టుకునే టెక్నాలజీలు అందుబాటులో లేవు. అందు వల్ల, మహిళా రైతులు ఎక్కువగా కరువు బాధితులుగా మారుతున్నారు.   

వాతావరణ మార్పులను తట్టుకోగల సేంద్రియ వ్యవసాయ నమూనాలకు మహిళా రైతులు పెద్దపీట వేస్తున్నారు.  చిరుధాన్యాలను పండించటం, ఆహారంలో భాగం చేసుకోవటంలోనూ మహిళా రైతులు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ ఆహార భద్రతను పెంచుతాయని, నీటి వినియోగాన్ని తగ్గిస్తాయని అనేక సంస్థల అనుభవాలు నిరూపించాయి.

పురుషులతో పోలిస్తే మహిళలు వాతావరణ మార్పుల పట్ల ఎక్కువ సున్నితంగా ఉంటారని చటర్జీ (2021) అధ్యయనంలో వెల్లడైంది. నీటి లభ్యత, వ్యవసాయ ఉత్పాదకత, పశువుల సమస్యలు వంటి వివిధ రంగాలలో పురుషుల కంటే మహిళలే వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎక్కువగా గమనిస్తారని కూడా అధ్యయనాలు ఎత్తి చూపుతున్నాయి. 

2011 జనాభా లెక్కల ప్రకారం, దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 55%–65% వాటా మహిళా రైతులదే. పురుష రైతులు వ్యవసాయ రంగాన్ని విడిచిపెట్టి, వ్యవసాయేతర రంగాలలో కూలీలుగా మారుతున్న ప్రస్తుత ధోరణిని బట్టి చూస్తే, భారతదేశంలో మహిళా రైతుల సంఖ్య పెరుగుతోంది.

లింగ సమానత్వానికి అడ్డంకులు
మన దేశంలో నీటి హక్కులు సాధారణంగా భూ యాజమాన్యంతో ముడిపడి ఉంటాయి. సాగులో ఉన్న భూముల్లో కేవలం 13.5% మాత్రమే మహిళల ఆధీనంలో ఉన్నాయి. అధికారిక నీటి వినియోగదారుల సంఘాలు, సాగునీటి హక్కుల విషయంలో నిర్ణయాలు తీసుకోవటంలో మహిళల పాత్ర అంతంత మాత్రంగా మిగిలిపోయింది.

సమావేశాలకు హాజరు కావడానికి భర్త అనుమతి అవసరం కావడం, వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం లేకపోవడం, ‘నీటిపారుదల పురుషుల పని’ అనే భావన వంటివి నీటి నిర్వహణలో లింగ సమానత్వానికి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. 2012లో ప్రభుత్వం ప్రకటించిన జాతీయ జల విధానం మహిళల అవసరాలను ప్రస్తావించింది. అయినప్పటికీ, జల పరిపాలనలో పురుషులతో సమానంగా మహిళలకు నిజంగా అవకాశాలు కల్పించడానికి ఇందులో నిర్దిష్ట మార్గదర్శకాలు లేవని విమర్శకులు వాదిస్తున్నారు.  

మహిళల మహా శ్రమ

ప్రతి రోజూ 20 కోట్ల మంది భారతీయులు నడిచి వెళ్లి దూరం నుంచి నీటిని తెచ్చుకుంటారు. వీరిలో అత్యధికులు మహిళలు, బాలికలు (భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ). 

భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది, అంటే 60 కోట్ల మంది, తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు (నీతి ఆయోగ్‌ సీడబ్ల్యూఎంఐ 2018). 

ప్రభుత్వం అమలు చేస్తున్న జల్‌ జీవన్‌ మిషన్‌ ఫలితంగా ప్రతిరోజూ మహిళలు నీటిని తెచ్చేందుకు ఖర్చు చేసే 5.5 కోట్ల గంటల సమయం ఆదా అవుతోంది (జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ, 2023).

ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ప్రతిరోజూ నీటి సేకరణకు 25 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇది పురుషులు, బాలుర కంటే 3 రెట్లు ఎక్కువ (యూఎన్‌ ఉమెన్, 2024).

ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా మహిళలు, అంటే మొత్తం మహిళల్లో 27 శాతానికి పైగా, సురక్షిత తాగునీటి సేవలను పొందలేకపోతున్నారు (యూఎన్‌ ఉమెన్‌/యూఎన్‌డిఈఎస్‌ఏ, 2023).

సురక్షితమైన తాగునీరు అందక భారతదేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది మరణిస్తున్నారు (నీతి ఆయోగ్‌ సీడబ్ల్యూఎంఐ).

మన దేశంలోని నదులు, రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిలో 70 శాతం కలుషితమైంది. జల నాణ్యత సూచికలో 122 దేశాల్లోకెల్లా భారతదేశం 120వ స్థానంలో, చివరి నుంచి మూడో స్థానంలో, ఉంది (నీతి ఆయోగ్‌ / ప్రపంచ బ్యాంకు). 

ప్రపంచవ్యాప్తంగా 14% దేశాల్లో నీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొనడానికి ఇప్పటికీ ఎలాంటి యంత్రాంగాలు లేవు (యూఎఈ ఈపీ–డీహెచ్‌ఐ, జీడబ్ల్యూపీ, యూఎన్‌ ఉమెన్, 2025).

నీటిపారుదల సామర్థ్యం
వ్యవసాయరంగంలో నీటిపారుదల సామర్థ్యం ప్రపంచ సగటు 50–60%. మన దేశ వ్యవసాయ నీటిపారుదల సామర్థ్యం కేవలం 38% మాత్రమేనని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. పంటలకు నీటి వినియోగ సామర్థ్యాన్ని 60%కి పెంచితే, ఏటా 200 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం) పైగా నీరు అందుబాటులోకి వస్తుంది. ఇది గృహ, పారిశ్రామిక అవసరాల కొరత మొత్తాన్ని తీర్చడానికి సరి΄ోతుందని నీతి ఆయోగ్‌ అంచనా.

సమానమైన దిగుబడి కోసం అమెరికా, చైనా లేదా ఇజ్రాయెల్‌లోని రైతులతో ΄ోలిస్తే భారతీయ రైతులు (ఒక్కో పంట యూనిట్‌కు) 3–5 రెట్లు ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్నారు. ఇది రైతుల వైఫల్యం కాదు. ఇది విధానపరమైన మౌలిక సదుపాయాల వైఫల్యమని నీతి ఆయోగ్‌ / ఎఫ్‌ఏఓ తేటతెల్లం చేశాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలను తోడే దేశం భారతదేశం. ఏటా 239–241 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని తోడేస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా తోడుతున్న నీటిలో నాలుగో వంతు కంటే ఎక్కువ. 1,592 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని అధికంగా వినియోగిస్తున్నామని అంచనా.

భారతదేశంలోని నదులు, చెరువులు, రిజర్వాయర్లు, కాలువల్లోని 70% నీరు కలుషితమయ్యాయి. జల నాణ్యత సూచికలో 122 దేశాలలో భారతదేశం 120వ స్థానంలో ఉంది. మనం కేవలం నీటిని కోల్పోవడమే కాదు, మిగిలి ఉన్న నీటిని కూడా విషపూరితం చేస్తున్నామని నీతి ఆయోగ్‌/ప్రపంచ బ్యాంకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.  

మహిళలకే గ్రామస్థాయి జల నాయకత్వం 
నీటి సేకరణకు అనుదినం మహిళలు, బాలికలు వెచ్చించే సమయం నుంచి ఆదా చేసే ప్రతి గంట సమయమూ.. మహిళాభివృద్ధిలో, విద్యలో, వాణిజ్యంలో, సమాజ పరివర్తనలో పెట్టుబడిగా పెట్టడానికి అదనంగా దొరికిన సమయమే. నీటి భద్రత, లింగ సమానత్వం అనేవి వేర్వేరు అంశాలు కావు. నీటి భద్రతతోనే లింగ సమానత్వం సాధ్యం. ఒకే సంక్షోభం, ఒకే అవకాశం. 

జల్‌ జీవన్‌ మిషన్‌ సహా ప్రభుత్వ నీటి పథకాలన్నిటికి సంబంధించి గ్రామ స్థాయిలో మహిళలను ప్రాథమిక జల పరిపాలన నాయకులు’గా అధికారికంగా గుర్తించాలి. నీటిని పరిపాలన బాధ్యతలు మహిళలకిస్తే సమాజాలు అభివృద్ధి చెందుతాయని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 5, 6 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, విక్సిత్‌ భారత్‌ లక్ష్యం కూడా తద్వారా 
నెరవేరుతాయి. 
– మర్ది కరుణాకర్‌ రెడ్డి, ఇగ్నైటింగ్‌ మైండ్స్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకులు, జల సంరక్షణ ప్రచార కార్యకర్త


– నిర్వహణ: 
పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడి డెస్క్‌ 

(చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement