రాయల్స్‌ రెడ్‌ శాల్యూట్‌ | Rajasthan Royals Playing With Period Pad Company Logo In 2020 Season | Sakshi
Sakshi News home page

రాయల్స్‌ రెడ్‌ శాల్యూట్‌

Aug 24 2020 12:22 AM | Updated on Aug 24 2020 12:36 AM

Rajasthan Royals Playing With Period Pad Company Logo In 2020 Season - Sakshi

క్రికెటర్‌లు వండర్స్‌ చేయగలరు. ఆటలోనే కాదు.. ఆడుతూనే.. ఆట బయట కూడా! లెటజ్‌ టాక్‌ పీరియడ్స్‌.. అంటూ.. ఈ ఏడాది ‘రాజస్థాన్‌ రాయల్స్‌’ మగవాళ్లలో ఉండే ‘దూర’ భావనను.. స్టంప్‌ అవుట్‌ చేయబోతోంది! పీరియడ్స్‌ ప్యాడ్‌ కంపెనీ లోగో ఉన్న జెర్సీలతో ఐపీఎల్‌ ఆడబోతోంది. రాయల్స్‌ టీమ్‌.. విత్‌ రెడ్‌ శాల్యూట్‌. 

క్రికెట్‌ని ఒకప్పుడు ‘జెంటిల్మన్స్‌ గేమ్‌’ అనేవాళ్లు. ఆట ఇంగ్లండ్‌లో మొదలైప్పుడు సంపన్నులు, సాంఘికంగా పెద్ద హోదాల్లో ఉండేవాళ్లు.. వాళ్లలో వాళ్లు క్లబ్బులు ఏర్పాటు చేసుకుని ఆడేవాళ్లు. అందుకు జెంటిల్మన్స్‌ గేమ్‌ అయింది. అప్పటి క్లబ్బుల ఆటే.. ఇప్పటి ఫ్రాంచైజ్‌ల ఐపీఎల్‌ ఆట. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. ఈ జెంటిల్మన్స్‌ గేమ్‌ లో ఈసారి ‘రాజస్థాన్‌ రాయల్స్‌’.. పీరియడ్స్‌ ప్యాడ్స్‌ తయారు చేసే ప్రసిద్ధ భారతీయ కంపెనీ ‘నీన్‌’ (ఎన్‌.ఐ.ఐ.ఎన్‌.ఇ.) లోగో ఉన్న జెర్సీలను ధరించి ఆడబోతోంది! అంటే.. జెంటిల్మన్స్‌ గేమ్‌ లో జెంటిల్మన్‌ టీమ్‌! ఒక పురుషుల జట్టు ఈ విధంగా స్త్రీల ఉత్పత్తుల కంపెనీ లోగో ఉన్న జెర్సీ వేసుకుని ఆడటం క్రికెట్‌ చరిత్రలోనే ఇది తొలిసారి కావచ్చు. పైగా లిప్‌స్టిక్కో, లెగ్గింగ్సో కాదు.. పీరియడ్‌ ప్రాడక్ట్‌!

ఐపీఎల్‌ ఎనిమిది జట్లలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఒకటి. 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో తొలి విజేత కూడా రాజస్థాన్‌ రాయల్సే. ఈ ఏడాది ఐపీఎల్‌ జరగబోతున్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి ఇప్పటికే టీమ్‌లన్నీ చేరుకున్నాయి. సెప్టెంబర్‌ 19 న మొదలయ్యే ఐపీఎల్‌ టీ–20 మ్యాచ్‌లు నవంబర్‌ 10 వరకు దుబాయ్, షార్జా, అబు ధాబి స్టేడియంలో జరుగుతాయి. మ్యాచ్‌లు జరిగినన్నాళ్లూ రాజస్థాన్‌ రాయల్స్‌ ధరించే జెర్సీపై ‘నీన్‌’ కంపెనీ లోగో ఉంటుంది. ఆ లోగోలో ఎర్రటి చుక్క ఉంటుంది.

పీరియడ్‌ డాట్‌ అది! నెలసరిని సంకేతపరిచే రక్తపు చుక్క. మహిళల పీరియడ్స్‌ విషయం లో పురుష సమాజంలో ఉండే ‘వెలి’ వంటి దూర భావనను పోగొట్టడం కోసం ‘లెటజ్‌ టాక్‌ పీరియడ్స్‌’ అని చెప్పేందుకు రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రాంఛైజ్‌.. ‘నీన్‌’ లోగోను తమ జెర్సీల మీదకు మనస్ఫూర్తిగా స్వీకరించింది. డబ్బులకే కదా.. ఇందులో మనస్ఫూర్తి ఏమిటి? క్రికెట్‌ అంటే.. అదీ ఐపీఎల్‌ అంటే ఎన్ని పెద్ద కంపెనీలు ముందుకు రావు! వాటిని కూడా కాదనుకుని మహిళలను సపోర్ట్‌ చేస్తూ పురుషులకు ఒక మంచి మాట చెప్పడానికి క్రికెటర్‌ల ఒంటి మీద కొంచెం చోటు ఇవ్వడం.. మనస్ఫూర్తే కదా. 

స్త్రీ శ్రమను గుర్తించి ఆమెకు చేదోడుగా ఉండటం, స్త్రీ దేహధర్మాల రీత్యా ఆమెకు విశ్రాంతినివ్వాలని మనసుకు తోచడం వంటి ‘ఎంపథీ’ని (సహానుభూతి) ఇంకొకరు కలిగిస్తేనే గానీ కదలలేని స్థితిలోనే పురుషులు ఎప్పుడూ ఉంటారు. జెండర్‌ పరిణామ క్రమంలో అతడింకా.. క్రికెట్‌ చూస్తూ వర్షం పడుతుంటే పకోడీల కోసమో, చలిగా ఉంటే ఆమ్లెట్‌ కోసమో వంటింట్లోకి ఆర్డర్‌ వేసే దశలోనే ఉన్నాడు. ఇటీవల ఒక మహిళ.. ప్రధాని మోదీకి ఒక విన్నపం చేశారు. ‘లాక్‌డౌన్‌లో నాకు ఇంటి పని ఎక్కువైంది. మావారు బ్యాంక్‌ ఆఫీసర్‌. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. ఇంట్లో చిన్న సహాయం కూడా చెయ్యరు. ప్రాణం వేసారిపోతోంది.

ఈసారి మీరు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు భర్తలు తప్పనిసరిగా భార్యలకు ఇంటి పనుల్లో సాయం చేయాలని చెప్పండి’ అని అభ్యర్థించారు. ప్రధాని చెబితే పురుషులు ఎంతవరకు వింటారో కానీ ఒక ఆలోచననైతే ఆయనకు కలిగించవచ్చు. ఆట అది ఏదైనా ప్రధాని మాటకంటే శక్తిమంతమైనది. ప్రతి ఆటలోనూ సందేశం ఉంటుంది. అసలు.. సందేశం ఇవ్వడానికే మొదలైనవి ఒలింపిక్స్‌. ‘ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్‌’ అనేది ఒలింపిక్స్‌ ఆదర్శ వాక్యం (మోటో). ‘గెలుపు కన్నా పోరాటం ఘనమైనది’ అంటాడు ఆధునిక ఒలింపిక్స్‌కు ఆద్యుడు పియరీ డి క్యుబర్టీన్‌. క్రికెట్‌కి ఆదరణ లభించాక.. ఏ ప్లేయర్‌కి ఆ ప్లేయర్‌ ఆదర్శాన్ని ప్రబోధించ దగినంత శక్తిమంతులయ్యారు. టీమ్‌లకూ ఆ ఇమేజ్‌ వచ్చింది. 

అయితే రాజస్థాన్‌ రాయల్స్‌.. స్పాన్సర్‌షిప్పులలో మునుపెన్నడూ లేని విధంగా.. ఒక సామాజిక జెండర్‌ సంస్కరణ సందేశంతో పెవిలియన్‌ నుంచి పిచ్‌లోకి దిగబోతోంది. ‘‘ఇదసలు చాలా మంచి విషయం’’ అని ఇంగ్లండ్‌ ఉమెన్స్‌ టీమ్‌ క్రికెటర్‌ డెన్యాల్‌ వ్యాట్‌ ఆశ్చర్యపడుతూ ‘రాయల్స్‌’కి ఇప్పటికే అభినందనల పూలగుచ్ఛం కూడా పంపారు. రుతుస్రావ స్థితిని అర్థం చేసుకోవడం గురించి క్రికెట్‌ దిగ్గజాలే ‘ఓపెన్‌’గా మాట్లాడుతున్నప్పుడు.. సిక్సర్‌లా స్టాండ్స్‌లోకి వచ్చిన బంతిలాంటి ఆ సందేశాన్ని పురుషులు, బాలురు క్యాచ్‌ పట్టడానికి ఉత్సాహం చూపకుండా ఉంటారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement