ఊరూరి సాంస్కృతిక దస్తూరి

Oori Dasthuri Book Review By Dr Nalimela Bhaskar  - Sakshi

ఆవిష్కరణ

ఈవెంట్‌
60 యేళ్ల యాకూబ్‌: కవి, ‘కవి సంగమం’ స్థాపకుడు యాకూబ్‌ 60 ఏళ్ల సందర్భంగా వెలువడనున్న ప్రత్యేక సాహిత్య సంచిక కోసం వ్యాసాలను కోరుతున్నారు. సంచిక కమిటీ సభ్యులు: పలమనేరు బాలాజీ, చల్లపల్లి స్వరూపరాణి, నూకతోటి రవికుమార్, వంశీకృష్ణ, అన్వర్, గుడిపాటి. సెప్టెంబర్‌లోగా రచనలు పంపాల్సిన మెయిల్‌:  yakoobkavi@gmail.com

ఇది ఊరి దస్తూరి. ఇది ఒక ఊరి రాత. పట్టణాల, నగరాల రాతలు భ్రమలు గొల్పుతాయి. మనలో మరులు పుట్టిస్తాయి. అవి గుండెని చేరని కంటికింపు రాతలు. అన్నవరం దేవేందర్‌ మాటల్లోనే ‘ఊరు అంటే ఒగలకొగలు సుట్టాల్లెక్క. ఊరంటే శిన్నతనం యాది. ఊరంటే శిన్నప్పటి సోపతి. ఊరంటే పులకింత. ఊరంటే ఎవుసం ఎద్దు బాయి బంధం’. ఈ దస్తూరిలో ప్రజల ఆశా నిరాశలు, ఆహార విహారాలు, చావు పుట్టుకలు, పెండ్లిళ్లు, మన కళ్ళకు సహజంగా కన్పిస్తాయి. అన్నవరం కవి కావడం వల్లా, తెలంగాణ జీవద్భాషలో చక్కటి కవిత్వ రచన చేస్తున్న కారణంగా విషయ వివరణలో ఆ కవితాగంధం చాలాచోట్ల కనిపిస్తుంది.  

ఊరి సంతోషాల్నే కాదు, దుఃఖాన్ని సైతం సజీవంగా నిల్పుతాడు దేవేందర్‌. ‘ఎవరు మరణించినా ఊరంతా దుక్క సముద్రమైతది’. అంతేగాక సద్దుల బతుకమ్మనాడు కూడ బర్రెల్ని కొట్టుకపోతూ జీవితంలో సెలవులు ఎరగని బర్ల కాసెటాయన వేదనను లిఖిస్తాడు. మనుషుల్ని ‘ఆయన కొంచెపోడు, నడుమంత్రపోడు, పిసినారోడు’... ఇట్లా వాళ్ళ వాళ్ళ గుణకర్మల్ని బట్టి వర్గీకరిస్తాడు. మనుషుల వింగడింపుతో ఆగక గొర్రెల్ని వాటి రంగుల్ని, శరీరాకృతుల్ని బట్టి క్లాసిఫై చేసిన పల్లె ప్రజల మాటల మూటల్ని మనముందు విప్పుతాడు. ‘ఎలగాళ్ళ గొర్రె’, ‘అంబిగాళ్ళ గొర్రె’. ఎలగాళ్ళ అంటే తెల్లకాళ్ళ గొర్రె అట! అంటే ఏమిటి? బహుశా వెల్ల కాళ్ళు అయివుండాలి. అట్లాగే మేకల్లో, ఎడ్లల్లో వున్న రకాలు వివరిస్తాడు. ఈ వయ్యిలో కట్టె పలక బలపం నుంచి డిజిటల్‌ పాఠాల తరం వరకు మారుతున్న ప్రపంచం చూస్తే మార్పు అవసరమే, ఆధునికతా అవసరమే అన్పిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న మూలాల పట్ల కూడా ఒక దృష్టి, ఒక జ్ఞాపకం నెమరువేసుకోవచ్చు. ‘ఎంత ఎత్తుకు ఎదిగినా మానవ సంబంధాల పట్ల ప్రేమ దయ ఉండాల్సి వుంది. ఫక్తు పైసల సదువు కాకుండా జీవితపు కళ తెలిసిన చదువులు పెరగాల్సి వుంది’ అంటున్నాడు రచయిత.

ఊరి దస్తూరి పేరుతో శతానేక విషయాలు ప్రస్తావిస్తాడు. ‘బతుకమ్మ అంటే సంగ సంగ ఎగురుడు కాదు’ అనేస్తాడు, ఈనాడు ఆడుతున్న బతుకమ్మను చూసి. ఊర్లల్ల మునుపు పెట్టుకున్న ‘వంకాయ తమాటల వరుగులు’ కుప్పబోస్తాడు. కొత్తగడ్డి మోపు నుండి అదోరకమైన వాసనతోపాటు పాతగడ్డిలోంచి వస్తున్న చీకిపోయిన ముక్క పట్టిన వాసనను సైతం మన ముక్కుపుటాలకు అందిస్తాడు. ‘కోడిపుంజు అంటేనే రంగురంగుల అందమైన ఈకలు– కొక్కొరోకో అనే జ్ఞాపకం వస్తది. ఇప్పుడన్ని తెల్ల కోళ్ళే’ అంటాడు. పల్లెల్లో ‘గ్యాసునూనె, ఉప్పు, బెల్లం మాత్రమే కొనుడు’ ఉండేదని గుర్తు చేస్తాడు. అటువంటి స్వయం ప్రకాశక గ్రామాన్ని ప్రపంచీకరణ పూర్తిగా ధ్వంసం చేసింది. ఊరికి సంబంధించిన సమస్త అంశాలను నమోదు చేసిన సామాజిక శాస్త్రం యిది.
(ఊరి దస్తూరి సెప్టెంబర్‌ 11న పోతారం (ఎస్‌) ఊరిలో విడుదల కానుంది.)
డాక్టర్‌ నలిమెల భాస్కర్‌
ఊరి దస్తూరి
రచన: అన్నవరం దేవేందర్‌; పేజీలు: 352; వెల: 250; ప్రచురణ: సాహితీ సోపతి; 
రచయిత ఫోన్‌: 9440763479 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top